YS Sharmila: రాష్ట్రవ్యాప్త పర్యటనకు వైఎస్‌ షర్మిల.. పూర్తి వివరాలు

ఇప్పటికే జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించిన ఆమె.. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న..

YS-Sharmila

YS Sharmila: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వరుస సభలతో రాష్ట్రం మొత్తం హోరెత్తుతోంది. ఇక పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ షర్మిల కూడా జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయి విరుచుకుపడుతున్న షర్మిల.. జిల్లాల పర్యటనల్లో ఎలాంటి ప్రసంగాలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఉదయం రచ్చబండ కార్యక్రమాలు, సాయంత్రం బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. బుధవారం నుంచి ఈనెల 11 వరకు ఐదు రోజులపాటు షర్మిల నిర్వహించనున్న కార్యక్రమాల షెడ్యూల్‌ను విడుదల చేసింది కాంగ్రెస్‌ పార్టీ. జిల్లాల పర్యటన నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని ఏపీ డీజీపీకి లేఖ రాశారు షర్మిల. ఆమె రాసిన లేఖను పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌ వలీ డీజీపీకి అందజేశారు.

బుధవారం సాయంత్రం బాపట్ల నియోజకవర్గంలో బహిరంగ సభతో షర్మిల పర్యటన ప్రారంభం కానుంది. 8వ తేదీ ఉదయం 10 గంటలకు తెనాలిలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్న షర్మిల.. సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరు బహిరంగ సభకు హాజరవుతారు. 9వ తేదీన కొవ్వూరులో రచ్చబండ, సాయంత్రం తుని సెగ్మెంట్‌లో బహిరంగ సభకు కాంగ్రెస్‌ ప్లాన్‌ చేసింది. 10న ఉదయం నర్సీపట్నంలో రచ్చబండ, సాయంత్రం పాడేరులో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఇక 11వ తేదీ సాయంత్రం నగరిలో నిర్వహించే బహిరంగ సభతో షర్మిల పర్యటన ముగుస్తుంది.

షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ కాంగ్రెస్‌లో కొత్త జోష్‌ మొదలైంది. ఇప్పటికే జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించిన ఆమె.. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న బలం, బలహీనతలపై ఓ అంచనాకు వచ్చారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ.. రాష్ట్ర హక్కుల కోసం పోరాటం కూడా మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఢిల్లీలో దీక్ష సైతం చేపట్టారు షర్మిల.

రాష్ట్ర విభజన తర్వాత స్తబ్ధుగా మారిపోయిన ఏపీ కాంగ్రెస్‌లో.. షర్మిల రాక తర్వాత కొత్త ఉత్సాహం నెలకొంది. వచ్చే ఎన్నికలకు క్యాడర్‌ను సిద్ధం చేసే క్రమంలోనే ఈ టూర్స్‌కు ప్లాన్‌ చేశారు షర్మిల.

Manickam Tagore: విజయసాయిరెడ్డిపై రాజ్యసభ చైర్మన్‌కి మాణిక్యం ఠాగూర్ ఫిర్యాదు

ట్రెండింగ్ వార్తలు