Vijay Sai Reddy : కావాలనే చంద్రబాబు అలా చేశారు- టీడీపీ మ్యానిఫెస్టోపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

బీజేపీ భాగస్వామ్యం లేకపోతే బీజేపీ సపరేటుగా మేనిఫెస్టో విడుదల చేయాలి కదా? అలా చేయలేదంటే బీజేపీ భాగస్వామ్యం ఉన్నట్టే.

Vijay Sai Reddy : టీడీపీ కూటమి మ్యానిఫెస్టోలో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్పందించారు. మ్యానిఫెస్టోలో ప్రధాని మోదీ ఫోటో లేకపోవడానికి చంద్రబాబే కారణం అన్నారు. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు ఇలా చేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ “లోకల్ మ్యానిఫెస్టో” విడుదల చేశారు విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగా టీడీపీ మ్యానిఫెస్టోపై మాట్లాడారు.

”టీడీపీ బీజేపీ జనసేన కూటమి విడుదల చేసిన మ్యానిఫెస్టోలో మోదీ ఫోటో లేదు. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు ఇలా చేశారు. ముస్లిం మైనారిటీ ఓటర్లు దూరం అవుతారనే ఇలా చేశారు. బీజేపీ భాగస్వామ్యం లేకపోతే బీజేపీ సపరేటుగా మేనిఫెస్టో విడుదల చేయాలి కదా? అలా చేయలేదంటే బీజేపీ భాగస్వామ్యం ఉన్నట్టే. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి పౌరసత్వ సవరణ బిల్లుకు టీడీపీ మద్దతిస్తుందా? లేదా? చెప్పాలి.

నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో తయారు చేశాము. సాధ్యమయ్యే వాటిని మేనిఫెస్టోలో పెట్టాం. రాష్ట్రంతో పాటు కేంద్ర నిధుల సాయంతో అభివృద్ధి చేస్తాం. జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. చంద్రబాబులా చేయలేనివి కూడా మేము చెప్పం. జిల్లాలోని అన్ని స్థానాలను గెలుస్తాము. లోకల్ మేనిఫెస్టోలో 46 హామీలు ఇచ్చాము. జిల్లా ప్రగతికి అన్ని చర్యలు తీసుకుంటాము. ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తాం” అని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు.

Also Read : వైసీపీ మ్యానిఫెస్టో 2024లో హైలైట్స్ ఏంటి? పేదల సాధికారతకు ఉపయోగపడుతుందా?

ట్రెండింగ్ వార్తలు