MLC Anantha Babu Arrest: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారని, ప్రలోభాలకు గురి చేశారని ఎమ్మెల్సీ అనంతబాబుపై సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
- Naveen
- Updated on- April 24, 2026 / 05:54 PM IST
MLC Anantha Babu Arrest
MLC Anantha Babu Arrest: తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి జిల్లా కోర్టు దగ్గర అనంతబాబును కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను సర్పవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారని, ప్రలోభాలకు గురి చేశారని ఎమ్మెల్సీ అనంతబాబుపై సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు అనంతబాబును అదుపులోకి తీసుకున్నారు.
రాజమండ్రి జిల్లా కోర్టులో హాజరయ్యేందుకు అనంతబాబు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సాక్షులను బెదిరించడం, ప్రలోభాలకు గురి పెట్టిన కేసులో పోలీసులు అనంతబాబును విచారించనున్నారు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని తెలియగానే గత మూడు రోజులుగా అనంతబాబు అజ్ఞాతంలో ఉన్నారు. ఎవరికీ కాంటాక్ట్ లో లేకుండా పోయారు. దీంతో నాలుగు బృందాలుగా పోలీసులు రంగంలోకి దిగారు. అనంతబాబు కోసం ముమ్మరంగా గాలించారు. ఈ క్రమంలో కోర్టు దగ్గరికి వచ్చిన అనంతబాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది.
ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్న నలుగురు సాక్షులను అనంతబాబు భయపెట్టి, ప్రలోభాలకు గురి చేశారని అభియోగం ఉంది. డబ్బు ఆశ చూపడమే కాకుండా చెప్పిన మాట వినకపోతే చంపేస్తానని బెదిరించినట్లు సాక్షులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అనంతబాబుతో పాటు అతడి ముగ్గురు అనుచరులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ హత్య కేసులో ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు అనంతబాబు.
Also Read: సింహాచలం చందనోత్సవంలో కనిపించని గంటా.. ఎందుకీ దూరం, మౌనం?
