ఏపీలో దిగజారుతున్న శాంతి భద్రతల పరిస్ధితిపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మంగళవారం గవర్నర్ నరసింహన్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: ఏపీలో దిగజారుతున్న శాంతి భద్రతల పరిస్ధితిపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మంగళవారం గవర్నర్ నరసింహన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. పోలింగ్ సమయంలో టీడీపీ నాయకులు చేసిన అరాచకాలపై కేసులు బుక్ చేయాలని ఆయన గవర్నర్ ను కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇనుమెట్లలో స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు పోలింగ్ బూత్ లోకి చొరబడి డోర్ లాక్ చేసుకున్నారని ఆయనపై కేసు బుక్ చేయాలని గవర్నర్ కు ఇచ్చిన వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. గురజాలలో ఓట్లు వేయలేదనే అక్కసుతో టీడీపీ నాయకులు ముస్లింలు, ఎస్సీల మీద దాడులు చేశారని, విజయ నగరం జిల్లాలో ఎమ్మెల్యే శ్రీవాణి పైనా, చిత్తూరు జిల్లా పూతల పట్టులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిపైనా టీడీపీ నాయకులు దౌర్జన్యం చేశారని వారందరి మీద కేసు పెట్టాలని జగన్ కోరారు.
Read Also : హైదరాబాద్ లో దారుణం : మందు పార్టీ ఇచ్చి.. యువతిపై గ్యాంగ్ రేప్
చంద్రబాబు అధికారంలో ఉండగా తమ కులస్తులకు ప్రమోషన్లు ఇచ్చారని వారి అండతోనే టీడీపీ నాయకులు అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఓట్ల ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ఉందని, కొత్త ప్రభుత్వం వచ్చేంతవరకు చంద్రబాబు చేస్తున్న ఖర్చులకు కంట్రోల్ చేయమని అడిగినట్లు చెప్పారు. ఈవీఎంల భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలవద్ద భద్రత పెంచాలని కూడా జగన్ గవర్నర్ ను కోరారు. ఈవీఎంలు పనిచేయటంలేదన్నచంద్రబాబు వ్యాఖ్యలపై మట్లాడుతూ.. రాష్ట్రంలో 80 శాతం ప్రజలు ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయనే సంతృప్తితో ఓటు వేసి వెళ్లారని జగన్ చెప్పారు.
చంద్రబాబు ఈవీఎం లు సక్రమంగా పని చేయలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఈవీఎంల పనితీరుపై ఏ ఓటరు ఫిర్యాదు చేయలేదని జగన్ గుర్తు చేశారు. ఎన్నికల్లో తాను గెలిస్తే ఈవీఎం భేష్, లేకపోతే పని చేయట్లేదు అనటం చంద్రబాబుకు అలవాటేనని ఆయన 2014, నంద్యాల ఉప ఎన్నికలను ఉదాహరించారు.
ఇంతకు ముందు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు మాట్లాడని వ్యక్తి ఇప్పుడు ఇలా మాట్లాడటం దారుణమని జగన్ అన్నారు. అయిదేళ్లపాటు చంద్రబాబు చేసిన అధర్మ, అరాచక, రాక్షస పాలనను ప్రజలు చూశారని ఇక ఆయన్ను ఇంటికి పంపేందుకే పెద్దఎత్తున పోలింగ్ బూత్ లకు వచ్చి బైబై బాబు అంటూ ఓట్లు వేశారని జగన్ చెప్పారు.
Read Also : ఒక్క మ్యాచ్ ఓడితే దారి మూసుకుపోయినట్లు కాదు: చాహల్