Dharmana Prasada Rao Vs Gondu Shankar : అక్కడ వైసీపీ సీనియర్‌ను ఓడించేందుకు చంద్రబాబు సరికొత్త ప్రయోగం..!

వచ్చే ఎన్నికల్లో అభివృద్ధే ప్రధాన అజెండాగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎవరి వాదనను నమ్ముతారనేది ఎన్నికల్లోనే తేలనుంది.

Dharmana Prasada Rao Vs Gondu Shankar

Dharmana Prasada Rao Vs Gondu Shankar : నాగావళి జలాలు ఎంత మధురంగా ఉంటాయో… ఆ నియోజవర్గం పాలిటిక్స్‌ అంత హాట్‌గా ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక అలజడితో ఆ నియోజకవర్గ రాజకీయం మలుపులు తిరుతుంటుంది. ఒకప్పుడు టీడీపీ కంచుకోటైన అక్కడ సీనియర్‌ మంత్రి ధర్మాన పాగా వేసి వైసీపీకి అడ్డాగా మార్చేశారు. ఇప్పుడు కూడా మరోసారి తనదే హవా అంటున్నారు మంత్రి ధర్మాన…. ఇక మంత్రి దూకుడికి కళ్లెం వేయడానికి యువనేతను బరిలోకి దింపింది టీడీపీ.. దీంతో సీనియర్‌, జూనియర్‌ మధ్య సమరం ఆసక్తికరంగా మారింది. మరి ఈ సమరంలో పైచేయి సాధించేదెవరు? సిక్కోలులో కనిపించే సీన్‌ ఏంటి?

గెలుపు కోసం చంద్రబాబు సరికొత్త ప్రయోగం..
సిక్కోలు రాజకీయం రసవత్తరంగా మారింది. సీనియర్‌ నేత ధర్మానపై కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చింది టీడీపీ.. ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అయిన శ్రీకాకుళం.. ఇప్పుడు మంత్రి ధర్మానకు అడ్డాగా మారింది. ఈ ఎన్నికల్లో ధర్మానను ఓడించి పూర్వవైభవం దిశగా అడుగులు వేయాలని భావిస్తోంది టీడీపీ. అందుకోసం సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు…

వినూత్నంగా ప్రజాతీర్పు.. తొలి ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపు
ఉద్యమాల పురిటిగడ్డ అయిన శ్రీకాకుళంలో ఇప్పుడు రాజకీయం హాట్‌ హాట్‌గా కనిపిస్తోంది. శ్రీకాకుళోద్యమంతో ఒకప్పుడు ఈ ప్రాంతానికి ఎంతో గుర్తింపు ఉండేది. ప్రస్తుతం ఉద్యమం వాతావరణం లేకపోయినా, ప్రజల్లో ఆ చైతన్యం మాత్రం అంతర్లీనంగా కొనసాగుతూనే ఉంది. అందుకే ప్రజాతీర్పు వినూత్నంగా ఉంటుంది. దీనికి తగ్గట్టే ఈ నియోజకవర్గం ఆవిర్భావంతోనే ఇండిపెండింట్‌ను అసెంబ్లీకి పంపారు శ్రీకాకుళం ఓటర్లు. 1955లో సిక్కోలు అసెంబ్లీకి తొలి ఎన్నికలు జరిగితే… ఇండిపెండెంట్ అభ్యర్థిగా పసగాడ సూర్యనారాయణ గెలుపొందారు. ఆ తరువాత జరిగిన ఐదు ఎన్నికల్లోనూ జనతాపార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇండిపెండెంట్లు విజయం సాధించారు.

4సార్లు టీడీపీ అభ్యర్థి విజయం..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత 1985 నుంచి 99 వరుసగా నాలుగు సార్లు మాజీ ఎమ్మెల్యే గుండ అప్పల సూర్యనారాయణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు గుండ అప్పలసూర్యానారాయణ. ముక్కుసూటితత్వం, నిజాయితీ ఉన్న నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్న గుండ అప్పలసూర్యనారాయణ.. 2004, 09 ఎన్నికల్లో అపజయం మూటగట్టుకున్నారు. ఈయనపై సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు గెలుపొందారు.

ధర్మాన వర్సెస్ గుండ ఫ్యామిలీ..
ఇక ధర్మాన వ్యూహాల ముందు గుండ ఎత్తుగడలు ఫలించడం లేదని భావించిన అధిష్టానం.. 2014లో అప్పలసూర్యనారాయణ స్థానంలో ఆయన సతీమణి గుండ లక్ష్మీదేవిని అభ్యర్థిగా పోటీచేయించింది. ఆ ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించి మంత్రి ధర్మాన హవాకు బ్రేక్‌ వేశారు. ఐతే 2019లో మళ్లీ ధర్మానే గెలవడంతో…. అప్పటి నుంచి ధర్మాన వర్సెస్‌ గుండ ఫ్యామిలీ మధ్య ఆధిపత్యపోరుగా సిక్కోలు రాజకీయం మారిపోయింది. అయితే వయసు పైబడటంతో ఈసారి గుండ దంపతులను పక్కన పెట్టి యువకుడైన గొండు శంకర్‌కు టికెట్‌ ఇచ్చింది టీడీపీ…

