Proddatur Assembly Race Gurralu : 25ఏళ్ల అనుభవం వర్సెస్ 10ఏళ్ల రాజకీయ చాణక్యం.. గురుశిష్యుల సమరంలో విజేత ఎవరు?

ముఖ్యంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తూ కొందరు కౌన్సిలర్లు పార్టీని వీడటం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందనే లెక్కలు వేసుకుంటోంది వైసీపీ.

Proddatur Assembly Race Gurralu : వారిద్దరూ గురు శిష్యులు.. ఒకరు పాతికేళ్లు ఎమ్మెల్యేగా పనిచేస్తే.. మరొకరు గత పదేళ్లుగా ఎదురులేని నేతగా వెలుగొందుతున్నారు. అర్ధ, అంగబలాల్లో ఒకరికొకరు తీసిపోని ఆ ఇద్దరు ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటున్నారు. మరి ఈ హోరాహోరీలో గెలిచేది ఎవరు? గురువు అనుభవం నెగ్గుతుందా? శిష్యుడి రాజకీయ చాణక్యం ఫలితమిస్తుందా? ఇప్పటికే ఓ సారి తన రాజకీయ గురువును ఓడించిన సదరు ఎమ్మెల్యే… మళ్లీ పైచేయి సాధించే వీలుందా? కడప జిల్లాలో హైవోల్టేజ్‌ పాలిటిక్స్‌కు నిలయమైన ప్రొద్దుటూరులో పోటీ ఎలా ఉంది?

80ఏళ్ల వరదరాజులురెడ్డి ఎలా ఎదుర్కొంటారో?
ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లా.. అధికార వైసీపీ అడ్డా కడప జిల్లాలో రాజకీయం మంచి కాకమీద కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో జిల్లాలో వైసీపీదే ఆధిపత్యం. ఐతే ఈసారి వైసీపీ స్పీడ్‌కు బ్రేకులు వేయాలనుకుంటోంది టీడీపీ. ముఖ్యంగా పసుపుదళానికి గట్టి పట్టున్న ప్రొద్దుటూరుపై భారీ ఆశలు పెట్టుకుంటోంది. గత రెండుసార్లు తిరుగులేని విజయం సాధించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి చెక్‌ చెప్పేలా.. ఆయన రాజకీయ గురువు నంద్యాల వరదరాజులరెడ్డిని బరిలోకి దింపింది టీడీపీ. వరుస విజయాలతో జోరుమీదున్న ఎమ్మెల్యే రాచమల్లును 80 ఏళ్ల వరదరాజులురెడ్డి ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదల..
ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి. గత ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశానని చెబుతున్న ఎమ్మెల్యేకు పార్టీలో అంతర్గత సమస్యలే సవాల్‌ విసురుతున్నాయి. పార్టీలో చాలా మంది ద్వితీయశ్రేణి నేతలతో ఎమ్మెల్యేకు భేదాభిప్రాయాలు ఉండటం వల్ల పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. కానీ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయనన్ని కార్యక్రమాలు చేశానని చెబుతున్న ఎమ్మెల్యే మరోసారి వైసీపీ జెండా ఎగరేస్తాననే ధీమాగా ఉన్నారు.

గ్రూపుల బెడదతో నష్టమెవరికో?
వచ్చే ఎన్నికల్లో తన విజయంపై ఎమ్మెల్యే ధీమాగా ఉన్నా.. అసమ్మతి, గ్రూపు రాజకీయం ఎలాంటి ప్రభావం చూపుతాయోననే టెన్షన్‌ వైసీపీలో కనిపిస్తోంది. ఇదేసమయంలో ప్రతిపక్ష టీడీపీలో కూడా మూడు వర్గాలు.. ఆరు గ్రూపులు ఉండటంతో ప్రొద్దుటూరులో విజయం నల్లేరుపై నడకేనని భావిస్తోంది వైసీపీ. వాస్తవానికి టీడీపీ అభ్యర్థిగా వరదరాజులురెడ్డిని ప్రకటించడంతోనే నేతలకు షాక్‌ ఇచ్చింది టీడీపీ అధిష్టానం.

