వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదేళ్లు, సీఎం జగన్ ట్వీట్

యువజన శ్రామిక రైతు (వైఎస్ఆర్) కాంగ్రెస్ పార్టీ స్థాపించి నేటికి(మార్చి 12,2021) ప‌దేళ్లు నిండాయి. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జ‌రుపుకుంటున్నారు. 11వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్న వైసీపీ ప్ర‌స్థానాన్ని ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు గుర్తు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

ysr congress party leaders celebrating 11th anniversary: యువజన శ్రామిక రైతు (వైఎస్ఆర్) కాంగ్రెస్ పార్టీ స్థాపించి నేటికి(మార్చి 12,2021) ప‌దేళ్లు నిండాయి. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జ‌రుపుకుంటున్నారు. 11వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్న వైసీపీ ప్ర‌స్థానాన్ని ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు గుర్తు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

పార్టీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ‘మహానేత ఆశయ సాధనే లక్ష్యంగా, విలువలు విశ్వసనీయతల పునాదులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది. ఈ పదేళ్ల ప్రయాణంలో కష్ట సుఖాల్లో నాకు అండగా నిలిచిన ప్రజలకు, నాతో కలిసి నడిచిన నాయకులకు, నా వెన్నంటి ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

తన తండ్రి ఆకస్మిక మరణానంతరం సీఎం సీటును ఆశించి కాంగ్రెస్ అధినాయకత్వం చేతిలో భంగపడినప్పటికి వెన్ను చూపకుండా తనదైన శైలిలో సుమారు ఎనిమిదిన్నరేళ్ళ పాటు ప్రజలకు చేరువయ్యేందుకు శ్రమించి, ఆ తర్వాత తగిన ఫలం అందుకున్నారు వైఎస్ జగన్. ఈ క్రమంలోనే ప్రత్యేక ప్రాంతీయ పార్టీ పెట్టారు. మార్చి 12వ తేదీకి ఆ పార్టీకి పదేళ్ళు నిండాయి. తన తండ్రి పేరు స్ఫురించేలా యువజన శ్రామిక రైతు (వైఎస్ఆర్) కాంగ్రెస్ పార్టీ పేరిట పార్టీ పెట్టారు జగన్.

2009 సెప్టెంబర్ 2న నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలిపోవడంతో దుర్మరణం పాలయ్యారు. అప్పటికి వైఎస్ జగన్ కడప ఎంపీగా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైఎస్ఆర్ మరణానంతరం 2009 డిసెంబర్‌లో పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగగా దివంగత నేత సతీమణి వైఎస్ విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

2011 మార్చి 12వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది. నాటి నుంచి పార్టీకి తాను అధ్యక్షునిగాను, తన తల్లి విజయమ్మ గౌరవ అధ్యక్షురాలిగాను వ్యవహరిస్తున్నారు.

2014లో రాష్ట్ర విభజన సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలో వైసీపీ 44.47 శాతం ఓట్లు సంపాదించినా.. కావాల్సిన మేజిక్ ఫిగర్ అందుకోలేకపోయింది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలుండగా.. వైసీపీ 67 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. 9 ఎంపీ సీట్లను సాధించింది. దేశంలోని మొత్తం ప్రాంతీయ పార్టీల్లో ఒంటరిగా అధిక ఓట్ల శాతం సాధించిన పార్టీగా వైసీపీకి పేరుగాంచింది. 2014 ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీని బలోపేతం చేసేందుకు జగన్‌ తగిన వ్యూహాల అమలు చేయడం ప్రారంభించారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో 14 నెలల పాటు ఏపీలో పాదయాత్ర చేశారు. నవంబర్ 6, 2017న ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర.. జనవరి 9, 2019న ముగిసింది. 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు జగన్.

2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 151 స్థానాలు, 22 ఎంపీ స్ధానాల్లో ఘన విజయం సాధించింది వైసీపీ. ఏపీలో మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం సాధించింది వైసీపీ. మే 30, 2019న ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు వైఎస్ జగన్ స్వీకరించారు. నవరత్నాలు పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు. 2019 నుంచి వైసీపీ ఏపీలో అధికార పార్టీగా కొనసాగుతోంది. విపక్ష తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో 23 సీట్లలో గెలుపొందగా.. అందులో 15 మంది దాకా వైసీపీ గూటికి చేరారు. దాంతో ప్రస్తుతం ఏపీలో తిరుగులేని పెద్ద పార్టీగా వైసీపీ ఎదిగింది.

ట్రెండింగ్ వార్తలు