Tdp Pending Seats : ఆ 12మంది ఎవరు? ప్రకటన ఎప్పుడు? టీడీపీలో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ

మొత్తానికి టీడీపీ పెండింగ్‌లో పెట్టిన 8 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్‌ స్థానాలపై రోజురోజుకు ఉత్కంఠగా పెరిగిపోతోంది. ఏదిఏమైనా ఏప్రిల్‌లోనే ఈ 12 స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాల సమాచారం.

Tdp Pending Seats : భాగస్వామ్య పక్షాల టికెట్ల ప్రకటనతో టీడీపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చేసింది. పొత్తుల్లో భాగంగా జనసేన, బీజేపీకి కేటాయించిన ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు ఆ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. జనసేన ఇంకో మూడు స్థానాలను పెండింగ్‌లో పెట్టగా, టీడీపీ కోటాలో 8 స్థానాలు మిగిలాయి. ఈ నియోజకవర్గాలకు వచ్చే నెలలోనే అభ్యర్థులను ప్రకటించే పరిస్థితి కనిపిస్తోంది.

అభ్యర్థుల ఎంపిక ఎప్పుడు?
టీడీపీ కూటమిలో సీట్లపై క్లారిటీ వచ్చేసింది. బీజేపీ అభ్యర్థుల ప్రకటనతో ఇప్పటివరకు ఉన్న సస్పెన్స్‌ తొలగిపోయింది. టీడీపీ పోటీ చేయనున్న 144 స్థానాలకు మూడు విడతలుగా 139 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఐతే టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన పి.గన్నవరం, అరకు, అనపర్తి స్థానాలను జనసేన, బీజేపీ తీసుకున్నాయి. దీంతో వీటికి బదులుగా మరో మూడు కొత్త స్థానాలు టీడీపీ ఖాతాలో చేరాయి. అంటే పెండింగ్‌లో ఉన్న ఐదు స్థానాలతోపాటు కొత్తగా మరో మూడింటికి కలిపి మొత్తం ఎనిమిది స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి వుంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రజాగళం యాత్రలో బిజీగా ఉండటంతో ఈ 8 స్థానాలకు అభ్యర్థులను ఎప్పుడు ఎంపిక చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. ఇదే సమయంలో టీడీపీ కోటాలో మిగిలిన 4 పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లోనే పెట్టడంతో క్యాడర్‌లో ఆందోళన పెరుగుతోంది.

పెండింగ్ లో 8 స్థానాలు..
టీడీపీ పోటీ చేసే స్థానాల్లో ఐదు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో చీపురుపల్లి, భీమిలి, గుంతకల్లు, రాజంపేట, దర్శి స్థానాలపై కొంతకాలంగా టీడీపీ తర్జనభర్జన పడుతోంది. ఇవి కాకుండా అనంతపురం అర్బన్‌పై జనసేన-టీడీపీ మధ్య కొన్నాళ్లు ఊగిసలాట కొనసాగింది. తిరుపతి, అనంతపురం అర్బన్‌ స్థానాల్లో ఒకటి కావాలని కోరిన జనసేన చివరికి తిరుపతి తీసుకుంది. దీంతో అనంతపురం స్థానం టీడీపీకి చేరింది. అదే విధంగా ఆలూరుపైనా బీజేపీ-టీడీపీ మధ్య తర్జనభర్జన జరిగింది. కర్నూలు జిల్లాలో ఆదోని బదులుగా ఆలూరు తీసుకోవాలని బీజేపీని కోరింది టీడీపీ. ఐతే బీజేపీ మాత్రం ఆదోని కోసమే పట్టుబట్టి, చివరికి సాధించింది. దీంతో ఆలూరు కూడా టీడీపీ కోటాలో చేరింది. ఇదే సమయంలో అరకు తీసుకున్న బీజేపీ… టీడీపీకి పాడేరు స్థానాన్ని వదిలేసింది. దీంతో ప్రస్తుతం టీడీపీ 8 స్థానాలను పెండింగ్‌లో పెట్టినట్లైంది.

