8th Pay Commission
8th Pay Commission : 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్ వచ్చేసింది. మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ అందించనుంది. అతి త్వరలో ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్రం సూచించింది.
వచ్చే నెల నాటికి ప్రభుత్వం నోటిఫికేషన్ (8th Pay Commission) జారీ చేయవచ్చునని భావిస్తున్నారు. వాస్తవానికి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాదాపు 10 నెలల తర్వాత కూడా 8వ వేతన సంఘం ఇంకా ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఉద్యోగి సంస్థలు ఇప్పుడు 8వ కమిషన్ ఏర్పాటుకు వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై వేగంగా పనిచేస్తున్నట్లు సమాచారం.. ప్రభుత్వం వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం అమలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే 7వ వేతన సంఘం కింద డీఏ, డీఆర్‌లను 3 శాతం పెంచారు. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి పెరిగింది. ప్రభుత్వం 8వ వేతన సంఘం అమలుపై ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అలవెన్సులలో మార్పులు జరగనున్నాయి.
7వ వేతన సంఘం ఫిబ్రవరి 2014లో ఏర్పడింది. ఈ రిపోర్టును నవంబర్ 2015లో సమర్పించింది. ఈ నెలలో 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించినా రిపోర్టు ఏప్రిల్ 2027కి ముందు విడుదలయ్యే అవకాశం లేదు. కొత్త వేతన సంఘం జూలై 2027లో అమలు అవుతుందని సీనియర్ యూనియన్ నేత ఆశాభావం వ్యక్తం చేశారు. కమిషన్ రిపోర్టును సమర్పించడానికి మరింత సమయం పట్టవచ్చు. కానీ, 7వ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ 2025లో ముగుస్తుంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. కొత్త వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రావాలి. కమిషన్ నిర్ణయాలు జూలై 2027 నాటికి ప్రకటిస్తే.. ఉద్యోగులు జనవరి 2026 నుంచి జూలై 2027 వరకు బకాయిలను పొందే అవకాశం ఉంటుంది. 18 నెలల బకాయిలను పొందడం వల్ల లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు భారీగా ప్రయోజనం పొందుతారు. 8వ వేతన సంఘం 5 మిలియన్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 6.5 మిలియన్ల పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది.
ఇందులో రక్షణ సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. కమిషన్ ఏర్పాటులో జాప్యం అంశాన్ని సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ ఫోరం ఇటీవలే లేవనెత్తింది. 7వ వేతన సంఘం అమలు తేదీకి దాదాపు 2 ఏళ్ల ముందే ఏర్పడిందని పేర్కొంటూ ఫోరం ప్రధానమంత్రికి లేఖ రాసింది. దీనివల్ల కమిషన్ లోతైన అధ్యయనం చేసి సిఫార్సులను సమర్పించేందుకు తగినంత సమయం లభించింది.
ఈ అంచనా ప్రకారం.. నవంబర్‌లో ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ కాకపోతే.. సిఫార్సులు నవంబర్ 2027 నాటికి రావచ్చు. ఆ తర్వాత అమలుకు జనవరి 2028 వరకు వేచి ఉండాల్సి రావచ్చు. ప్రభుత్వం ఒక ఫార్ములాను ప్రవేశపెట్టవచ్చు. దీని ప్రకారం.. సిఫార్సులు ఒక ఏడాది కన్నా తక్కువ సమయంలోనే అందుతాయని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి. అదేనిజమైతే.. వేతన సంఘం సిఫార్సులను 2027 ప్రారంభం నుంచి అమలు చేయొచ్చు.