ఎన్నికల్లో ఓటమిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆసక్తికర కామెంట్స్

తాము ఎక్కడికీ పారిపోమని, తమకు ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు.

Anil Kumar Yadav: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తానని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఇవాళ తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తమకు ఓటు వేసిన వాళ్లపై దాడులు చేస్తున్నారని, బాధితులకు అండగా ఉంటామన్నారు.

ఎన్నికల్లో గెలిచిన వారు ప్రజలకు మంచి చేయాలని,  ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. కొత్త సర్కారుకి కొంత సమయం ఇస్తామని తెలిపారు. తాము ఎక్కడికీ పారిపోమని, తమకు ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదని చెప్పారు. తమ పార్టీకి సీట్లు రాకపోయినా 40 శాతం ఓట్లు సాధించామన్నారు. లోపాలు సరిదిద్దుకుని ముందుకు వెళతామని తెలిపారు.

Also Read: వైసీపీ ఎమ్మెల్సీలతో జగన్ భేటీ.. కీలక సూచనలు

మంత్రుల నోటి దురుసు వల్ల ఓడిపోయారు అంటున్నారని, అదే నిజమైతే సరిదిద్దుకుంటామని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. ఓటమి పాలైతే మూలన కూర్చునే పరిస్థితి ఉండదని అన్నారు. జగన్ వెంటే ఉంటామని, ఆయనతోనే నడుస్తామని చెప్పారు. తమ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు