Botcha Jhansi Lakshmi Vs Sribharat : బొత్స ఝాన్సీ వర్సెస్ భరత్.. విశాఖ లోక్‌సభ సీటులో ఈసారి గెలిచేది ఎవరు?

రెండు పార్టీలకూ ఒకే సమస్య గుదిబండగా మారడంతో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.

Botcha Jhansi Lakshmi Vs Sribharat : రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఎప్పుడూ నాన్‌లోకల్‌ లీడర్లు పోటీపడే ఉక్కు నగరంలో తొలిసారి ఇద్దరు స్థానికులు పోటీ పడుతున్నారు. ఆ ఇద్దరు కూడా బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వారే కావడంతో అందరి దృష్టీ ఆకర్షిస్తోంది విశాఖ. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న విశాఖ లోక్‌సభ సీటులో ఈసారి గెలిచేది ఎవరు? రాష్ట్ర మంత్రి బొత్స సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీకి.. గీతం విద్యాసంస్థల అధినేత శ్రీభరత్‌కు మధ్య పోటీ హైటెన్షన్‌గా మారుతోందా?

విశాఖ ఎంపీ పదవికి విపరీతమైన క్రేజ్‌..
అందాల నగరం.. రాష్ట్ర ఆర్థిక రంగానికి ఆయవు పట్టులాంటి విశాఖపట్నం.. రాష్ట్ర రాజకీయాలకు కూడా అనధికార రాజకీయ కేంద్రంగా మారింది. స్టీల్‌ప్లాంట్‌, షిప్‌యార్డ్‌, నావికాదళంతోపాటు పలు పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నిలయమైన విశాఖలో వివిధ భాషలు, ప్రాంతాల వారు అధికంగా నివసిస్తుంటారు. అందుకే ఇక్కడ రాజకీయం కూడా పార్టీలు, ప్రాంతాలకతీతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా విశాఖ ఎంపీ అంటే విపరీతమైన క్రేజ్‌ చూపిస్తుంటారు నేతలు. ఇతర ప్రాంతాల వారు ఎక్కువగా ఉండటంతో విశాఖ ఎంపీగా పోటీకి కూడా స్థానికేతర నాయకులే ఎక్కువగా ఉవ్విళ్లూరుతుంటారు.

తొలిసారిగా ఇద్దరు స్థానిక నేతల పోటీ..
ఐతే ఈసారి తొలిసారిగా ఇద్దరు స్థానికులు పోటీ చేస్తుండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ తరఫున రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి పోటీ చేస్తుండగా, టీడీపీ అభ్యర్థిగా గీతం విద్యాసంస్థల అధినేత భరత్‌ రంగంలోకి దిగారు. టీడీపీ యువనేత లోకేశ్‌ తోడల్లుడు, బాలయ్య చిన అల్లుడైన భరత్‌ విజయం ఆ పార్టీకి ప్రతిష్టాత్మకం కావడంతో విశాఖ రాజకీయాలు హాట్‌ హాట్‌గా మారాయి.

కేవలం 4 వేల ఓట్ల తేడాతో భరత్‌ ఓటమి..
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్‌, సిట్టింగ్‌ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై కేవలం 4వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీ చేయడం, జనసేన అభ్యర్థిగా మాజీ జేడీ లక్ష్మీనారాయణ దాదాపు రెండు లక్షల పైగా ఓట్లు చీల్చడంతో పరాజయం పాలయ్యారు భరత్‌. నగరంలోని నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నా టీడీపీకి చేదు ఫలితమే ఎదురైంది. ఇదే సమయంలో ఎస్‌.కోట, భీమిలి, గాజువాక స్థానాల్లో సాధించిన విజయంతో వైసీపీ విశాఖ ఎంపీ సీటును గెలుచుకుంది. ఐతే ఈసారి సిట్టింగ్‌ ఎంపీ ఎంవీవీ సత్యానారాయణ విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటంతో ఆయన స్థానంలో మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మిని బరిలోకి దింపింది అధికార పార్టీ.

విశాఖపై బొత్సకు గట్టి పట్టు..
ఉత్తరాంధ్రలో కీలక నాయకుడైన రాష్ట్ర మంత్రి బొత్సకు విశాఖ నగరంలో కూడా గట్టిపట్టే ఉంది. పైగా ఆయన సతీమణి ఝాన్సీలక్ష్మి కూడా విశాఖలోనే పుట్టి పెరిగారు. ఇక్కడి ఆంధ్రా వర్సిటీలో చదువుకున్న ఝాన్సీలక్ష్మి.. వచ్చే ఎన్నికల్లో విజయంపై ధీమాగా ఉన్నారు. స్థానికంగా తన కుటుంబానికి ఉన్న పలుకుబడితోపాటు గతంలో ఎంపీగా తాను చేసిన పనులే గెలిపిస్తాయంటున్నారు ఝాన్సీలక్ష్మి..

ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్ వే..
ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్ వేగా చెప్పే విశాఖలో గెలవడం రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకం. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి బొత్సకు… మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుకు విశాఖలో విజయం వ్యక్తిగతంగా చాలా అవసరం. విశాఖలో ఝాన్సీలక్ష్మి విజయం సాధిస్తే, వైసీపీలో బొత్స పాత్ర మరింత కీలకంగా మారనుంది. అదే సమయంలో ప్రభుత్వంలోనూ ఆయన ప్రాధాన్యం పెరగనుంది.

విశాఖ సీటుపై ఒత్తిళ్లకు తలొగ్గని చంద్రబాబు..
ఇక టీడీపీ విశాఖ సీటు గెలవడం పార్టీతోపాటు చంద్రబాబుకు వ్యక్తిగతంగా చాలా అవరసరమని చెబుతున్నారు పరిశీలకులు. తన కుమారుడి తోడల్లుడైన భరత్‌ను గెలిపించే బాధ్యత తన భుజస్కందాలపై వేసుకున్న చంద్రబాబు… ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా విశాఖ సీటును వదులుకోలేదని చెబుతున్నారు. విశాఖ ఎంపీ సీటు కోసం బీజేపీ జాతీయ స్థాయిలో బాబుపై ఒత్తిడి తెచ్చింది. కానీ, తన కుటుంబ అవసరాలు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు… భరత్‌ స్థానాన్ని వదులుకోలేదంటున్నారు. ఇదే భరత్‌ తొలి విజయంగా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.

సేవా కార్యక్రమాలతో జనంలోకి భరత్..
ఇలా రెండు పార్టీలకు కీలకమైన విశాఖలో ప్రస్తుతం రాజకీయం నువ్వా – నేనా అన్నట్లు సాగుతోంది. ఓ వైపు మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి విస్తృత ప్రచారం చేస్తుండగా, మరోవైపు భరత్‌.. యువతతో మమేకమవుతూ రోజుకో ప్రత్యేక కార్యక్రమంతో తన మార్క్‌ చూపిస్తున్నారు. డైలాగ్‌ విత్‌ భరత్‌ అనే కార్యక్రమం ద్వారా స్థానిక సమస్యలు తెలుసుకుంటున్న భరత్‌.. తాను గెలిస్తే ఏం చేస్తానో ప్రజలకు వివరిస్తున్నారు. ఇప్పటికే మెడికల్‌ క్యాంపులతో సేవా కార్యక్రమాలు చేసిన భరత్‌…. వినూత్న పంథాలో ప్రచారం చేస్తూ ప్రజల్లో క్రేజ్‌ పెంచుకుంటున్నారు.

బీసీ కార్డు ప్రయోగం..
ఇక వైసీపీ కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. విశాఖ నగరంలో బీసీ సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. దీంతో బీసీ మహిళా నేతను రంగంలోకి దింపింది. నగరంలో యాదవ సామాజికవర్గంతోపాటు, తూర్పు కాపు, మత్స్యకార, గవర, వెలమ కులాల ఓట్లు అధికంగానే ఉన్నాయి. వీరంతా వెనుకబడిన వర్గాలే కావడంతో బీసీ కార్డు ప్రయోగిస్తోంది వైసీసీ… అంతేకాకుండా ఉత్తరాంధ్రలోని కీలక రాజకీయ కుటుంబానికి చెందిన మహిళా నేత కావడంతో టీడీపీకి దీటుగా పోటీ ఇస్తున్నారు బొత్స ఝాన్సీలక్ష్మి. పార్లమెంట్‌ సమన్వయకర్తగా ఆమె ప్రకటించిన నుంచే ప్రజల్లో తిరుగుతున్నారు. షెడ్యూల్‌ విడుదలకు ముందే ఓ విడత ప్రచారం పూర్తి చేశారంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి తిరుగుతున్న ఝాన్సీలక్ష్మి… విజయంపై పక్కా ధీమా ప్రదర్శిస్తున్నారు.

ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో?
ప్రస్తుతం రెండు పార్టీల అభ్యర్థుల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఎమ్మెల్యేల అండదండలతో టీడీపీ… పరిపాలన రాజధాని, సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకుని వైసీపీ విశాఖ సీటు తమదంటే తమదని చెప్పుకుంటున్నాయి. కానీ, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ, రైల్వేజోన్‌ వంటి ప్రధాన సమస్యలు ఇరు పార్టీలకూ సవాల్‌గా మారాయి. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ.. విశాఖ అభివృద్ధిని గాలికొదిలేసిందని టీడీపీ ఆరోపిస్తుండగా, స్టీల్‌ప్లాంట్‌, రైల్వేజోన్‌పై సహకరించని బీజేపీతో కలిసిపోటీ చేయడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. మొత్తానికి రెండు పార్టీలకూ ఒకే సమస్య గుదిబండగా మారడంతో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.

Also Read : ఒకవైపు అదృష్టవంతుడు, మరోవైపు పోరాట యోధుడు.. నెల్లూరు రూరల్‌లో గెలుపెవరిది?

ట్రెండింగ్ వార్తలు