Srikalahasti Race Gurralu : టీడీపీ వర్సెస్ వైసీపీ.. ముక్కంటి ఇలాకాలో హోరాహోరీ

ముక్కంటి ఇలాకాలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ విజేత ఎవరన్నది ఆ శివునికే ఎరుక.

Srikalahasti Race Gurralu : ముక్కంటి సాక్షిగా శ్రీకాళహస్తి రాజకీయం కాక రేపుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు అధికార, విపక్ష పార్టీల అభ్యర్థులు సవాళ్లు, ప్రతిసవాళ్లతో పొలిటికల్‌ వార్‌ దుమ్మురేపుతోంది. ఎమ్మెల్యేగా ఐదేళ్ల అనుభవంతో ఒకరు.. ఐదు పర్యాయాలు నియోజకవర్గాన్ని ఏలిన కుటుంబం నుంచి మరొకొరు ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. హోరాహోరీగా జరుగుతున్న ఈ పోరులో అంతిమ విజయం ఎవరిది? శ్రీకాళహస్తిలో కనిపించబోయే సీనేంటి?

ఇక్కడ రెడ్లదే రాజ్యం…
పవిత్ర స్వర్ణముఖి నది తీరాన వెలసిన ముక్కంటి క్షేత్రం శ్రీకాళహస్తి. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తిపై పట్టు కోసం పార్టీలు కుస్తీలు పడుతుంటాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణిగుంట, తొట్టంబేడు మండలాలు ఉన్నాయి. ఇక్కడ రెడ్లదే రాజ్యం. బీసీ కేటగిరీలోకి వచ్చే పల్లె రెడ్లు అధికంగా ఉంటారు. సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉండే శ్రీకాళహస్తి ప్రాంతంలో పంట పొలాలు పచ్చదనంతో కళకళలాడుతుంటాయి. వ్యవసాయం ఈ ప్రాంత ప్రజల ప్రధాన వృత్తి. అందుకే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న మిగిలిన నియోజకవర్గాలకన్నా శ్రీకాళహస్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట..
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట. గత పది ఎన్నికల్లో ఆరుసార్లు టీడీపీయే విజయం సాధించింది. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ, ఓ సారి స్వతంత్ర అభ్యర్థి ఇక్కడి నుంచి గెలిచారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ నేత ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తొలిసారి విజయం దక్కించుకున్నారు. ఇక టీడీపీ తరఫున బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. పలుమార్లు మంత్రిగానూ పనిచేసి జిల్లాలో తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.

2014 ఎన్నికల్లో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గోపాలకృష్ణారెడ్డి కొంతకాలం మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా ఆయన మరణించడంతో గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ ఇన్‌చార్జి బాధ్యతలు దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతిలో ఓడిన సుధీర్ రెడ్డి ఈ ఎన్నికల్లో మరోసారి తలపడుతున్నారు.

కోవిడ్ కాలంలో సేవలకు ప్రజల్లో గుర్తింపు..
గత ఎన్నికల్లో తొలిసారి గెలిచినా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నియోజకవర్గంలో బాగా పట్టు పెంచుకున్నారు. కోవిడ్ సమయంలో ఆయన చేసిన సేవలతో ప్రజల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కరోనా సమయం నుంచి శ్రీకాళహస్తి వాసులను కంటికి రెప్పలా కాపాడానని, ఆ అభిమానంతోనే మరోసారి ప్రజలు తనను గెలిపిస్తారని మధుసూదన్ రెడ్డిలో ధీమా కనిపిస్తోంది.

ఎమ్మెల్యే చేష్టల వల్లే ఎక్కువ మరణాలు అంటూ ఆరోపణలు..
టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. కరోనా సమయంలో ఇతని చేష్టల వల్లే చాలామంది మరణించారని ఆరోపిస్తున్నారు సుధీర్‌రెడ్డి. ఈ ఐదేళ్లు నియోజకవర్గాన్ని దోపిడీ చేశారని, ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములు విక్రయించారని, అనేక పరిశ్రమలను బెదిరించి సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు సుధీర్ రెడ్డి.

ఇక్కడ విజేత ఎవరన్నది ఆ శివునికే ఎరుక..
మొత్తానికి శ్రీకాళహస్తిలో ఇద్దరు అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇద్దరు నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో శ్రీకాళహస్తి రాజకీయం హీట్‌పుట్టిస్తోంది. మొత్తం మీద ముక్కంటి ఇలాకాలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ విజేత ఎవరన్నది ఆ శివునికే ఎరుక.

Also Read : చంద్రబాబు పొడవమంటే సొంత తండ్రికే వెన్నుపోటు పొడిచేసింది- సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

 

ట్రెండింగ్ వార్తలు