×
Ad

మండలిలో ప్లకార్డులు, వెంకటేశ్వర స్వామి ఫొటోలను ఛైర్మన్‌ టేబుల్‌పై పడేసిన వైసీపీ సభ్యులు.. రచ్చ రచ్చ

వెంకటేశ్వరస్వామికి సభలో అవమానం జరిగిందంటూ కూటమి సభ్యులు అత్యవసర సమావేశం నిర్వహించారు.

  • వెంకటేశ్వరస్వామి ఫొటోతో వైసీపీ ఎమ్మెల్సీల నిరసన
  • దేవుడికి అవమానం జరిగిందన్న కూటమి సభ్యులు
  • లోకేశ్ నేతృత్వంలో కూటమి నేతల సమావేశం

టీటీడీ కల్తీ నెయ్యి ఇష్యూ ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిని కుదిపేసింది. వైసీపీ ఎమ్మెల్సీలు దేవుడి ఫొటోతో నిరసన తెలిపారని అధికార పక్ష సభ్యులు మండిపడ్డారు. మండలి ఛైర్మన్ సభను వాయిదా వేయగానే ప్లకార్డులను, వెంకటేశ్వర స్వామి ఫొటోలను టేబుల్ పై పడేసి వెళ్లారు వైసీపీ సభ్యులు.

వెంకటేశ్వరస్వామికి సభలో అవమానం జరిగిందంటూ కూటమి సభ్యులు అత్యవసర సమావేశం నిర్వహించారు. టీడీఎల్పీలో మంత్రి లోకేశ్ నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు.

ప్లకార్డుల్లా దేవుడి ఫొటోను వాడి మహాపచారానికి పాల్పడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్డీఎల్పీ తెలిపింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

సభలోనికి వైసీపీ‌ ఎమ్యెల్సీలు వెంకటేశ్వర స్వామి ఫొటోలతో రావడంపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహంతో ఊగిపోయారు. తలకు పెట్టుకున్న హెడ్ ఫోన్‌ను విసిరికొట్టారు.

“దేవుడిని రాజకీయాలకు వాడుకుంటున్నారు.. వైసీపీ సభ్యులకు బుద్ది ఉందా..?” అని అన్నారు. దేవుడికి జరిగిన అవమానానికి కోపంతో హెడ్ ఫోన్ విసిరానని పయ్యావుల కేశవ్ అన్నారు.

సభలో జరిగిన విషయాన్ని వదిలిపెట్టకూడదని సోము వీర్రాజు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది క్షమించరాని నేరం అని చెప్పారు.

దేవుడి సొమ్ము లూటీ: బొత్స
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. హెరిటేజ్ ఇందాపూర్ డైయిరీలు కలిసి దేవుడి సొమ్ముని లూటీ చేస్తున్నాయి. ఈ దోపిడీపై సభలో చర్చ జరగాలి. హెరిటేజ్ ప్రైవేటు సంస్థ కదా.. మంత్రులకు ఏం పని? హెరిటేజ్ గురించి మాట్లాడుతుంటే మంత్రులకు ఏం సంబంధం? మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారు?” అని అన్నారు.