Giddi Eswari : అదృష్టమంటే ఈమెదే..! పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి లక్కీచాన్స్‌..!

Giddi Eswari : అదృష్టం అంటే మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిదే… పాడేరు టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న ఈశ్వరికి ఈసారి పోటీ నుంచి దాదాపు తప్పుకున్నట్లు అనుకున్నారంతా…. పొత్తుల్లో పాడేరును బీజేపీకి కేటాయిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో… మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి కూడా ఆశలు వదులుకున్నారు. కానీ, అనూహ్యంగా బీజేపీ పాడేరు బదులుగా అరకు తీసుకోవడంతో గిడ్డి ఈశ్వరికి లైన్‌క్లియర్‌ అయింది.

చివరి క్షణంలో తప్పుకుంటున్న అరకు అభ్యర్థులు..
విశాఖ మన్యం రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అరకు అసెంబ్లీ స్థానానికి తామే అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకున్న నేతలు… అనూహ్యంగా చివరి క్షణంలో తప్పుకోవాల్సిరావడం హాట్‌టాపిక్‌గా మారింది. అరకు నియోజకవర్గాన్ని బీజేపీ తీసుకోవడంతో టీడీపీ అభ్యర్థిగా ఎంపికైన దొన్నుదొర షాక్‌ తిన్నారు. అరకు బహిరంగ సభలోనే దొన్నుదొర పేరును ప్రకటించిన చంద్రబాబు… ఇప్పుడు ఆయనను ఎలా సర్దుబాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదేవిధంగా వైసీపీ కూడా ముందుగా ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు ఇన్‌చార్జిగా ప్రకటించి ఆ తర్వాత మార్చేసింది. ఇలా రెండు పార్టీలూ ముందుగా ప్రకటించిన అభ్యర్థులను తప్పించడం ఏజెన్సీలో విస్తృత చర్చకు దారితీస్తోంది. ఇదే సమయంలో పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి లక్కీచాన్స్‌ కొట్టేసినట్లు చెబుతున్నారు.

ఫలించిన గిడ్డి ఈశ్వరి పూజలు..!
బీజేపీ అరకు తీసుకోవడంతో గిడ్డి ఈశ్వరికి అనుకోని చాన్స్‌ వచ్చినట్లైంది. 2014లో పాడేరు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈశ్వరి… టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో ఓడినా, ఐదేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పనిచేశారు. కానీ, పొత్తుల్లో భాగంగా పాడేరును బీజేపీకి ఇచ్చే ప్రతిపాదన రావడంతో గిడ్డి ఈశ్వరి ఆందోళనలు చేశారు. అదే సమయంలో ఏజెన్సీవాసుల ఇలవేల్పుగా భావింఏ మోదకొండలమ్మకు ప్రత్యేక పూజలు చేసి పాడేరు సీటు తనదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. చివరికి ఆమె పూజలు ఫలించినట్లే ఇప్పుడు పాడేరు సీటును బీజేపీయే స్వయంగా వదిలేసింది. దీంతో గిడ్డి ఈశ్వరికి లైన్‌క్లియర్‌ అయినట్లే చెబుతున్నారు.

దొన్నుదొర రూపంలో గిడ్డి ఈశ్వరికి మరో అడ్డు!
తన పోటీకి ఏకైక అడ్డంకి తొలగిపోవడంతో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఖుషీగా కనిపిస్తున్నారు. ఎన్నో పోరాటాలతో ఏజెన్సీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆమె… చివరికి సీటు కోసం దేవుడిని మొక్కుకోవాల్సి వచ్చింది. దేవుడి అనుగ్రహమో… అదృష్టమో కానీ, అనూహ్యంగా పాడేరు టీడీపీ కోటాలో చేరింది. ఇక ఆమె పేరు ప్రకటనే మిగిలివుంది. ఐతే అరకు సీటు కోల్పోయిన దొన్నుదొర రూపంలో గిడ్డి ఈశ్వరికి మరో అడ్డు పడే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఒకటుంది. ఐతే స్థానికురాలైన ఈశ్వరిని కాదని, దొన్నుదొరకు పాడేరు టికెట్‌ ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. మొత్తానికి టీడీపీలో లక్కీలీడర్‌ ఎవరైనా ఉన్నారంటే అది గిడ్డి ఈశ్వరి ఒక్కరే అని చెబుతున్నారు.

Also Read : ఒకవైపు అదృష్టవంతుడు, మరోవైపు పోరాట యోధుడు.. నెల్లూరు రూరల్‌లో గెలుపెవరిది?

 

ట్రెండింగ్ వార్తలు