ys sharmila
Congress Party : వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయింది. గువారం ఉదయం 10.55 గంటల సమయంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. వైఎస్ షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తొలిసారి ఇద్దరు అగ్ర నేతల సమక్షంలో పార్టీ విలీనం, నేతల చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్, ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు, కొప్పుల రాజు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత వైఎస్ షర్మిల దంపతులు సోనియాగాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు.
Also Read : Ys sharmila : షర్మిల నిర్ణయంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం వైఎస్ఆర్ కు సంతోషం కలిగించే విషయం అన్నారు. కాంగ్రెస్ పార్టీ లో చేరడం సంతోషంగా ఉందని, వైఎస్ఆర్ కూతురుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటం గర్వంగా ఉందని షర్మిల అన్నారు. పార్టీకి విధేయురాలిగా పనిచేస్తానని, పార్టీ అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగించినా శక్తివంచన లేకుండా పనిచేస్తానని షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ.. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన పార్టీ కాంగ్రెస్ అని షర్మిల అన్నారు. వైఎస్ఆర్ జీవితాంతం కాంగ్రెస్ పార్టీకోసం కృషి చేశారని, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నది వైఎస్ఆర్ కల అని షర్మిల అన్నారు. దేశాన్ని ఏకతాటిపై నిలబెట్టడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర కీలకమని షర్మిల పేర్కొన్నారు. మణిపూర్ ఘటనలపట్ల ఓ క్రిస్టియన్ గా బాధపడ్డానని, వందలాది చర్చిలను తగులబెట్టారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక, తెలంగాణపై ప్రభావం చూపిందని, ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తెలంగాణలో కాంగ్రెస్ విజయంకోసం నా వంతు కృషి చేశానని షర్మిల అన్నారు.
Also Read : B Tech Ravi: ఎన్నికల వేళ ఏపీలో మరో కీలక పరిణామం.. బ్రదర్ అనిల్‌తో బీటెక్ రవి..
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో కీలక పరిణామమని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏపీలో మరో మూడునాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలోచేరి ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెడుతుండటం సంచలనంగా మారింది. అయితే, షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం ఏ పదవి అప్పగిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీలో పదవి ఇస్తారా? ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా అనే అంశంపై ఏపీ రాజకీయాల్లో జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు రాహుల్ గాంధీ ఇప్పటికే ఓకే చెప్పారని, కాంగ్రెస్ అధిష్టానం ఆమేరకు త్వరలో ప్రకటన చేస్తుందన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.