Kolla Lalitha Kumari Vs Kadubandi SrinivasRao : రెండు పార్టీల్లోనూ డేంజర్ బెల్స్..! హాట్‌హాట్‌గా శృంగవరపు కోట పాలిటిక్స్

సంప్రదాయ ఓటు బ్యాంకు ఉందని టీడీపీ.. గత ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలే అండగా వైసీపీ ప్రచారంలో దూకుడు చూపుతున్నాయి. మరోవైపు ఇద్దరు అభ్యర్థులకు రెబెల్స్‌ రెడ్‌ సిగ్నల్స్‌ చూపిస్తుండటమే హీట్‌ పుట్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎస్‌.కోటలో గెలుపు అవకాశాలను అంచనా వేయడం సంక్లిష్టంగా మారుతోంది.

Kolla Lalitha Kumari Vs Kadubandi SrinivasRao

Kolla Lalitha Kumari Vs Kadubandi SrinivasRao : ఆ నియోజకవర్గం పాలిటిక్స్‌ మహా హాట్‌గా మారుతున్నాయి. ఎన్నికలకు రోజులు సమీపిస్తున్న కొద్దీ మరింత హీట్‌ పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థులను ఇరుపార్టీలూ ఖరారు చేయగా, ఆ ఇద్దరికి కూడా తిరుగుబాట్లు తలనొప్పిగా మారాయి. అధిష్టానం అనుగ్రహించినా.. కార్యకర్తలు కలిసి రాకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక దిక్కులు చూస్తున్నారు అభ్యర్థులు. ఇరు పార్టీల్లోనూ ఒకే రకమైన పరిస్థితులు ఉండటంతో రాజకీయం భలే రంజుగా మారింది.

మంత్రి బొత్సకు చికాకు..
విశాఖ పార్లమెంటు పరిధిలోని కీలక నియోజకవర్గం ఎస్‌.కోట. అరకు ఏజెన్సీకి ముఖద్వారమైన ఎస్‌.కోట రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. ఒకవైపు ఏజెన్సీ.. మరోవైపు కొత్తవలస పారిశ్రామిక ప్రాంతం.. ఇంకోవైపు పచ్చటి పొలాలతో ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది ఎస్‌.కోట నియోజకవర్గం.. కానీ, ఇక్కడ రాజకీయమే మండుతున్న అగ్ని గుండాన్ని తలపిస్తుంటుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండింటిలోనూ గ్రూప్‌ వార్‌ పతాకస్థాయిలో ఉండటంతో ఎమ్మెల్యే అభ్యర్థులు తలల బాదుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో మంత్రి బొత్సకు ఎస్‌.కోట పొలిటికల్‌ గేమ్‌ చికాకు పెడుతోందంటున్నారు. మంత్రి సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మి విశాఖ ఎంపీగా పోటీ చేస్తుండటం వల్ల… ఎస్‌.కోట నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు మంత్రి.

ఎస్‌.కోట నియోజకవర్గం టీడీపీకి కంచుకోట..
ఎస్‌.కోట నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత కేవలం రెండు సార్లు మాత్రమే ఆ పార్టీ ఈ నియోజకవర్గంలో ఓడిపోయింది. మిగిలిన అన్నిసార్లు పసుపు జెండా రెపరెపలాడేది. 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఉత్తరావిల్లి, ఎస్‌.కోట కలిపి ఒకే నియోజకవర్గంగా ఏర్పాటైంది. దీంతో ఉత్తరావిల్లి నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యం చలాయించిన కోళ్ల ఫ్యామిలీ ఎస్‌.కోటపై ఫోకస్‌ పెట్టింది. 1983 నుంచి 2004 వరకు ఉత్తరావిల్లి నియోజకవర్గంలో అపజయమే లేకుండా వంద శాతం సక్సెస్‌ రేట్‌తో దూకుడుచూపించిన కోళ్ల ఫ్యామిలీకి గత ఎన్నికల్లో కళ్లెం వేసింది వైసీపీ. ఈ నియోజకవర్గంపై మంత్రి బొత్స, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ మజ్జి శ్రీనివాసరావు ప్రత్యేకంగా ఫోకస్‌ చేయడంతో గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికి ఓటమి రుచిచూపించారు.

కోళ్ల లలితకు ఇంటిపోరు..
మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఎస్‌.కోట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, ఆమె తాత మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. కోళ్ల అప్పలనాయుడు రాజకీయ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన లలితకుమారి కూడా నియోజకవర్గంలో తనకు తిరుగులేని విధంగా రాజకీయం చేశారు. ఐతే అనూహ్యంగా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమెకు ఇంటిపోరు ఎక్కువైంది. కోళ్ల కుటుంబం ఆధిపత్యాన్ని తట్టుకోలేని కొందరు నేతలు.. ఎన్‌ఆర్‌ఐ గొంప కృష్ణను రాజకీయంగా ప్రోత్సహించడంతో టీడీపీలో ప్రత్యేక గ్రూపు తయారైంది. మొదట్లో ఈ గ్రూప్‌ను లైట్‌గా తీసుకున్న లలితకుమారి.. చివరికి తన సీటుకే ఎర్త్‌ వర్చే పరిస్థితి తెచ్చుకున్నారు. చివరికి ఎలాగోలా టికెట్‌ దక్కించుకున్నా.. ఇప్పుడు రెండో గ్రూప్‌ నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొంటున్నారు.

