Nellore Rural Politics : ఒకవైపు అదృష్టవంతుడు, మరోవైపు పోరాట యోధుడు.. నెల్లూరు రూరల్‌లో గెలుపెవరిది?

ఇద్దరు సమ ఉజ్జీలు మధ్య పోరుతో రూరల్‌ ఫలితంపై ఉత్కంఠ పెరుగుతోంది. వరుసగా గెలుస్తున్న కోటంరెడ్డి ఓవైపు.. అదృష్టవంతుడైన ఆదాల ప్రభాకర్ రెడ్డి మరోవైపు తలపడుతుండటం..

Nellore Rural Politics : నెల్లూరు పెద్దారెడ్లు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం ఒకటి. రాష్ట్రంలోనే హాట్‌ సీటు ఇది. అధికార వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. గత రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీధర్‌రెడ్డి ఈసారి పార్టీ మారి హ్యాట్రిక్‌ కొడతానంటున్నారు. కోటంరెడ్డి దూకుడికి బ్రేకులు వేసే వ్యూహంతో బడా లీడర్‌నే బరిలోకి దింపింది వైసీపీ. ఇంతవరకు ఓటమే తెలియని సీనియర్‌ నేత ఆదాలను అస్త్రంగా చేసుకుంది అధికార పార్టీ. మరి ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్న ఈ పెద్దారెడ్లలో విజయం వరించేది ఎరినో? కోటంరెడ్డి జోరు ఎలా ఉంది? ఆదాల పొలిటికల్‌ ట్రిక్స్ వర్కౌట్‌ అవుతాయా? నెల్లూరు రేసుగుర్రమెవరు?

ఫలితంపై ఉత్కంఠ..
సంచలన రాజకీయాలకు కేరాఫ్ నెల్లూరు రూరల్ నియోజకవర్గం. ఈసారి ఎన్నికల్లో వైసిపి, కూటమి అభ్యర్థుల మధ్య హోరాహోరీ కనిపిస్తోంది. ఇద్దరు బలమైన అభ్యర్థులే తలపడుతుండటంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తులకు పైఎత్తులతో ఇద్దరు నేతలు దూకుడు చూపుతుండటంతో ఫలితంపై ఉత్కంఠ పెరిగిపోతోంది.

2009 నుంచి ఒక్కసారి కూడా గెలవని టీడీపీ..
2009లో ఏర్పడిన నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ఇప్పటివరకు టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. కానీ, ఈసారి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రూపంలో బలమైన నేత చేరడంతో రూరల్‌ నియోజకవర్గంలో గట్టిపోటీ ఇస్తోంది టీడీపీ. వాస్తవానికి నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో 10కి 10 స్థానాలు గెలుచుకుంది వైసీపీ. కానీ, ఈ ఎన్నికల ముందు అనూహ్య రాజకీయ పరిణామాలతో వైసీపీ పెను సంక్షోభాన్నే ఎదుర్కొంది. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ పార్టీ మారడంతో నెల్లూరుపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది వైసీపీ అధిష్టానం. ముఖ్యంగా నెల్లూరులో పార్టీ బలహీనమవడానికి ప్రధాన కారణమైన రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని టార్గెట్‌ చేసింది అధికార పార్టీ.

కోటంరెడ్డి ఓటమే లక్ష్యంగా వైసీపీ పావులు..
ఎట్టి పరిస్థితుల్లోనూ కోటంరెడ్డిని మళ్లీ గెలవనీయకూడదనే లక్ష్యంతో సిట్టింగ్‌ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని రూరల్‌ సమన్వయకర్తగా నియమించింది. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి స్థానంలో రూరల్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన ఆదాల చకచకా పావులు కదిపారు. కేడర్‌ ఎవరూ పార్టీ మారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తొలుత కోటంరెడ్డి వెంట నడిచిన నేతలను కూడా వెనక్కు తెచ్చి… శ్రీధర్‌రెడ్డి స్పీడ్‌కు బ్రేకులు వేశారు. దీంతో ప్రస్తుతం సమ ఉజ్జీల సమరానికి వేదికగా మారింది రూరల్‌ నియోజకవర్గం.

