Ap Election Campaign : ఇక జనంలోకి జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. పోటాపోటీగా ఎన్నికల ప్రచారం.. యాత్రల పూర్తి వివరాలు

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు 20 పార్లమెంట్ స్థానాలను కవర్ చేయనున్నారు. అలాగే భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది.

Ap Election Campaign :ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైపోవడంతో ప్రచారంపై దృష్టి సారించాయి పొలిటికల్ పార్టీలు. యాత్రలతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రచార వ్యూహాలు సిద్ధం చేశాయి. బస్సు యాత్రతో జనాల్లోకి దూసుకుపోయేందుకు వైసీపీ సిద్ధమైంది. ప్రజాగళం పేరుతో జనంలోకి వెళ్లేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. ఇక, రాష్ట్రాన్ని చుట్టేసేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా వారాహిని కూడా సిద్ధం చేసుకుంటున్నారు. జగన్ బస్సు యాత్ర.. ప్రజలతో మమేకం అవుతూ మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ బస్సు యాత్ర చేపడుతోంది. ఈ నెల 27న ఇడుపులపాయలో బస్సు యాత్ర ప్రారంభం కానుంది.

జగన్ బస్సు యాత్ర..
మొత్తం 21 పార్లమెంట్ నియోజకవర్గాలను కలుపుతూ ఈ బస్సు యాత్ర సాగనుంది. గతంలో నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే ఈ బస్సు యాత్ర జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఎలాంటి విరామం లేకుండా సీఎం జగన్ ఈ యాత్రలో పాల్గొననున్నారు. గత ఐదేళ్ల పాలనలో ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈ బస్సు యాత్ర సాగనుంది.

బస్సు యాత్రలో ప్రతిరోజు ఉదయం వివిధ రంగాల్లోని నిపుణులతో సీఎం జగన్ సమావేశమై వారి నుంచి అవసరమైన సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. మధ్యాహ్నం తర్వాత పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గంలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో సభలు పెట్టేందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

పవన్ వారాహి యాత్ర..
ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేందుకు జనసేన సిద్ధమైంది. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు పవన్ కల్యాణ్. తాను బరిలోకి దిగనున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించబోతున్నారు. జనసేన బరిలోకి దిగుతున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో రోజు మొత్తం ప్రచారం చేయనున్నారు పవన్ కల్యాణ్. 20 రోజుల పాటు పవన్ పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. మిత్రపక్షాలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో సైతం పవన్ ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే ఉమ్మడి సభలకు సంబంధించి టీడీపీ-బీజేపీ నేతలతో పవన్ చర్చిస్తున్నారు. కొన్ని స్థానాల్లో చిన్న చిన్న లోపాలను సరి చేస్తూ పవన్ కల్యాణ్ ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు.

చంద్రబాబు ప్రజాగళం..
ఈ నెల 26 నుంచి ప్రజాగళం పేరుతో టీడీపీ ఎన్నికల ప్రచార పర్వం మొదలు కానుంది. తన నియోజకవర్గం నుండే పార్లమెంట్ స్థానమైన చిత్తూరు నుంచి ప్రచార యాత్రకు చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. 20 రోజుల్లో 20 పార్లమెంటు స్థానాల్లో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఉదయం సమయంలో నియోజకవర్గంలోని 5వేల మందికిపైగా కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్ షో సాగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు 20 పార్లమెంట్ స్థానాలను కవర్ చేయనున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పార్టీ గ్రౌండ్ రిపోర్టును సిద్ధం చేయనుంది. అలాగే భారీ బహిరంగ సభలను నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది.

జగన్ బస్సు యాత్ర..
* ఇడుపులపాయ నుంచి వైసీపీ బస్సు యాత్ర ప్రారంభం
* 27న ప్రొద్దుటూరులో తొలి బహిరంగ సభ
* 28న నంద్యాలలో, 29న ఎమ్మిగనూరులో బహిరంగ సభలు
* ప్రతిరోజూ సాయంత్రం బహిరంగ సభ

చంద్రబాబు ప్రజాగళం..
* చిత్తూరు నుంచి చంద్రబాబు ప్రచార యాత్ర ప్రారంభం
* ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచార యాత్ర
* రోజుకో పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం
* ఈ నెల 24, 25న కుప్పంలో చంద్రబాబు పర్యటన

పవన్ వారాహి యాత్ర..
* వారాహిపై పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం
* 20 రోజుల పాటు రాష్ట్రంలో పవన్ పర్యటన
* మొదటి విడతలో 21 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం
* పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

 

 

ట్రెండింగ్ వార్తలు