Rebels Tension : బాలకృష్ణకు వణుకు పుట్టిస్తున్న పరిపూర్ణానంద..! కూటమి అభ్యర్థులకు రెబల్స్ గండం

పొత్తుల్లో సీట్లు దక్కలేదనే ఆగ్రహంతో 16 చోట్ల రెబల్స్‌ రంగంలో ఉండగా, ఇందులో టీడీపీ ప్రధాన నేతలైన నందమూరి బాలకృష్ణ, రఘురామకృష్ణ రాజు, పరిటాల సునీత, పూసపాటి అదితి గజపతిరాజు తదితరులను రెబల్స్‌ షేక్‌ చేస్తున్నారు.

Rebels Tension : రెబల్స్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నారు. సొంత పార్టీ అభ్యర్థులపై తిరుగుబాటు చేస్తూ హడలెత్తిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 16 నియోజకవర్గాల్లో రెబల్స్‌ ఎఫెక్ట్‌ స్పష్టంగా కనపడుతుండగా, కూటమి అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. వాస్తవానికి 30కిపైగా నియోజకవర్గాల్లో రెబల్స్‌ ఉంటే, 14 మందిని సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించి తప్పించారు. ఇక మిగిలిన 16 మంది నామినేషన్ల ఉపసంహరణకు ససేమిరా అనటంతో ఆయా నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ అనివార్యమైంది. పైగా కొన్ని నియోజకవర్గాలకు రెబల్స్‌కు గ్లాసు గుర్తు కేటాయించడం రాజకీయంగా హీట్‌ పుట్టిస్తోంది.

పైకి నవ్వులు.. కడుపులో కత్తులు..
ఏపీలో కూటమి కట్టిన మూడు పార్టీల మధ్య తొలి నుంచి ఏదో కనిపించని అగాధమే కనిపిస్తోంది. ముఖ్యంగా కూటమిలోని మిగిలిన రెండు పార్టీలపై టీడీపీ అధిపత్యం చలాయిస్తోందనే భావన వ్యక్తమవుతోంది. జనసేనకు కేటాయించిన 21 సీట్లలో సగం చోట్ల, బీజేపీకి కేటాయించిన 10 సీట్లలో కొన్నిచోట్ల టీడీపీ నుంచి ఆయా పార్టీల్లో చేరిన వారికే టికెట్లు కట్టబెట్టారు. తొలి నుంచి జనసేన, బీజేపీలను నమ్ముకున్న వారికి న్యాయం జరగలేదనే టాక్‌ నడుస్తోంది. ఇదే సమయంలో కూటమి పొత్తులంటూ తమ సీట్లకు ఎసరు పెట్టడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పైకి నవ్వులు… కడుపులో కత్తులు అన్నట్లే పొత్తు రాజకీయం నడుస్తోంది. ఇక నామినేషన్ల ఉప సంహరణ తర్వాత ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది.

ఆర్ఆర్ఆర్, బాలకృష్ణ, పరిటాల సునీతకు రెబల్స్ టెన్షన్..
పొత్తుల్లో సీట్లు దక్కలేదనే ఆగ్రహంతో 16 చోట్ల రెబల్స్‌ రంగంలో ఉండగా, ఇందులో టీడీపీ ప్రధాన నేతలైన నందమూరి బాలకృష్ణ, రఘురామకృష్ణ రాజు, పరిటాల సునీత, పూసపాటి ఆదితి గజపతిరాజు తదితరులను రెబల్స్‌ షేక్‌ చేస్తున్నారు. ఉండిలో రఘురామపై మాజీ శివరామరాజు శివాలెత్తిపోతున్నారు. పార్టీలో చేరిన రెండు రోజుల్లో ఆయనకు టికెట్‌ ఎలా ఇస్తారంటూ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు శివరామరాజు. ఇక హిందూపురంలో ఓటమే ఎరుగని బాలకృష్ణకు శ్రీపీఠం పీఠాధిపతి, బీజేపీ నేత పరిపూర్ణానంద వణుకు పుట్టిస్తున్నారు. హిందూపురం అసెంబ్లీతోపాటు, లోక్‌సభ సీటు నుంచి పోటీ చేస్తున్న పరిపూర్ణానంద హిందూ ఓట్లను చీల్చితే.. బీజేపీతో పొత్తులో ఉండటం వల్ల మైనార్టీ ఓట్లు వైసీపీకి మళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో బాలకృష్ణకు టెన్షన్‌ పెరిగిందంటున్నారు. ఇక రాప్తాడులో పరిటాల సునీతపైనా రెబల్‌ పోటీకి దిగడంపై విస్తృత చర్చ జరుగుతోంది.

రెబల్స్ కు గాజు గ్లాసు సింబల్..
విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత టీడీపీ రెబల్‌గా పోటీలో నిలిచారు. ఈమెకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. విజయనగరంలో టీడీపీ తరఫున సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన మీసాల గీత భారీగా ఓట్లు చీల్చే పరిస్థితులు ఉండటంతో ఆదితి అసెంబ్లీ ఆశలపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. అదే విధంగా నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ రెబల్‌ పసుపులేటి సుధాకర్‌కు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో సైకిల్‌ పార్టీకి సంకటంగా మారింది.

వణుకు పుట్టిస్తున్న గాజు గ్లాసు..
ఇక టీడీపీ కూటమి పోటీ చేస్తున్న అనకాపల్లి ఎంపీ, పాయకరావుపేట అసెంబ్లీ స్థానాల్లో గ్లాసు గుర్తు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు రాకుండా తీవ్ర ప్రయత్నాలు చేసిన సీఎం రమేశ్‌, టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనితకు నిరాశే మిగిలింది. ఇవన్నీ ఒక ఎత్తైతే చిత్తూరు జిల్లాలోని సత్యవేడులో టీడీపీకి ఇద్దరు రెబల్‌ అభ్యర్థులు సవాల్‌ విసురుతున్నారు. మొత్తానికి రెబల్స్‌ దెబ్బతో కూటమి కుదేలయ్యే పరిస్థితే ఎక్కువగా కనిపిస్తోంది.

Also Read : ఏపీలో కూటమికి గ్లాస్ గండం..! గాజు గ్లాసుతో లాస్ తప్పదా?

 

ట్రెండింగ్ వార్తలు