dr Monditoka Jagan Mohan Rao vs Tangirala sowmya
Nandigama Assembly Constituency : ఆ నియోజకవర్గం టీడీపీ కంచుకోట.. గత నాలుగు దశాబ్దాల్లో కేవలం రెండుసార్లు మాత్రమే అక్కడ వేరే పార్టీ గెలిచింది. 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్, గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన ఆ స్థానంలో ఇప్పుడు పోటీ ఎలా ఉంది? అభివృద్ధి, సంక్షేమ పథకాల అండతో వైసీపీ వన్స్‌మోర్ అంటుంటే.. నమ్మకమైన ఓటు బ్యాంకుపైనే విశ్వాసం వ్యక్తం చేస్తోంది టీడీపీ. మరి ఈ రెండు పార్టీల్లో ఈ సారి గెలిచే పార్టీ ఏది? ప్రజాబలం ఎవరికి ఉంది? ప్రభావం చూపే నేతలు ఎవరు?
హేమాహేమీల ప్రాతినిధ్యంతో నందిగామకు ప్రత్యేక గుర్తింపు..
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గం నందిగామ. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ఎస్సీ రిజర్వుగా మారింది ఈ నియోజకవర్గం. అంతకుముందు హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించడంతో ఈ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. వసంత నాగేశ్వరరావు, దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమామహేశ్వరరావు సుదీర్ఘకాలం పాటు నందిగామ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2009, 2014 ఎన్నికల్లో తంగిరాల ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వగా, 2014 ఎన్నికల అనంతరం కొద్ది రోజులకే ఆయన మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో ప్రభాకర్ కుమార్తె తంగిరాల సౌమ్య ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో విక్టరీ కొట్టిన వైసీపీ… టీడీపీ ఆధిపత్యానికి చెక్ చెప్పింది.
కమ్యూనిస్టులు, కాంగ్రెస్ తర్వాత టీడీపీ కంచుకోట..
1955లో నందిగామ నియోజకవర్గం ఏర్పడగా, తొలుత కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఇక 1983లో టీడీపీ ఆవిర్భావంతోనే నందిగామ ఆ పార్టీకి అడ్డాగా మారింది. తిరుగులేని శక్తిగా టీడీపీ ఎదిగింది. 1989లో ఒకసారి కాంగ్రెస్ గెలిస్తే, గత ఎన్నికల్లో వైసీపీ పాగా వేసి టీడీపీని దెబ్బతీసింది. ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ, టీడీపీ నువ్వా నేనా అనేస్థాయిలో తలపడుతున్నాయి. ఎస్సీ రిజర్వు నియోజకవర్గమైన నందిగామలో మాదిగ సామాజికవర్గం ఓట్లే ఎక్కువ. బీసీలు కూడా అభ్యర్థుల విజయావకాశాలను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు.
ఎక్కువ సార్లు ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నిక..
నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో కమ్మ సామాజికవర్గం ఓటర్లు సుమారు 35 వేలు ఉంటారు. కాపు సామాజిక వర్గానికి 20 వేలు, బీసీలు సుమారు 80 వేలు ఉంటారని అంచనా. ఇక ఎస్సీల్లో మాల సామాజికవర్గం 15 వేలు, మాదిగ సామాజిక వర్గం సుమారు 55 వేలు ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. నియోజకవర్గ చరిత్రలో కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తోంది. 16 సార్లు ఎన్నికలు జరిగితే ఎక్కువ సార్లు ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అత్యధిక ఓటర్లుగా ఉన్న బీసీలు రాజకీయంగా నామ మాత్రంగానే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఎస్సీలకు రిజర్వు చేయడంతో ఆ సామాజికవర్గం వారే పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీల్లోని మాదిగలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి పార్టీలు.
నందిగామపై పట్టు బిగించిన వైసీపీ..
ఇక గత ఎన్నికల్లో టీడీపీ ఆధిపత్యానికి గండి పడటంతో ఈ సారి ప్రతిష్ఠాత్మకంగా పోరాడుతోంది. గత ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మొండితోక జగన్మోహనరావు.. ఐదేళ్లుగా టీడీపీని దీటుగా ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు. అందుకే సీఎం జగన్ కూడా మొండితోక బ్రదర్స్‌కు ఎంతో ప్రాధాన్యమిస్తుంటారు. ఎమ్మెల్యే సోదరుడు అరుణ్‌కుమార్‌ను ఎమ్మెల్సీగా నియమించిన వైసీపీ.. నందిగామపై పట్టు బిగించిది. రెండోసారి గెలిచి నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తోంది. కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని.. 40 ఏళ్లలో టీడీపీ చేయలేనిది నాలుగేళ్లలో తాము చేసి చూపించామని అంటున్నారు ఎమ్మెల్యే జగన్మోహనరావు. అందుకే సీఎం జగన్ తనకు రెండోసారి చాన్స్ ఇచ్చారంటున్నారు.
మాజీ మంత్రి దేవినేని ఉమాకు గెలుపు బాధ్యత..
అభివృద్ధి చేశామన్న ధీమాతో వైసీపీ పోరాడుతుంటే.. గత ఎన్నికల్లో కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందాలని తెగ కష్టపడుతోంది టీడీపీ. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు రెండో సారి చాన్స్ ఇచ్చిన పార్టీ.. ఆమె గెలుపు బాధ్యతలను మాజీ మంత్రి దేవినేని ఉమాకు అప్పగించింది. నందిగామ ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేసిన ఉమాకు నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఇక గతంలో దేవినేని కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వసంత నాగేశ్వరరావు కుటుంబం కూడా ఇప్పుడు టీడీపీలో చేరడంతో నందిగామలో తమ బలం పెరిగిందని భావిస్తోంది టీడీపీ. మాజీ ఎమ్మెల్యే సౌమ్య కూడా గత ఐదేళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ హయాంలో నందిగామలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు గుర్తించారని చెబుతున్నారు సౌమ్య. ఈ సారి పసుపు జెండా ఎగరడం ఖాయమంటున్నారు.
ఉత్కంఠ పోరులో విజయం ఎవరిది?
మొత్తానికి అధికార వైసీపీని ఢీకొట్టేందుకు టీడీపీ చతురంగ బలాలను కూడదీసుకుంటోంది. తొలిసారి నందిగామలో గెలిచిన వైసీపీ…. ఇక శాశ్వతంగా స్థిరపడాలనే ఆలోచనతో ఎమ్మెల్యే మొండితోక బ్రదర్స్‌కు విశేష ప్రాధాన్యమిచ్చింది. వీరికి విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా తోడవడంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు సంయుక్తంగా టీడీపీని నిలువరించే ప్రయత్నం చేస్తుండగా, టీడీపీ అభ్యర్థి సౌమ్య కోసం దేవినేని అభిమానులు, వసంత నాగేశ్వరరావు అనుచరులు ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఉత్కంఠ పోరులో విజయం ఎవరి సొంతమవుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : టార్గెట్ బాలయ్య.. ఎమ్మెల్యే బాలకృష్ణ ఓటమికి వైసీపీ భారీ స్కెచ్..! ఏంటా వ్యూహం