YS Jagan Padayatra : పాదయాత్రపై వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక ప్రకటన.. ముహూర్తం ఫిక్స్..!
YS Jagan Padayatra : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు.
- Harish Thanniru
- Updated on- September 9, 2026 / 02:02 PM IST
YS Jagan Mohan Reddy
YS Jagan Padayatra : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కార్యకర్తల సమావేశం బుధవారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్ర పై క్లారిటీ ఇచ్చారు. 2027 సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పాదయాత్ర ఉంటుందని జగన్ ప్రకటించారు. పర్చూరు నియోజకవర్గం మీదుగా కూడా తన పాదయాత్ర సాగుతుందని తెలిపారు.
మన ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారని జగన్ అన్నారు. ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. తమ పాలనపై ప్రతి కార్యకర్త సగర్వంగా చెప్పుకోగలిగేలా, ఏ ఇంటికైనా ధైర్యంగా వెళ్లగలిగేలా పాలన సాగించామని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.
మ్యానిఫెస్టోకు అర్థం తీసుకొచ్చి, అందులో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని జగన్ అన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోతో పాటు ప్రతి ఇంటికి బాండ్లు కూడా పంపారని, కానీ, ఎన్నికలు పూర్తయ్యాక మ్యానిఫెస్టో కనిపించదని జగన్ విమర్శించారు. రైతులు నష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకున్నామని, రైతుల చేయి పట్టుకుని నడిపించామని జగన్ తెలిపారు. రైతుల కోసం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు చెబుతున్నారని జగన్ విమర్శించారు. ఈ రిజర్వేషన్లను కోర్టు కొట్టివేస్తుందని ముందే తెలిసే ఆ సాకుతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి కుట్ర చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపైనా జగన్ స్పందించారు. ఇప్పటికే 44లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రభుత్వమే చెబుతోందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిజంగా జరుగుతాయా అని ప్రశ్నించారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం ఎన్నికలు సాఫీగా జరిగే అవకాశం లేదని జగన్ ఆరోపించారు. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు, జైళ్లకు పంపడం జరుగుతోందని విమర్శించారు. రోజుకో డ్రామా, రోజుకో నటన, డైవర్షన్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయని మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు, ఎలా జరిగినా ప్రజలకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని జగన్ స్పష్టం చేశారు. ఎన్నికలు సాఫీగా జరిగితే వైఎస్సార్‌సీపీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు సాఫీగా జరగనివ్వకపోయినా గట్టిగా పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు గట్టిగా నిలబడాలని జగన్ సూచించారు. రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం లాంటివని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగం వంటి అంశాలపై ప్రజల్లో ఏర్పడే ఆగ్రహం వచ్చే సాధారణ ఎన్నికల్లో కనిపించాలని అన్నారు. స్థానిక ఎన్నికలు కార్యకర్తల ఎన్నికలని, ప్రజలకు కార్యకర్తలు అండగా నిలబడతారని జగన్ పేర్కొన్నారు. కార్యకర్తలకు పార్టీ కూడా అండగా నిలబడాలని సూచించారు. దౌర్జన్యంతో ఎప్పటికీ పాలకులు రాజ్యం చేయలేరని వ్యాఖ్యానించారు.
