వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని ప్రకటించారు.
“విశాఖ స్టీల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించిన పరిశ్రమ. కాంగ్రెస్ హయాంలో ప్లాంట్ లాభాల్లో ఉంది. బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పై సైలెంట్ కిల్లింగ్ మెథడ్‌ను ఉపయోగిస్తుంది. కుక్కను చంపాలి అంటే పిచ్చిది చేయాలి అనేది సమేత. ఇదే ఫార్ములా స్టీల్ ప్లాంట్ మీద ప్రయోగం చేస్తుంది. ఉద్యోగాలను తొలగిస్తున్నారు, ముడి సరుకు అందకుండా కుట్రలు చేస్తున్నారు.
ఎగుమతుల ధరలు పెంచి స్టీల్ ప్లాంట్ మీద భారం మోపారు. కాంగ్రెస్ హయాంలో స్టీల్ ప్లాంట్‌కి ఒక మైన్ ఇవ్వాలని అనుకుంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కి సొంత మైన్ ఇవ్వకుండా కుట్ర చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ఆదుకున్నామని బీజేపీ చెప్పేది అబద్ధం. 11 వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఉద్ధరించామని వారు చెప్పడం పచ్చి అబద్ధం.
ఇచ్చినట్లే ఇచ్చి 8 వేల కోట్ల రూపాయల బ్యాంక్ రుణాల కింద వెనక్కి తీసుకున్నారు. ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో వెనక్కి తీసుకున్నారు. ఇంకా 3 వేల కోట్లు ఇవ్వాలంటే 5 వేల మంది ఉద్యోగులను తొలగించాలని కండీషన్ పెట్టారు. ఇప్పటికే 2 వేల మంది కార్మికులను తొలగించారు. మరో 3 వేల మందిని తొలగిస్తారట.. ఇదెక్కడి న్యాయం అని అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేసి అదానీ కి అప్పగించాలని అనుకుంటున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుంది.
టీడీపీ, జనసేన ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. చంద్రబాబు, పవన్‌కి ఇది న్యాయమా? రాజకీయాల కోసం స్టీల్ ప్లాంట్ ను వాడుకున్నారు. మోదీకి మీరు ఊడిగం చేస్తున్నారా? కార్మికులను తొలగిస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు? బీజేపీ కుట్రలకు ఎందుకు అడ్డు పడటం లేదు? మీరు మీరు లాలూచీ పడ్డారా ? స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. 2 వేల మందిని వెనక్కి తీసుకునే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. ప్రాణత్యాగానికి సిద్ధం” అని షర్మిల అన్నారు.