వెలమ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ…
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో శ్రీకాకుళం నగరంతోపాటు, శ్రీకాకుళం రూరల్, గార మండలాలు ఉన్నాయి. మొత్తం 2 లక్షల 71 వేల 079 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు లక్ష 34 వేల 177 మంది కాగా, లక్షా 36 వేల 871 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక సామాజికవర్గాల పరంగా వెలమ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. రెండో స్థానంలో కళింగ వైశ్యులు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కళింగ, మత్స్యకార, శిష్ట కరణ కులాల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.

రాజకీయ వ్యూహరచనలో దిట్ట ధర్మాన..
సామాజిక సమీకరణాల దృష్టా గత నాలుగు దశాబ్దాల్లో శ్రీకాకుళం నుంచి వెలమ సామాజికవర్గం నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. ఈసారి కూడా ప్రధాన పార్టీలు రెండూ అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు, గొండు శంకర్‌లకు టికెట్లు ఇచ్చాయి. మంత్రి ధర్మాన సొంత నియోజకవర్గం నరసన్నపేట కాగా, 2004 నుంచి ఆయన శ్రీకాకుళం నుంచే పోటీ చేస్తున్నారు. అప్పటి నుంచి జరిగిన నాలుగు ఎన్నికల్లో మూడు సార్లు గెలిచిన మంత్రి ధర్మాన.. శ్రీకాకుళంపై పట్టు సాధించారు. సీనియర్ నేతగా, రాజకీయ వ్యూహరచనలో దిట్టగా పేరున్న ధర్మాన ప్రసాదరావు… మంచి వాగ్దాటితో ప్రజలను ఆకట్టుకుంటారు. స్థానిక యాస, భాషలతో ధర్మాన ప్రసంగాలు ఒక్కోసారి సంచలనం సృష్టిస్తుంటాయి. తన ప్రసంగాల్లో పిట్టకథలు చెప్పే ధర్మాన… తనను ఎందుకు గెలిపించాల్సిన అవసరమేంటో చెబుతూ.. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

గ్రామ సర్పంచ్‌ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చంద్రబాబు..
తనదైన శైలితో… వాగ్దాటితో ధర్మాన ప్రచారంలో దూసుకుపోతుండగా, ఆయనకు బ్రేకులు వేసేలా సరైన స్కెచ్‌ వేసింది టీడీపీ. వృద్ధ నేతలను పక్కకు తప్పించి.. ధర్మానను ఢీకొట్టగల యువనేతను తెరపైకి తెచ్చింది. రాజకీయ కుటుంబానికి చెందిన కిష్టప్పపేట సర్పంచ్‌ గొండు శంకర్‌కు టీడీపీ టికెట్‌ ఇచ్చింది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ గ్రామ సర్పంచ్‌ను నేరుగా రాష్ట్ర రెవెన్యూ మంత్రితో తలపడే స్థాయి కల్పించడంతో క్యాడర్‌ కూడా హ్యాపీగా ఫీలవుతోంది. క్షేత్రస్థాయి సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడికి సీటు ఇవ్వడంపై కేడర్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వర్గం శంకర్‌కు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వల్లే లక్ష్మీదేవికి టికెట్‌ దక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆమె వర్గీయులు. అయితే హైకమాండ్‌ జోక్యంతో ఈ సమస్య సర్దుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎన్నికలకు ఇంకా 45 రోజుల సమయం ఉండటంతో గుండ వర్గాన్ని సంతృప్తి పరచొచ్చని భావిస్తోంది టీడీపీ హైకమాండ్‌.

హోరాహోరీ పోరులో పైచేయి ఎవరిదో?
మొత్తానికి నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న యువనేతను నాలుగు పదుల వయసున్న నేత ఢీకొట్టడం ఆసక్తి రేపుతోంది. హోరాహోరీగా జరిగే పోరులో ఎవరిది పైచేయి అవుతుందనేది ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించకపోవడం, రోడ్ల విస్తరణ చేపట్టకపోవడం, ట్రాఫిక్‌ సమస్య, మత్స్యకారుల ఇబ్బందులు ఎన్నికల ప్రచార అంశాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులకు పదవులు దక్కక కొంత అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

మంత్రి ధర్మాన ప్రధానంగా పార్టీ నేతలను సర్ది చెప్పకపోతే… ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ కూడా గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపణలు గుప్పిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అభివృద్ధే ప్రధాన అజెండాగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎవరి వాదనను నమ్ముతారనేది ఎన్నికల్లోనే తేలనుంది.

Also Read : నాని వర్సెస్ మోహిత్ రెడ్డి.. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో గెలుపెవరిది?

 

ట్రెండింగ్ వార్తలు