Ganta Srinivasa Rao: సింహాచలం చందనోత్సవంలో కనిపించని గంటా.. ఎందుకీ దూరం, మౌనం?
ఉత్తరాంధ్రలో మోస్ట్ పాపులర్ లీడర్ గంటా శ్రీనివాసరావు. 2014లో మంత్రిగా చక్రం తిప్పారు. ఆ తర్వాత 2019లో వైసీపీ వేవ్‌లోనూ గెలిచారు.
- హోంమంత్రి అనితకు చందనోత్సవ బాధ్యతలు
- గతేడాది జరిగిన ఘటనతో సర్కార్ జాగ్రత్తలు
- సొంత నియోజకవర్గంలో జరిగిన ఉత్సవానికి గంటా డుమ్మా
Ganta Srinivasa Rao: సీనియర్ మోస్ట్ లీడర్. ప్రతీ ఎన్నికలప్పుడు నియోజకవర్గం మార్చి పోటీ చేసి గెలవడం ఆయన స్టైల్. అలాంటి లీడర్ కొన్నాళ్లుగా సైకిల్ పార్టీలో సైలెంట్‌గా ఉండిపోతున్నారట. టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉంటున్నారట. లేటెస్ట్గా ఆయన నియోజకవర్గ పరిధిలో జరిగిన..చందనోత్సవంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కనిపించకపోవడం చర్చకు దారితీసింది. ఇంతకు ఎవరా నేత? ఆయనెందుకు తన నియోజకవర్గంలో జరిగిన పెద్ద ఈవెంట్‌కు దూరంగా ఉన్నారు? ఆ నేత అసంతృప్తి అంతకంతకు పెరుగుతుందా?
ఉత్తరాంధ్రలో మోస్ట్ పాపులర్ లీడర్ గంటా శ్రీనివాసరావు. 2014లో మంత్రిగా చక్రం తిప్పారు. ఆ తర్వాత 2019లో వైసీపీ వేవ్‌లోనూ గెలిచారు. 2024లో గెలిచాక అమాత్య యోగం దక్కకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు కొన్నాళ్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది చాలదన్నట్టు లేటెస్ట్గా సింహాచలంలోని శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి ఆలయ చందనోత్సవంలో ఆయనెక్కడా కనిపించలేదు. గంటా నియోజకవర్గం అయిన భీమిలి పరిధిలోకే సింహాచలం వస్తోంది. ఏడాదికి ఒకసారి జరిగే అతిపెద్ద ఈ ఆధ్యాత్మిక వేడుకకు సీనియర్ టీడీపీ లీడర్, సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా దూరంగా ఉండటం..తన నియోజకవర్గ పరిధిలోనే జరిగినా అటువైపు కన్నెత్తి చూడకపోవడం చర్చకు దారితీస్తోంది.
హోంమంత్రికి బాధ్యతలు అప్పగించడం గంటాకు నచ్చలేదా?
సింహాచల ఆలయ ఉత్సవాల బాధ్యతలను హోంమంత్రి అనితకు ఇచ్చింది సర్కార్. ఆమె అంతా తానై రివ్యూలు చేసి.. ఎక్కడా భక్తులకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే తన నియోజకవర్గంలో జరిగిన వేడుకకు సీనియర్ నేతనైన తనను కాదని..హోంమంత్రికి బాధ్యతలు అప్పగించడం గంటాకు నచ్చలేదనేది ఓ వర్గం వాదన. గతేడాది చందనోత్సవంలో గోడ కూలి అపశృతి జరగడం..ప్రభుత్వానికి కాస్త బ్యాడ్ నేమ్ రావడంతో ఈసారి జాగ్రత్తలు తీసుకుందట సర్కార్. అందుకే హోంమంత్రి అనితకు బాధ్యతలు అప్పగించారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.
రెండు దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్నా సరే ఓటమి అంటే తెలియని నాయకుడు గంటా. అలాగే జిల్లాలో పోటీ చేసిన స్థానం నుంచి తిరిగి పోటీ చేయకుండా విజయ కేతాన్ని ఎగురవేయడం ఆయన స్టైల్. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ, టీడీపీ ప్రభుత్వంలోనూ మంత్రిగా పని చేశారు. అలా ఉత్తరాంధ్రలో సీనియర్ మోస్ట్ లీడర్‌గా.. ఓటమెరుగని నేతగా ఉన్న ఆయనకు 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారన్న టాక్ నడిచింది. ప్రభుత్వంలో పదవి దక్కకపోయినా..పార్టీలో మంచి పొజీషన్ ఇస్తారని ఆశపడ్డ గంటాకు నిరాశే ఎదురైందట. అటు పొలిట్ బ్యూరో, ఇటు జాతీయ, రాష్ట్ర కమిటీల్లో ఆయనకు చోటు దక్కలేదు. పోనీ గంటాకు బదులుగా ఆయన కుమారుడు రవితేజకు అయినా సరే యూత్ కోటాలో ఛాన్స్ ఇచ్చారంటే అదీ లేదు.
తండ్రీ కొడుకులిద్దరికీ అధిష్టానం మొండి చేయి..
తండ్రీ కొడుకులిద్దరికీ టీడీపీ అధిష్టానం మొండి చేయి చూపింది. ఉత్తరాంధ్రలోని సీనియర్ లీడర్లకు లేదా, వారి వారసులకు పార్టీలోని ఏదో ఒక పొజిషన్ కట్టబెట్టారు. కానీ గంటాకు, ఆయన కుమారుడుకు పార్టీ పదవులు దక్కలేదు. తాను కోరుకున్న మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టడం, ఓ వైపు పార్టీ కమిటీల్లో స్థానం లేకుండా చేయడంతో గంటా డీప్‌గా హర్ట్ అయ్యారన్న గుసగుసలకు దారితీసింది. ఇక తన నియోజకవర్గంలో జరిగే చందనోత్సవ నిర్వహణ బాధ్యతలు పూర్తిగా హోంమంత్రికి అప్పగించడం కూడా తనను తగ్గించడమేనన్న ఫీలింగ్‌లో ఉన్నారట గంటా. అందుకే ఆయన చందనోత్సవం రోజు విశాఖలో లేకుండా..బిజీగా ఉండటం వల్లే రాలేదనే సంకేతాన్ని పంపే ప్రయత్నం చేశారట.
చంద్రబాబు అరెస్ట్ అప్పుడు మౌనం..
మరోవైపు టీడీపీ అధిష్టానం పెద్దలు గంటాను పూర్తిస్థాయిలో తమవాడిగా నమ్మడం లేదన్నది తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్న మాట. చంద్రబాబు అరెస్ట్ అప్పుడు..ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం..హైకమాండ్ పెద్దలు ఫోన్ చేసినా లైట్ తీసుకోవడం వంటివి టీడీపీ అధిష్టానంతో గంటాకు గ్యాప్ ఏర్పడటానికి కారణమయ్యాయని అంటున్నారు. అందుకే ఇప్పుడు పవర్లోకి వచ్చినా ఆయనకు పెద్దపీట దక్కట్లేదని ఓపెన్ సీక్రెట్ అంటున్నారు విశాఖ టీడీపీ నేతలు.
Also Read: డ్రైవర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఎమ్మెల్సీ అనంతబాబు ఈసారి బుక్కైనట్లేనా? అరెస్ట్ తప్పదా?
