ఏపీ రాజకీయాలపై శ్రీకాకుళం జిల్లా ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. జిల్లా ప్రజలు ఏ పార్టీకి పట్టం కడితే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలో ఉండటం సెంటిమెంట్‌గా కొనసాగుతోంది. 2019లో శ్రీకాకుళం జిల్లాలోని పది అసెంబ్లీ సీట్లలో ఎనిమిది సీట్లు వైసీపీ గెలుచుకుంది.
వైసీపీ అధినేత జగన్ కూడా అంతేరీతిలో జిల్లా నేతలకు ఒక డిప్యూటీ సీఎంతో పాటు, మరో మంత్రి పదవి, శాసనసభాపతి పదవిని కట్టబెట్టారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారాం, సీదిరి అప్పల రాజు వంటి కీలక నేతలు ఓటమి పాలయ్యారు.
ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వైసీపీ..పోయిన చోటే వెతుక్కునే పనిలో ఉందట. అందుకే సిక్కోలు జిల్లాలో నేతల మధ్య విభేదాలున్న నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారట మాజీ సీఎం జగన్. ఒక్కో నియోజకవర్గంలో మార్పులు, చేర్పులు చేయాలని డిసైడ్ అయ్యారట.
ఇప్పటికే తొలగింపులు
ఇప్పటికే కుటుంబ వివాదాలతో వివాదాస్పద నేతగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌ను టెక్కలి వైసీపీ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించి ..పేరాడ తిలక్‌ను నియమించింది వైసీపీ అధిష్టానం. ఇక వయోభారంతో పాటు గ్రూప్ రాజకీయాలతో ఇబ్బందులు పడుతున్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కూడా ఆమదాలవలస బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకులుగా నియమించింది వైసీపీ. ఆమదాలవలస వైసీపీ బాధ్యతలను చింతాడ రవికుమార్‌కు అప్పగించింది.
సిక్కోలు జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలపై కూడా వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్‌గా ఉన్న విజయసాయిరెడ్డి జిల్లాలో పర్యటించి వాస్తవ పరిస్థితులను అధినేతకు వివరించారట. ముందుగా గ్రూప్ పాలిటిక్స్ ఉన్న నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లను మార్చడంపై దృష్టి పెట్టారట.
ఎచ్చెర్ల, పాతపట్నం, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో కొత్త నేతలకు ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వాలని చూస్తుందట వైసీపీ. ఇక ధర్మాన మౌనంపై కూడా పార్టీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి ధర్మాన ప్రసాదరావుతో చర్చించినట్లు సమాచారం. ఒకటి రెండు నెలల్లో ఇంచార్జ్‌లను నియామకం చేసి జిల్లాలో పార్టీని ట్రాక్‌లో పెట్టాలని చూస్తున్నారట వైసీపీ అధినేత జగన్.
తమ్మినేని అలిగారా?
మరోవైపు ఈ మధ్యే జగన్ శ్రీకాకుళం జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు సర్పంచులు, వార్డు మెంబర్ల నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను హాజరయ్యారు. అయితే ఈ భేటీకి ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం డుమ్మా కొట్టారట. ఆమదాలవలసలో వైసీపీ ఇంచార్జిగా చింతాడ రవికుమార్‌ను నియమించడంపై తమ్మినేని అలిగారని అంటున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. అంతేకాదు గత ఎన్నికల్లో తన ఓటమి కోసం కుట్ర చేసిన నేతకు పార్టీ పగ్గాలు అప్పచెప్పారన్న కోపంతో తమ్మినేని వైసీపీ సమీక్షకు రాలేదని అంటున్నారు.
ఇక మాజీ మంత్రి ధర్మాన ఎన్నికల ఫలితాల సైలెంట్ అయ్యారు. ఆయనకు కానీ కుమారుడికి కానీ వైసీపీ శ్రీకాకుళం ఇంచార్జ్ బాధ్యతలు అప్పగిస్తామని చెబుతున్నా ఆయన మాత్రం ఎటూ తేల్చడం లేదట. అయితే ధర్మాన తన దారి తాను చూసుకుంటున్నారని భావిస్తున్నారట వైసీపీ నేతలు. ధర్మాన మాత్రం ఎక్కడికి వెళ్లడం లేదని..త్వరలోనే పార్టీలో యాక్టివ్ అవుతానంటున్నారట. ఇలా ఇద్దరి నేతల గైర్హాజరు వెనక వారి వారి కారణాలు ఉన్నాయట.
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ నేతలు ఇప్పుడు పార్టీకి దూరంగా ఉండటం అయితే చర్చనీయాంశం అవుతోంది. పార్టీ మాత్రం ఓటమి నుంచి తేరుకుని కొత్త నాయకత్వంతో మళ్లీ పట్టు సాధించాలని చూస్తోందని అంటున్నారు. అయితే కొత్త వారికి బాధ్యతలు ఇవ్వడం కూడా సీనియర్లకు నచ్చడం లేదట. అందుకే పార్టీకి దూరంగా ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఇలా సైక్కోలు వైసీపీ సిత్రాలు సిత్రంగా మారాయి. వైసీపీ అధినేత ఈ వ్యవహారాలన్నింటి ఎలా చక్కబెడుతారో చూడాలి మరి.
మంత్రుల పనితీరుపై ఆరా తీస్తున్న సీఎం రేవంత్.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా మార్పులు, చేర్పులు?