Tdp Seniors Tickets : ఆ ముగ్గురు టీడీపీ సీనియర్ల సీట్లపై వీడని సస్పెన్స్.. కారణం ఏంటి?

నిన్నా మొన్నటి వరకు రాష్ట్ర రాజకీయాల్లోనూ, వారి సొంత జిల్లాలోనూ మకుటం లేని మహారాజుల్లా రాజకీయాలు చేసిన ఆ ముగ్గురి పోటీపై ఎందుకింత సప్పెన్స్?

Tdp Seniors Tickets : ఆ ముగ్గురు టీడీపీ సీనియర్ల సీట్లపై వీడని సస్పెన్స్.. కారణం ఏంటి?

Tdp Seniors Tickets Issue

Tdp Seniors Tickets : టీడీపీ మూడో లిస్టులోనూ ముగ్గురు సీనియర్లకు లైన్ క్లియర్ కాలేదు. ఈ ముగ్గురిలో ఇద్దరి సీట్లపై తీవ్ర తర్జనభర్జన కొనసాగుతుండగా.. మరో సీనియర్ కు ఎక్కడా ఛాన్స్ దక్కే పరిస్థితి కనిపించడం లేదు. నిన్నా మొన్నటి వరకు రాష్ట్ర రాజకీయాల్లోనూ, వారి సొంత జిల్లాలోనూ మకుటం లేని మహారాజుల్లా రాజకీయాలు చేసిన ఆ ముగ్గురి పోటీపై ఎందుకింత సప్పెన్స్?

టీడీపీ మూడో లిస్టులోనూ ముగ్గురు నేతల సీట్లపై క్లారిటీ రాలేదు. అసలు టికెట్ వస్తుందో రాదో తెలియక ఆ ముగ్గురు నేతల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రులు కిమిడి కళావెంకట్రావు, దేవినేని ఉమ, ఉత్తరాంధ్రలోని కీలక నేత గంటా శ్రీనివాసరావు పోటీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో బలమైన నేతలు గంటా, కళా పోటీపై క్లారిటీ లేక వారిద్దరి పేర్లు ఒకే నియోజకవర్గానికి పరిశీలిస్తుండటంతో ఎవరికి బెర్తు ఇస్తారో, ఎవరికి ఎర్త్ పెడతారో తెలియడం లేదు.

కాగా, మాజీ మంత్రి దేవినేని ఉమాకు దాదాపుగా టికెట్ లేనట్లే అని తెలుస్తోంది. దేవినేని ఉమ ఆశించిన మైలవరం టికెట్ ను వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించారు చంద్రబాబు. ఇక పెనమలూరు టికెట్ బోడె ప్రసాద్ కు ఇవ్వడంతో ఉమాకు సీటు గల్లంతైంది. అటు.. ఎచ్చెర్ల సీటు కోసం కళా, భీమిలి సీటు కోసం గంటా పట్టుబడుతున్నారు. కాగా, చీపురుపల్లి అభ్యర్థి ఎవరో తేలే వరకు కళా, గంటా పోటీపై సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉందని సమాచారం.

టీడీపీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతలకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. దేవినేని ఉమాకు పూర్తిగా దారులు మూసుకుపోయాయని చెప్పొచ్చు. జిల్లాలో ఖాళీగా ఉన్న రెండు సీట్లను కూడా వేరే వ్యక్తులకు కేటాయించారు. తాను సుదీర్ఘ కాలం పాటు ప్రాతినిధ్యం వహించిన మైలవరం టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించారు. పెనమూలూరు టికెట్ ను బోడె ప్రసాద్ కు ఇచ్చారు. దీంతో దేవినేని ఉమాకు దారులు మూసుకుపోయాయని చెప్పొచ్చు. దీంతో భవిష్యత్ కార్యాచరణపై దేవినేని ఉమ తన అనుచరులతో చర్చిస్తున్నారు.