అలా.. జగన్ కు టార్గెట్ అయ్యారు..
టార్గెట్‌ కోటంరెడ్డి.. అన్నట్లు వైసీపీ పావులు కదుపుతుండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. వైసీపీ అధినేత జగన్ శాశ్వత సీఎంగాను.. తాను ఎప్పటికీ ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకున్న కోటంరెడ్డి.. గతేడాది ఫోన్‌ టాపింగ్‌ వ్యవహారంతో ఆ పార్టీ నుంచి బయటకు రావడం.. అప్పటి నుంచి కంట్లో నలుసులా మారడంతో సీఎం జగన్‌తోపాటు, జిల్లాలోని వైసీపీ నేతలు అందరికీ ప్రధాన టార్గెట్‌ అయ్యారు కోటంరెడ్డి.. కానీ, ఎవరు ఎన్ని వ్యూహాలు వేసినా, కోటంరెడ్డి స్పీడు మాత్రం తగ్గడం లేదు. నిత్యం ఏదో రూపంలో ప్రజల్లోనే తిరుగుతున్నారు కోటంరెడ్డి. మాస్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, ప్రతి చిన్న సమస్యపైనా స్పందిస్తూ ప్రజల్లో ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు. అధికారమైనా, ప్రతిపక్షమైనా తాను ప్రజాపక్షమేనంటూ ప్రచారం చేసుకుంటున్న కోటంరెడ్డి.. తనతోపాటు కుటుంబ సభ్యులను ప్రచారానికి పంపుతుండటంతో ప్రజల్లో సానుభూతి కనిపిస్తోంది.

గెలుపుపై కోటంరెడ్డి ధీమా..
ఇప్పటికే రెండు మూడు సార్లు నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసిన కోటంరెడ్డి… ఇతర పార్టీ నేతలను టీడీపీలో చేర్చకుంటూ రూరల్‌ నియోజకవర్గంలో బలమైన పునాదులు వేస్తున్నారు. ఒకవైపు కోటంరెడ్డి, మరోవైపు ఆయన సోదరుడు గిరిధర్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులంతా తిరుగుతూ… వచ్చే ఎన్నికల్లో విజయం పతాకం ఎగరేస్తామనే ధీమా ప్రదర్శిస్తున్నారు. నియోజకవర్గ సమస్యలపై తనకు అవగాహన ఉందని, గెలిచిన వెంటనే శాశ్వత సమస్యలను పరిష్కరిస్తానని హామీనిస్తున్నారు కోటంరెడ్డి.

శ్రీధర్‌రెడ్డిపై ఆదాల పైచేయి..
గత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి… ఈసారి టీడీపీ తరఫున పోటీ చేస్తుండటంతో గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సీనియర్‌ నేత ఆదాల ప్రభాకర్‌రెడ్డి రూపంలో బలమైన ప్రత్యర్థిని నిలిపిన వైసీపీ.. కోటంరెడ్డిని అష్టదిగ్బంధం చేస్తోంది. గతంలో కోటంరెడ్డి అనుచరులుగా ఉన్నవారిని కట్టడి చేయడమే కాకుండా జిల్లాలో మాస్‌ ఫాలోయింగ్ ఉన్న న్యాయవాది మలిరెడ్డి కోటారెడ్డిని వైసీపీలోకి తీసుకువచ్చి.. శ్రీధర్‌రెడ్డిపై పైచేయి సాధించారు వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి. ఇదే సమయంలో రూరల్ నియోజకవర్గంలో మంచి పట్టున్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి కూడా ఆదాలకు మద్దతుగా పని చేస్తుండటం అడ్వాంటేజ్‌గా చెబుతున్నారు. అంతేకాకుండా ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన నుంచి నియోజకవర్గంలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయించి.. సానుకూల దృక్పథాన్ని ఏర్పరుచుకుంటున్నారు. కార్పొరేషన్‌లో డివిజన్ల వారీగా సభలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాను గెలిస్తే దౌర్జన్యాలు, భూకబ్జాలను అడ్డుకుంటానని హామీనిస్తున్నారు ఆదాల.

మొత్తానికి ఇద్దరు సమ ఉజ్జీలు మధ్య పోరుతో రూరల్‌ ఫలితంపై ఉత్కంఠ పెరుగుతోంది. వరుసగా గెలుస్తున్న కోటంరెడ్డి ఓవైపు…. అదృష్టవంతుడైన ఆదాల ప్రభాకర్ రెడ్డి మరోవైపు తలపడుతుండటం… ఇంతవరకు పోటీచేసిన ప్రతిచోటా నెగ్గుతూ వస్తున్న ఆదాల… సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు గట్టిసవాలే విసురుతున్నారు. ఇదే సమయంలో కోటంరెడ్డిని ఓడించడం కూడా అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు అదృష్టవంతుడు, మరోవైపు పోరాట యోధుడు తలపడుతున్న ఈ సమరంలో అంతిమ ఫలితం ఎలా ఉంటుందనేది అందరిలోనూ ఉత్కంఠ పెంచేస్తోంది.

Also Read : ఆ 12మంది ఎవరు? ప్రకటన ఎప్పుడు? టీడీపీలో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ

 

ట్రెండింగ్ వార్తలు