వచ్చే నెలలోనే అభ్యర్థుల ప్రకటన?
వాస్తవానికి తొలి జాబితాలో తెలుగుదేశం అరకు అసెంబ్లీ స్థానానికి దొన్నుదొరను, పి. గన్నవరం స్థానానికి మహాసేన రాజేష్‌ను, అనపర్తి స్థానానికి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని అభ్యర్ధులుగా ప్రకటించింది. ఐతే బీజేపీ అరకు, అనపర్తి స్థానాలను టీడీపీ నుంచి తీసుకుంది. దీంతో విజయనగరం, ఒంగోలు, అనంతపురం, కడప పార్లమెంట్‌ స్థానాలతోపాటు 8 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠ రేపుతోంది. ఈ నెలాఖరు వరకు చంద్రబాబు ప్రజాగళం షెడ్యూల్‌ ఉండటంతో… వచ్చే నెలలోనే ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే పరిస్థితి కనిపిస్తోంది.

చీపురుపల్లి, భీమిలి అసెంబ్లీ స్థానాలపై టీడీపీలో హైడ్రామా..
పెండింగ్‌ పార్లమెంట్‌ స్థానాల్లో విజయనగరం పార్లమెంట్‌తో పాటు చీపురుపల్లి, భీమిలి అసెంబ్లీ స్థానాలపై టీడీపీలో హైడ్రామా కొనసాగుతోంది. ముఖ్యంగా చీపురుపల్లి, భీమిలి స్థానాలకు అభ్యర్థులు ఖరారైతే విజయనగరం పార్లమెంట్‌పై సస్పెన్స్‌ తొలగుతుంది. చీపురుపల్లిలో మంత్రి బొత్స ప్రత్యర్థిగా, మాజీ మంత్రి గంటాను పంపాలని భావిస్తోంది టీడీపీ. అయితే గంటా మాత్రం విశాఖ జిల్లా భీమిలి స్థానాన్నే కోరుకుతున్నారు. గంటా పోటీపై క్లారిటీ వస్తేగాని భీమిలి అభ్యర్థి ఎంపికపై ఓ నిర్ణయానికి రాలేకపోతోంది టీడీపీ.

కళాకు మూడు ఆప్షన్లు ఇచ్చిన టీడీపీ..
అంతేకాకుండా ఈ రెండు స్థానాల వల్ల సీనియర్‌ నేత కళావెంకటరావు సీటు కూడా సస్పెన్స్‌గా మారింది. కళా పోటీ చేయాలని భావించిన ఎచ్చెర్ల నియోజకవర్గం పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించారు. దీంతో కళాకు మూడు ఆప్షన్లు ఇచ్చింది టీడీపీ. ఇందులో ప్రధానంగా విజయనగరం ఎంపీతోపాటు చీపురుపల్లి, గజపతినగరం, భీమిలి స్థానాల్లో ఒకచోట కళాకు టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలోని బలమైన తూర్పు కాపు సామాజికవర్గ నేతగా కళాకు గుర్తింపు ఉండటంతో ఆయనకు కచ్చితంగా సర్దుబాటు చేయాలని భావిస్తోంది టీడీపీ అధిష్టానం.

కళా కాదంటే మీసాల గీత, నాగార్జునకు ఛాన్స్..!
ఐతే విజయనగరం ఎంపీగా పోటీకి కళా విముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, బంగార్రాజు, కిమిడి నాగార్జున పేర్లను పరిశీలిస్తోంది టీడీపీ. వీరిలో కళా కాదంటే మీసాల గీత, నాగార్జున ఇద్దరిలో ఒకరు విజయనగరం ఎంపీగా, మరొకరు చీపురుపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఒంగోలు లోక్‌సభ స్థానానికి సీనియర్‌ నేత మాగుంట శ్రీనివాసులరెడ్డి అభ్యర్ధిత్వాన్ని దాదాపు ఖరారు చేసింది టీడీపీ. తొలుత ఈ స్థానానికి మాగుంట కుమారుడు రాఘవ పేరును పరిశీలించినా, ఢిల్లీ లిక్కర్‌ స్కాం ఆయనకు ప్రతిబంధకంగా మారిందంటున్నారు.

