టీడీపీతో టచ్‌లోకి వస్తున్న వైసీపీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు

సీఎం అనుమతి లభించడంతోనే ఒంగోలు, హిందూపురంపై ఒకేరోజు పసుపు జెండా ఎగరేశారని..

ఏపీ లోకల్‌ పాలిటిక్స్‌లోనూ టీడీపీ కూటమి హవా మొదలైందా? స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ… అధికార పార్టీలోకే జంప్‌ చేయడానికి తహతహలాడుతున్నారు వైసీపీ లోకల్‌ లీడర్లు. ఇప్పటికే చిత్తూరు కార్పొరేషన్‌, పుంగనూరు మున్సిపాలిటీల్లో జెండా ఎగరేసిన టీడీపీ… తాజాగా ఒంగోలు కార్పొరేషన్‌, హిందూపురం మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇక విశాఖ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లోనూ హవా చూపింది… వరుసగా చోటుచేసుకుంటున్న ఈ మార్పులు వైసీపీకి డేంజర్‌ బెల్‌ మోగిస్తున్నట్లేనా? స్థానిక రాజకీయం కూడా రంగుమారుతుందా?

అధికారం ఎక్కడుంటే… ఆ పార్టీ గుప్పెట్లోనే స్థానిక సంస్థలు ఉంటుంటాయి. ఐతే ఏపీలో రాజకీయం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. రాష్ట్రంలో 95 శాతం స్థానిక సంస్థల్లో ప్రతిపక్షం వైసీపీదే ఆధిపత్యం. మున్సిపాల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా, మండల పరిషత్‌ల్లో ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తోంది వైసీపీ. మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక ఎన్నికలను అప్పటి ప్రతిపక్షం టీడీపీ బహిష్కరించడంతో వైసీపీ సునాయాశంగా స్థానిక సంస్థల్లో పాగా వేసింది.

వైసీపీకి భవిష్యత్‌ లేదని..
ఐతే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తలకిందులైన తర్వాత… వైసీపీకి భవిష్యత్‌ లేదని ఆ పార్టీకి చెందిన మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు టీడీపీతో టచ్‌లోకి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చిత్తూరు కార్పొరేషన్‌, పుంగనూరు మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వైసీపీకి బైబై చెప్పేసి టీడీపీలో చేరిపోయారు. దీంతో ఆ రెండు చోట్ల టీడీపీ జెండా రెపరెపలాడుతోంది.

ఇక ఒంగోలు కార్పొరేషన్‌, హిందూపురం మున్సిపాలిటీలూ టీడీపీ ఖాతాలో చేరిపోయినట్లే… సీనియర్‌ నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో విభేదిస్తూ వైసీపీకి చెందిన మెజార్టీ కార్పొరేటర్లు సైకిల్‌ ఎక్కేశారు. దీంతో కార్పొరేషన్‌లో పసుపు జెండా ఎగరేశారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌. ఇక బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మున్సిపాలిటీ కూడా పసుపు మయమైంది. గత ఎన్నికల్లో వైసీపీ పూర్తిస్థాయి ఆధిపత్యం చూపిన హిందూపురంలో ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి. దీంతో మున్సిపల్‌ చైర్మన్‌తో సహా 10 మంది కౌన్సిలర్లు పసుపు కండువాలు కప్పుకున్నారు.

మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లకు ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉంది. ప్రభుత్వం మారడంతో ఆయా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చైర్మన్లు అంతా తమ అనుచరులను వెంటబెట్టుకుని టీడీపీలో చేరతామంటూ రాయబారాలు పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తిరుపతి, ఏలూరు కార్పొరేషన్లలో మెజార్టీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గం కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ కూడా గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. ఐతే కొత్తగా పార్టీలోకి వచ్చేవారి విషయంలో టీడీపీలో అభ్యంతరాలు వ్యక్తమవడంతో చాలావరకు చేరికలు పెండింగ్‌లో ఉంచినట్లు చెబుతున్నారు.

బలం లేదు..
ప్రస్తుతం అధికార కూటమికి స్థానిక సంస్థల్లో ఎలాంటి బలం లేదు. టీడీపీ సొంతంగా తాడిపత్రి, కొండపల్లి, దర్శి మున్సిపాలిటీలను మాత్రమే గెలుచుకుంది. ఇందులో దర్శి మున్సిపాలిటీపై కోర్టులో వివాదం నడుస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందాలంటే స్థానిక సంస్థల బలం ఎంతో అవసరం. వీటి ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోంది ప్రభుత్వం. పెద్దగా వ్యతిరేకత లేనిచోట్ల, వైసీపీ నేతలతో విసిగిపోయి, టీడీపీకి అనుకూలంగా ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులపై సీఎం చంద్రబాబు కొంత సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.

దీంతో స్థానిక ప్రతినిధులను చేర్చుకునే విషయమై ఎమ్మెల్యేలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారంటున్నారు. సీఎం అనుమతి లభించడంతోనే ఒంగోలు, హిందూపురంపై ఒకేరోజు పసుపు జెండా ఎగరేశారని చెబుతున్నారు. ఇక రానున్న రోజుల్లో చేరికలు మరిన్ని ఎక్కువయ్యే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా తిరుపతి, విశాఖ కార్పొరేషన్లు టీడీపీ ఖాతాలో చేరడానికి ఎంతో సమయం పట్టదంటున్నారు. ఇప్పటికే విశాఖలో స్టాండింగ్‌ కమిటీలను టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో ఆయా కార్పొరేషన్లలో అవిశ్వాసానికి రంగం సిద్ధమవుతోందంటున్నారు. మొత్తానికి నగరాలు, పట్టణాల్లో పసుపు జెండా ఎగరేసేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ పక్కా వ్యూహం సిద్ధం చేస్తున్నారంటున్నారు.

Also Read: ఆపరేషన్ కృష్ణార్జున.. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెరపైకి తెచ్చిన ఆపరేషన్

ట్రెండింగ్ వార్తలు