ఉక్కు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చంద్రబాబు ఊహించని షాక్..
ఎమ్మెల్యే రాచమల్లు స్పీడ్‌కు బ్రేక్‌లు వేయాలంటే సీనియర్‌ నేత వరదరాజులురెడ్డి వంటి అనుభవశీలి ఉండాలని భావించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఐతే 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు వరదరాజులురెడ్డి. గత ఐదేళ్లుగా నియోజకవర్గ కార్యక్రమాలను ముందుండి నడిపించారు డాక్టర్‌ ఉక్కు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి. ఎమ్మెల్యేకు దీటుగా వ్యవహరించి పార్టీలో నూతన జవసత్వాలు నింపారు. ఈఎన్నికల్లో ఆయనకే టికెట్‌ అన్న ప్రచారం జరిగింది. యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేశ్‌ సైతం ప్రవీణ్‌కే టికెట్‌ అన్న సంకేతాలు పంపారు. కానీ, ఏమైందో ఏమో కానీ, అధినేత చంద్రబాబు… ఎవరూ ఊహించని విధంగా వరదరాజులురెడ్డికి టికెట్‌ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సమకాలీనుడు..
ఉమ్మడి కడప జిల్లాలో మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డికి సమకాలీనుడిగా చెప్పే నంద్యాల వరదరాజులురెడ్డి తొలిసారిగా 1985లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలుత టీడీపీ నుంచి శాసనసభలో అడుగుపెట్టిన వరదరాజులురెడ్డి 1989 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ గూటికి చేరారు. రాష్ట్ర విభజన జరిగేంతవరకు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 1985 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వరదరాజులురెడ్డి 2009 ఎన్నికల్లో తొలిసారి ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మల్లెల లింగారెడ్డి గెలిచారు.

అందరి అంచనాలు తలకిందులు చేస్తూ టికెట్ దక్కించుకున్నారు..
ఇక 2014లో టీడీపీ తరఫున పోటీ చేసిన వరదరాజులురెడ్డి.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాచమల్లు చేతిలో రెండోసారి ఓడిపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ ఇవ్వకపోవడంతో కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. కానీ, ఈ మధ్యే పార్టీలో తిరిగి యాక్టివ్‌ అయ్యారు వరదరాజులురెడ్డి. ఆయన వయసు రీత్యా ఈసారి పోటీ చేసేది లేదనే ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీడీపీ టికెట్‌ దక్కించుకుని తన రాజకీయ చాణక్యం ఎలా ఉంటుందో చూపించారు వరదరాజులురెడ్డి. ఈ సారి ప్రొద్దుటూరులో కచ్చితంగా గెలుస్తానని ధీమా ప్రదర్శిస్తున్నారు వరదరాజులురెడ్డి.

పట్టణ ఓటర్ల తీర్పే కీలకం..
సుమారు రెండు లక్షల ఓటర్లు ఉన్న ప్రొద్దుటూరులో మున్సిపాలిటీలోనే లక్షా 60 వేల ఓట్లు ఉన్నాయి. పట్టణ ఓటర్ల తీర్పే ఎన్నికల్లో కీలకంగా చెబుతున్నారు. గత రెండు ఎన్నికల్లో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన ఓటర్లు.. ఈ సారి ఎవరికి జైకొడతారనేది ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాచమల్లును వ్యతిరేకిస్తూ కొందరు కౌన్సిలర్లు పార్టీని వీడటం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందనే లెక్కలు వేసుకుంటోంది వైసీపీ.

సానుభూతి వర్సెస్ సంక్షేమం..
ఇదే సమయంలో టీడీపీలో పరిస్థితులు కూడా సానుకూలంగా లేకపోవడంతో ఇద్దరు అభ్యర్థులు సొంత పార్టీలోనే ఎదురీదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ఇదే చివరి చాన్స్‌ అనే ప్రచారం చేస్తూ సానుభూతి ఓట్లు పొందేలా స్కెచ్‌ వేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే రాచమల్లు అభివృద్ధి, సంక్షేమాన్నే నమ్ముకున్నారు. ఈ పరిస్థితుల్లో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారన్నదే వేచిచూడాలి.

Also Read : ఆయన సూపర్ క్లాస్‌, ఈయన ఊర మాస్‌.. ఎన్నికల సమరంలో ఈసారి గెలుపెవరిది?

 

ట్రెండింగ్ వార్తలు