Chevireddy Bhaskar Reddy
Chevireddy Bhaskar Reddy : లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా ఆయన వేరికోస్ వెయిన్స్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఆయన మరోసారి అస్వస్థతకు గురికావడంతో వైద్యులు పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేసును సిట్ అధికారులకు అప్పగించారు. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నవారిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిలు కూడా ఉన్నారు. చెవిరెడ్డిని పలు దఫాలుగా సిట్ అధికారులు విచారణ చేశారు. విచారణ సమయంలో కీలక ఆధారాలు వెలుగులోకి రావడంతో ఆయన్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు.
మరోవైపు.. మద్యం కుంభకోణంపై విచారణ జరుపుతున్న సిట్ బృందం నిందితుల ఆస్తులను జప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు సిట్ అనుమతి కోరగా.. ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.