Chilakam Madhusudhan Reddy : టీడీపీ లేదా బీజేపీకి టికెట్ ఇచ్చి వైసీపీని గెలిపించొద్దు- జనసేన నేత కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి టికెట్ విషయంలో పునరాలోచించుకోవాలి. ఒక సీటూ వైసీపీకి ఇవ్వకూడదన్నదే నా బాధ.
- Naveen
- Updated on- March 22, 2024 / 06:39 PM IST
Chilakam Madhusudhan Reddy
Chilakam Madhusudhan Reddy : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ విషయమై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ లేదా బీజేపీకి ధర్మవరంలో టికెట్ ఇస్తే నేను కళ్ళు మూసుకున్నా గెలవచ్చు అని వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రచారం కూడా చేయకుండా ఇంట్లో కూర్చుంటారని మధుసూదన్ రెడ్డి అన్నారు. జనసేనకు కాకుండా టీడీపీ, బీజేపీలలో ఎవరికి టికెట్ వచ్చినా వాళ్లలో ఉన్న అంతర్గత కుమ్ములాటలే నన్ను గెలిపిస్తాయని ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. ధర్మవరం టికెట్ ను టీడీపీ లేదా బీజేపీకి ఇచ్చి అనవసరంగా ఇక్కడ వైసీపీని గెలిపించవద్దని చిలకం మధుసూన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
”ధర్మవరంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తే ఎవరూ పట్టించుకోలేదు. జనసేన తరఫున సేవ్ ధర్మవరం పేరుతో ఇంటింటికి నేనే తిరిగా. టీడీపీ, బీజేపీ కార్యకర్తలపై ధాడులు జరిగితే నేను వెళ్లి ఓదార్చా. గడిచిన ఐదేళ్లలో ధర్మవరంలో ప్రతిపక్షనేతగా, జనసేన తరుపున నేను పోరాటం చేసి కేసులు పెట్టించుకున్నా. ఎమ్మెల్యే భూకబ్జాలు, రౌడీయిజం వల్ల ధర్మవరం తీవ్రంగా నష్టపోయింది. చేనేత రంగాన్ని వైసీపీ నాయకులు నాశనం చేసేశారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి ధర్మవరం టికెట్ విషయంలో పునరాలోచించుకోవాలి. ఒక సీటూ వైసీపీకి ఇవ్వకూడదన్నదే నా బాధ. పవన్ కళ్యాణ్ ఇక్కడ జనసేనకు సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నిర్ణయానికి నేను కట్టుబడి పనిచేస్తా” అని చిలకం మధుసూదన్ రెడ్డి తేల్చి చెప్పారు.
Also Read : ఆ ముగ్గురు టీడీపీ సీనియర్ల సీట్లపై వీడని సస్పెన్స్.. కారణం ఏంటి?
