Anil Kumar Yadav
Anil Kumar Yadav – Narayana : నెల్లూరులో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. తాజాగా మాజీమంత్రి, నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. మాజీమంత్రి, టీడీపీ నేత నారాయణపై సంచలన ఆరోపణలు చేశారు.
గత కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఓడించేందుకు నారాయణ తనకు డబ్బులు పంపించారని అన్నారు. ఇప్పటివరకు సందర్భం రానందున ఈ విషయాన్ని బయటపెట్టలేదన్న అనిల్ కుమార్ యాదవ్.. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. టీడీపీ నేతలను ఓడించేందుకు నారాయణ తనకు డబ్బులు పంపగా, తాను ఆ డబ్బును వెనక్కి పంపేసినట్లు వెల్లడించారు.
అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్..
మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మాకు డబ్బులు పంపించిన మాట వాస్తవం కాదా? ఆ డబ్బును నేను వెనక్కి పంపించిన మాట వాస్తవం కాదా? చెప్పమనండి. ఇదే నారాయణ గారు.. వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ అభ్యర్థుల విజయం కోసం మాకు ఆర్థిక సాయం పంపిస్తే నేను ఆ డబ్బును వెనక్కి పంపించిన మాట వాస్తవమా? కాదా? నారాయణ గారు చెప్పాలి. ఇది వాస్తవం. ఇదేం రాజకీయం కాదు. నేను ఎక్కడికైనా వచ్చేదానికి సిద్ధం. నేను దేనికైనా సిద్ధం.
నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నా. అవసరమైతే ప్రమాణానికి కూడా సిద్దం. టీడీపీలో జెండా మోసిన వారిని మోసగించడం మామూలే. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అబ్దుల్ అజీజ్ ల పరిస్థితే ఇందుకు నిదర్శనం. తాను లోకేశ్ పై చేసిన విమర్శలకు జిల్లా వ్యాప్తంగా టీడీపీ అలర్ట్ అయిందంటే నా బలమెంతో అర్థమవుతోంది. నేను చేసిన ఆరోపణలను నారాయణ కాదనగలరేమో చెప్పాలి.