Gudur YCP : గూడూరు వైసీపీలో గజిబిజి గందరగోళం.. కొత్త ఇంచార్జ్ నియామకంపై క్యాడర్ అసంతృప్తి

YCP Gudur Constituency :  నెల్లూరు జిల్లాలోని గూడూరు..SC రిజర్వ్డ్ నియోజకవర్గం. పేరుకి ఎస్సీ రిజర్వ్ అయినా..ఈ నియోజకవర్గంలో రెడ్ల ప్రాబల్యం ఎక్కువ. పార్టీ ఏదైనా సరే ఎమ్మెల్యేకు రెడ్లకు మధ్య మంచి సంబంధాలు కొనసాగుతుంటాయి. అలాంటి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అధ్వానంగా ఉందట.

Gudur Constituency YSR Congress Party

YCP Gudur Constituency :  నెల్లూరు జిల్లాలోని గూడూరు..SC రిజర్వ్డ్ నియోజకవర్గం. పేరుకి ఎస్సీ రిజర్వ్ అయినా..ఈ నియోజకవర్గంలో రెడ్ల ప్రాబల్యం ఎక్కువ. పార్టీ ఏదైనా సరే ఎమ్మెల్యేకు రెడ్లకు మధ్య మంచి సంబంధాలు కొనసాగుతుంటాయి. అలాంటి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అధ్వానంగా ఉందట. వర్గ విభేదాలతో రోజురోజుకీ పట్టు కోల్పోతోందట. ఇక్కడ పార్టీని నడిపించే సమర్ధవంతమైన నాయకుడు కరువయ్యాడని క్యాడరే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొన్నటి వరకు నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న మేరిగ మురళి..కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారు. కానీ లోకల్ లీడర్లు, కార్యకర్తలతో మంచి సంబంధాలు లేవన్న విమర్శలు ఎదుర్కొన్నారు.

Also Read : Seediri Appala Raju : వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్.. అడ్డుకున్న వైసీపీ శ్రేణులు.. తీవ్ర ఉద్రిక్తత..

ఈ మధ్యే వైసీపీ అధినేత జగన్.. మేరిగ మురళిని నియోజకవర్గ ఇంచార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించి MPPగా పనిచేసిన బూదూరు గురవయ్యను గూడూరు ఇంచార్జ్‌గా నియమించారు. దీంతో నియోజకవర్గ వైసీపీ క్యాడర్‌లో అసంతృప్తి రగులుతుంది. జగన్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్న క్యాడర్, లీడర్లు పక్క చూపు చూస్తున్నారట.

గూడూరు నియోజకవర్గంలో నేదురుమల్లి, నల్లపురెడ్డి కుటుంబాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్నారు. అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ఇంచార్జ్‌గా బాధ్యతల్లో కొనసాగుతున్నారు. వీరికి తోడు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి వంటి బలమైన నాయకులు, సీనియర్ నాయకులు నియోజకవర్గంలో ఉన్నారు. అయితే గూడూరు నియోజకవర్గ నాయకులతో ఎవరితోనూ చర్చించకుండా.. వారి అభిప్రా యం తెలుసుకోకుండా..నియోజకవర్గ సమన్వయకర్తను నియమించడాన్ని లోకల్ వైసీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోందట.

కొత్త ఇంచార్జ్ బూదూరు గురవయ్య నియామకం వెనుక గూడూరుకి చెందిన, కర్ణాటకలో సెటిలైన బడా పారిశ్రామికవేత్త నరేందర్‌రెడ్డి చక్రం తిప్పినట్లు ఇన్‌సైడ్‌ టాక్ నడుస్తోంది. కొంతకాలంగా మేరిగ మురళికి, నరేందర్‌రెడ్డికి మధ్య గ్యాప్ కొనసాగుతోందట. అందుకే మేరిగ మురళికి చెక్ పెట్టి తన అనుచరుడు గురవయ్యకు ఇంచార్జ్‌ పదవి ఇప్పించుకున్నారన్న ప్రచారం నడుస్తోంది.

మరోవైపు త్వరలో జరగబోయే డీలిమిటేషన్‌లో గూడూరు నియోజకవర్గం జనరల్ కాబోతుందన్న చర్చ సాగుతోంది. జనరల్ అయితే ఆర్థిక బలం ఉన్న బడా నాయకులంతా తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పేర్లు తెర మీదకు వచ్చాయి. కాబట్టి డీలిమిటేషన్ జరిగే వరకు బూదూరు గురవయ్య ఇంచార్జ్‌గా కొనసాగుతారని అంటున్నారు. ఆ తర్వాత రిజర్వేషన్ మారితే..సీన్ మారిపోతుందన్న ఈక్వేషన్‌లోనే ఇంచార్జ్‌ను మార్చేసినట్లు టాక్. సో ఇంచార్జ్‌గా తప్పించారని మేరిగ మురళి బాధపడాల్సిన అవసరం లేదంటున్నారు. సేమ్‌టైమ్‌ గూడూరు రిజర్వేషన్ మారితే బూదూరు గురవయ్య ఆశలు కూడా గల్లంతు అవడం పక్కా అంటున్నారు. అధినేత నిర్ణయం..రిజర్వేషన్ ఈక్వేషన్స్..గూడూరు వైసీపీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి మరి.