ఆ పదవిపై వైసీపీ నేతల ఆశలు… ఆవేదనలో ఆశావాహులు!

  • Publish Date - February 4, 2020 / 02:00 PM IST

పాదయాత్ర చేస్తున్న క్రమంలో పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని వైసీపీ అధినేత జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ పదవిపై చాలా మందే ఆశలు పెట్టుకున్నారు. జగన్‌ నుంచి హామీ పొందిన వారే చాలా మంది ఉన్నారు. అలా కాకుండా పార్టీ కోసం ముందు నుంచి పని చేస్తున్న ఆశావహుల జాబితా అయితే చాలానే ఉందంటున్నారు. చిలకలూరిపేట వైసీపీ నేత మర్రి రాజశేఖర్‌తో పాటు గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ కన్వీనర్‌ లేళ్ల అప్పిరెడ్డి, అరకు మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, గొట్టిపాటి భరత్‌తోపాటు పలువురికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ బహిరంగ సభలో ప్రకటించారు. 

మరోపక్క, ప్రకాశం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి, కడప జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి, చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రమౌళి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, అనంతపురం నియోజకవర్గ కన్వీనర్‌ నదీమ్ అహ్మద్, సినీనటుడు అలీ, మాజీ ఎమ్మెల్యేలు దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి , యలమంచిలి రవి, ఆమంచి కృష్ణమోహన్, శిల్పా మోహనరెడ్డి తదితరులు ఎమ్మెల్సీ పదవులపై పూర్తిగా ఆశలు పెట్టుకున్నారు. వీరందరి సీఎం జగన్ హామీ ఇచ్చారు. 

వీరిద్దరి పరిస్థితి ఏంటి? :
ఈ జాబితాతో పాటు పార్టీలో మరికొందరూ కూడా ఎమ్మెల్సీ పదవులను ఆశించారు. అధికార ప్రతినిధులుగా ఉన్న పద్మజారెడ్డి, సీఏ రాజశేఖర్ వంటి వారు ఆశావహులుగా ఉన్నారు. ఇప్పుడు మండలి రద్దు చేయాలనే నిర్ణయంతో వీరందరి పరిస్థితి ఏమిటన్నది అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం పార్టీ తరఫున మండలిలో తొమ్మిది ఎమ్మెల్సీలున్నారు. ఒకవేళ అన్నీ కార్యక్రమాలు పూర్తయి మండలి రద్దు అంటూ జరిగితే ఈ తొమ్మిది మందికీ ఏదో ఒక పదవి ఇవ్వాల్సి ఉంటుంది. వీరికి తోడుగా ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. వారందరికీ పదవులు ఇవ్వాలంటే సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదని పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఎన్నికల సమయంలో సీట్లను త్యాగం చేసిన పార్టీ నేతలకు సీఎం ఎలా న్యాయం చేస్తారనే చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. 

ఆ ఏడుగురిని ఏం చేస్తారు? :
మండలి రద్దు తీర్మానం కంటే ముందే సీఎం ఎమ్మెల్సీ ఆశావహులపై పార్టీ సీనియర్లతో సుదీర్ఘ చర్చ తర్వాత నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రి పదవులు సైతం త్యాగాలు చేస్తున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లకు రాజ్యసభ గానీ కేబినెట్ హోదాతో ప్రాంతీయ మండళ్ల చైర్మన్లుగా గానీ నియమిస్తారని అంటున్నారు.

ఇక మిగిలిన ఏడుగురిని ఏం చేస్తారు? ఆశావహుల జాబితాలో ఉన్నవారితో పాటు, హామీలిచ్చిన వారిని ఏం చేస్తారు? వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమిస్తారా? లేక వేరే ఆలోచనలు ఏవైనా ఉన్నాయా అనే ప్రశ్నలు పార్టీ వర్గాలను వేధిస్తున్నాయట. మొత్తానికి మండలి రద్దు చేయాలన్న సీఎం జగన్ నిర్ణయం ఇప్పుడు పార్టీలో అసంతృప్తికి కారణమవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ జగన్‌ ఎలా నెట్టుకొస్తారో చూడాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు