Kuppam Clashes : కుప్పంలో ఘర్షణల పంచాయితీ మరో మలుపు తిరిగింది. కుప్పంలో ఘర్షణలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కుప్పంలో ఘర్షణల విషయంలో 33 మంది టీడీపీ నేతలపై, రామకుప్పం దాడి ఘటనలోనూ 26 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజుల వ్యవధిలో 59మంది టీడీపీ నేతలపై కేసులు నమోదవగా.. ముగ్గురు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
కుప్పంలో ఫ్లెక్సీలు చించడమే కాకుండా తమపై దాడి చేసిన వైసీపీ నేతలను వదిలిపెట్టి కేవలం తమపైనే కేసులు నమోదు చేశారని తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు. వందలమంది వైసీపీ నేతలు వచ్చి అన్న క్యాంటీన్ ముందున్న టీడీపీ ఫ్లెక్సీలను చించేస్తే కేవలం ముగ్గురిపైనే కేసులు నమోదు చేయడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
కుప్పం వైసీపీ ఇంచార్జి భరత్ ఇంటి దగ్గర నుంచి బస్టాండ్ దగ్గరున్న వైఎస్ఆర్ విగ్రహం వరకు పెట్టిన బారికేడ్లను వైసీపీ నేతలు ధ్వంసం చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయినా వైసీపీ నేతలపై కేసులు పెట్టడం లేదని మండిపడ్డారు.
కుప్పం ఘర్షణలో కేవలం టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేయడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. పోలీసుల తీరును చంద్రబాబు తప్పుపట్టారు. డీజీపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు చంద్రబాబు. పోలీస్ వ్యవస్థను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. వైసీపీ కోసమే పోలీస్ వ్యవస్థ పని చేస్తోందని చంద్రబాబు విమర్శలు చేశారు.