మరోవైపు ఉత్తరాంధ్రకు సంబంధించి కీలక నేత కళా వెంకట్రావు.. 1985 సమయంలోనే హోంమంత్రిగా పని చేశారు. ఎన్టీఆర్ కు సన్నిహితుడు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. టీడీపీ నుంచి రాజ్యసభకు కూడా వెళ్లారు. టీడీపీలో కీలక నేతగా గుర్తింపు పొందారు. తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన పెద్ద మనిషిగా పేరుంది. కానీ, మొదటి రెండు జాబితాల్లో ఆయనకు చోటు దక్కలేదు. మూడో జాబితాలో అయినా తనకు చోటు దక్కుతుందని కళా వెంకట్రావు ఆశించారు. కానీ, మూడో జాబితాలోనూ ఆయన పేరు రాలేదు. కళా వెంకట్రావుకి ఈసారి పోటీ చేసేందుకు అవకాశం ఇస్తారా? ఇవ్వరా? అనే ఉత్కంఠ ఉత్తరాంధ్రలో నెలకొంది.

ఇక, టికెట్ కోసం తీవ్రంగా వెయిట్ చేస్తున్న మరో సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు. విశాఖ నార్త్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. గత నాలుగు ఏళ్లుగా ఆయన నియోజకవర్గాన్ని, పార్టీని పెద్దగా పట్టించుకున్నది లేదన్నది పార్టీ వర్గాల మాట. ఈ క్రమంలో పార్టీ కూడా గంటాను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, చివరి నిమిషంలో చీపురుపల్లి టికెట్ ను గంటాకు ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ ఆలోచన చేసింది. అయితే, చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు అయిష్టంగా ఉన్నారు గంటా. ఆయన భీమిలి టికెట్ ఆశిస్తున్నారు.

గంటా, కళా.. వీరిద్దరికి ఏ విధంగా న్యాయం చేయాలి అని ఆలోచన చేస్తోంది పార్టీ. కాగా.. భీమిలి స్థానం ఖాళీగా ఉండటంతో కళాను తీసుకొచ్చి అక్కడి నుంచి పోటీ చేయించాలని పార్టీ యోచిస్తోంది. గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో ఉంది. అదే సమయంలో వీరిద్దరిలో ఎవరో ఒకరికి భీమిలి, మరొకరికి చీపురుపల్లి దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

దేవినేని ఉమా.. సుదీర్ఘకాలం పాటు జిల్లా రాజకీయాలను శాసించారు. 1999 లో తొలిసారి నందిగామ నుంచి గెలిచారు. తన అన్న దేవినేని రమణ ఆకస్మిక మరణంతో దేవినేని ఉమ.. రాజకీయాల్లోకి వచ్చారు. నందిగామ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ఆయన ప్రారంభించారు. అక్కడ రెండుసార్లు గెలిచారు. ఆ తర్వాత డీలిమిటేషన్ లో భాగంగా నందిగామ ఎస్వీ రిజర్వ్డ్ కావడంతో ఆయన మైలవరానికి షిఫ్ట్ అయ్యారు. అక్కడి నుంచి రెండుసార్లు గెలిచారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ ఓటమి చెందినప్పటి నుంచి కూడా దేవినేని ఉమాకు రాజకీయంగా కలిసి రావడం లేదని చెప్పుకోవాలి. జిల్లా రాజకీయాలను శాసించిన కీలకమైన నేతకు టికెట్ రాకపోవడం అనేది చర్చనీయాంశంగా మారింది.

గత ఐదేళ్లుగా ఎవరి మీద అయితే దేవినేని ఉమ పోరాటం చేశారో, ఆ వ్యక్తి టీడీపీలోకి వచ్చి సీటు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి (వసంత కృష్ణ ప్రసాద్) గెలుపు కోసం దేవినేని ఉమ పని చేయాల్సి ఉంటుంది. దీన్ని దేవినేని ఉమ కొంత జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి ఉంది. దేవినేని ఉమ పార్టీకి, పార్టీ అధినేతకు చాలా లాయల్ గా ఉంటారని.. పార్టీ అధినేత ఏం చెబితే అది పాటిస్తారని గుర్తింపు ఉంది. దేవినేని ఉమ పార్టీకి చాలా విశ్వసనీయ నేతగా పార్టీ కూడా భావిస్తుంది.

మొత్తంగా ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేతలు కళా, గంటాలకు టికెట్ ఆశలు సజీవంగా ఉండగా.. దేవినేని ఉమాకు మాత్రం దారులన్నీ మూసుకుపోయాయని చెప్పొచ్చు.

Also Read : టీడీపీ థర్డ్ లిస్ట్‌లో ట్విస్ట్.. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధికి బాపట్ల టీడీపీ టికెట్