కడప పార్లమెంట్‌ రేసులో భూపేశ్‌రెడ్డి, అనంతపురం స్థానానికి జేసీ పవన్‌రెడ్డి..!
అదేవిధంగా కడప పార్లమెంట్‌ రేసులో రెడ్డప్పగారి శ్రీనివాస్‌ రెడ్డితోపాటు కొత్తగా జమ్మలమడుగు ఇంచార్జ్‌ భూపేశ్‌రెడ్డి పేరు పరిశీలిస్తున్నారు. శ్రీనివాసులరెడ్డి భార్యకు కడప అసెంబ్లీ టికెట్‌ ఇచ్చారు. భూపేశ్‌ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో ఆయనకు ప్రత్యామ్నాయంగా కడప ఎంపీగా పోటీ చేయించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో సీఎం జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు పోటీ చేస్తే చోటుచేసుకునే సమీకరణలు ప్రకారం నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఇక మిగిలిన అనంతపురం స్థానానికి గత ఎన్నికల్లో పోటీ చేసిన జేసి పవన్‌రెడ్డితోపాటు బోయ సామాజివర్గానికి చెందిన పోల నాగరాజు, ప్రొఫెసర్‌ రాజేశ్‌, కంబూరి నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ పేర్లు పరిశీలిస్తున్నారు.

పాడేరు రేసులో గిడ్డి ఈశ్వరి, దొన్నుదొర..!
ఇక అసెంబ్లీ స్థానాల్లో పాడేరుకు గిడ్డి ఈశ్వరి, దొన్నుదొర పేర్లు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. దర్శికి సీనియర్‌ నేత గొట్టిపాటి నరసయ్య కుమార్తె శ్రీలక్ష్మి పేరు పరిశీలనలో ఉంది. మాజీ మంత్రి శిద్ధ రాఘవరావు కుటుంబం పార్టీలోకి వస్తారనే ప్రచారంతో ఇన్నాళ్లు ఈ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టారు. ఇక రాయలసీమలోని రాజంపేట అసెంబ్లీ స్థానానికి జగన్మోహన్ రాజు, బత్యాల చెంగల్ రాయుడు మధ్య తీవ్ర పోటీ ఉంది. ఆలూరులో వైకుంఠం కుటుంబ సభ్యుల పేర్లతోపాటు బీసి వర్గం నుంచి వీరభద్రగౌడ్ పేరు పరిశీలిస్తున్నారు.

అనంతపురం అసెంబ్లీ స్థానానికి ఎన్‌ఆర్‌ఐ నిర్మల..!
అనంతపురం అసెంబ్లీ స్థానానికి ఎన్‌ఆర్‌ఐ నిర్మల, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పోటీ పడుతున్నారు. గుంతకల్లు అసెంబ్లీ స్థానానికి మాజీమంత్రి గుమ్మనూరు జయరాంను స్థానికంగా క్యాడర్ వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఆయనను ఎలా సర్దుబాటు చేస్తారనేది ఉత్కంఠగా మారింది. మొత్తానికి టీడీపీ పెండింగ్‌లో పెట్టిన 8 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్‌ స్థానాలపై రోజురోజుకు ఉత్కంఠగా పెరిగిపోతోంది. ఏదిఏమైనా ఏప్రిల్‌లోనే ఈ 12 స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాల సమాచారం.

Also Read : ఒకవైపు అదృష్టవంతుడు, మరోవైపు పోరాట యోధుడు.. నెల్లూరు రూరల్‌లో గెలుపెవరిది?

 

ట్రెండింగ్ వార్తలు