Y.s.vijayamma
Y.S.Vijayamma: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సంస్మరణ సభ నేడే జరగనుంది. హైదరాబాద్ హైటెక్స్ లో వైఎస్ సతీమణి, వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నిర్వహించనున్న ఈ సభకు భారీ ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కొద్దిరోజులుగా హైదరాబాద్ లోనే ఉంటున్న విజయమ్మ నేడు ముందుగా ఇడుపులపాయలోని వైఎస్ వైఎస్ఆర్ సమాధికి నివాళులు అర్పించి అక్కడ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకొని సంస్మరణసభకు హాజరుకానున్నారు.
విజయమ్మ నిర్వహించనున్న ఈ సమావేశం కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల్లో కలిపి సుమారు 500 మందికి ఆహ్వానాలు అందగా వైఎస్ సన్నిహితులు కేవీపీ రాంచందర్‌రావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, అప్పటి మంత్రులు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, దామోదర్ రాజనర్సింహతో పాటు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు డీ శ్రీనివాస్, కె. కేశవరావు, బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ తదితరులకు ఆహ్వానాలు అందాయి.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, సీపీఎం, సీపీఐ నేతలు బివి రాఘవులు, కె. నారాయణ, తమ్మినేని వీరభద్రం, చాడా వెంకట్‌రెడ్డి, టీజేఎస్ అధినేత కోదండరాంతోపాటు గద్దర్, ఆర్ కృష్ణయ్య, సినీరంగానికి చెందిన ప్రముఖులు చిరంజీవి, కృష్ణ, నాగార్జున, దిల్ రాజు తదితరులను కూడా ఆహ్వానించారు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఆహ్వానితుల జాబితాలో ఉండగా ఈ కార్యక్రమ నిర్వహణలో షర్మిల తన వంతు పాత్రనూ పోషిస్తున్నారు. అయితే, వైఎస్ కుమారుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఈ సమావేశానికి పిలిచారా లేదా అన్నది పొలిటికల్ వర్గాలలో చర్చగా మారింది.