ఎస్‌.కోట టీడీపీని షేక్‌ చేస్తున్న గొంప కృష్ణ..
తనకే సీటివ్వాలని లేదంటే.. ఇండిపెండింట్‌గా పోటీ చేస్తానని హెచ్చరిస్తున్న గొంప కృష్ణ.. ఎస్‌.కోట టీడీపీని షేక్‌ చేస్తున్నారు. ఐతే ఈ వ్యవహారంపై ఆచితూచి వ్యవహరిస్తున్న లలితకుమారి.. పోలింగ్‌ నాటికి అంతా సర్దుకుంటుందనే భావనతో ప్రత్యర్థివర్గాన్ని శాంతింపజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో గాని… ప్రస్తుతం టీడీపీలో అంతర్గత రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

ఈసారి కూడా వైసీపీ అదే వ్యూహం..
నియోజకవర్గంలో తనదైన ముద్రవేసిన టీడీపీ.. ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటలతో టెన్షన్‌ పడుతుండగా, అధికార వైసీపీని అదే రకమైన సమస్య వెంటాడుతోంది. దీంతో ఎస్.కోటలో రెండు పార్టీల పరిస్థితి సేమ్‌ టూ సేమ్‌గా తయారైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకే మరోసారి టికెట్‌ ఇచ్చింది అధికార పార్టీ. గజపతినగరం నియోజకవర్గానికి చెందిన కడుబండిని గత ఎన్నికల సమయంలో అనూహ్యంగా ఎస్‌.కోటలో పోటీకి పెట్టింది వైసీపీ. ఈ నియోజకవర్గంలోని ప్రత్యేక పరిస్థితుల వల్ల.. గజపతినగరం నుంచి కడుబండిని తీసుకువచ్చి సోషల్‌ ఇంజినీరింగ్‌తో ఎస్‌.కోటలో విక్టరీ కొట్టింది వైసీపీ.. ఇప్పుడు కూడా అదే వ్యూహం అనుసరిస్తోంది.

వైసీపీని టెన్షన్‌ పెడుతున్న ఎమ్మెల్సీ వైఖరి..
ఐతే గత ఎన్నికల్లోనే కడుబండి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన ఎస్‌.కోట స్థానిక నాయకులు.. అప్పటి నుంచి ఆయనతో విభేదిస్తూనే ఉన్నారు. ఐదేళ్లుగా పార్టీలో అంతర్గత పోరును తట్టుకుంటూనే తనపని తాను చేసుకునిపోయిన ఎమ్మెల్యే… వచ్చే ఎన్నికల్లోనూ విజయంపై ధీమాగానే కనిపిస్తున్నారు. ఐతే, నియోజకవర్గంలో బలమైన నేత, ఎమ్మెల్సీ రఘురాజు వైఖరే వైసీపీని టెన్షన్‌ పెడుతోంది. ఎమ్మెల్యేతో విభేదిస్తున్న ఎమ్మెల్సీ రఘురాజు.. ఇటీవల తన సతీమణి, ఎస్‌.కోట వైఎస్‌ ఎంపీపీ సుధారాణితోపాటు తన ముఖ్య అనుచరులను టీడీపీలోకి పంపారు. కానీ, ఆయన మాత్రం ఇంకా వైసీపీలోనే కొనసాగుతున్నారు. దీంతో రఘురాజు వైఖరి అర్థం కాక…. వచ్చే ఎన్నికల్లో ఆయన సహకారంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు.

వైసీపీ విజయవకాశాలపై ప్రభావం..!
మంత్రి బొత్స కూడా రఘురాజు వైఖరిపై ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. విశాఖ ఎంపీగా మంత్రి సతీమణి ఝాన్సీలక్ష్మి పోటీ చేస్తుండటం వల్ల, ఎస్‌.కోట గ్రూప్‌ పాలిటిక్స్‌.. ఎంపీ ఎన్నికపైనా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో మంత్రి సీరియస్‌గా ఉన్నారంటున్నారు. మరోవైపు నియోజకవర్గంపై పట్టు ఉన్న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు కూడా కొంతకాలంగా ఎస్‌.కోట పాలిటిక్స్‌కు దూరంగా ఉండటం వైసీపీ విజయవకాశాలపై ప్రభావం చూపుతుందనే టాక్‌ వినిపిస్తోంది.

మొత్తానికి రెండు పార్టీల్లోనూ అంతర్గత కుమ్ములాటలు.. ఎమ్మెల్యే అభ్యర్థులకు నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సంప్రదాయ ఓటు బ్యాంకు ఉందని టీడీపీ.. గత ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలే అండగా వైసీపీ ప్రచారంలో దూకుడు చూపుతున్నాయి. మరోవైపు ఇద్దరు అభ్యర్థులకు రెబెల్స్‌ రెడ్‌ సిగ్నల్స్‌ చూపిస్తుండటమే హీట్‌ పుట్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎస్‌.కోటలో గెలుపు అవకాశాలను అంచనా వేయడం సంక్లిష్టంగా మారుతోంది.

Also Read : ఎమ్మెల్యే వెలగపూడి విజయ పరంపరకు బ్రేక్ పడుతుందా? విశాఖ తూర్పులో రసవత్తర పోరు