8th Pay Commission Update
8th Pay Commission Update : 8వ వేతన సంఘం కింద పెన్షనర్లకు భారీ ఉపశమనం అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం, రిటైర్ అయిన ఉద్యోగులు తమ (8th Pay Commission Update) పెన్షన్‌లో కొంత భాగాన్ని ఒకేసారి తీసుకుంటే.. 15 ఏళ్ల పాటు కోతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే.. ఈ కాలాన్ని 12 ఏళ్లకు పెంచాలని నేషనల్ కౌన్సిల్ (JCM) సంస్థ డిమాండ్ చేసింది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే.. లక్షలాది మంది పెన్షనర్లు త్వరలో పూర్తి పెన్షన్ పొందవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. పదవి విరమణ పొందిన వాళ్లు మూడేళ్లు ముందుగానే ఫుల్ పెన్షన్ తీసుకోవచ్చు.
15 ఏళ్ల నుంచి 12ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ :
ఇప్పటికే, 8వ వేతన సంఘం కోసం కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, లక్షలాది పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి కమ్యూటెడ్ పెన్షన్‌పై పడింది. ఈ కమ్యూటెడ్ పెన్షన్ రెన్యువల్ టైమ్ 15 ఏళ్ల నుంచి 12 ఏళ్ల తగ్గించాలని డిమాండ్ వినిపిస్తోంది. అయితే, ఇప్పుడు ఈ దీర్ఘకాల డిమాండ్ ఆమోదం పొందవచ్చునని ఆశాభావం వ్యక్తమవుతోంది.
కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి ప్రాతినిధ్యం వహించే కీలక సంస్థ నేషనల్ కౌన్సిల్ (JCM) స్టాఫ్ సైడ్ నుంచి కేంద్రానికి సమర్పించిన డిమాండ్ల జాబితాలో ఈ డిమాండ్ కూడా ఉందని ఓ నివేదిక వెల్లడించింది. ఈ కీలక డిమాండ్ 8వ కేంద్ర వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR)లో కూడా భాగమయ్యే అవకాశం ఉంది. అదే జరిగి ఆమోదం లభిస్తే.. లక్షలాది మంది పెన్షనర్లకు భారీ ప్రయోజనం చేకూరుతుంది.
పెన్షన్ కమ్యూటేషన్ అంటే ఏంటి? :
పదవీ విరమణ సమయంలో ఉద్యోగులు తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని ఒకేసారి తీసుకోవచ్చు. దీన్నే కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ అంటారు. అయితే, ఉద్యోగి కమ్యుటేషన్‌ను ఎంచుకుంటే.. ప్రభుత్వం ఆయా వ్యక్తి పెన్షన్‌లో కొంత భాగాన్ని తొలగించి 15 ఏళ్ల కాలంలో ఏకమొత్తాన్ని తిరిగి అందిస్తుంది. ఆ తర్వాత ఉద్యోగికి పూర్తి పెన్షన్ వస్తుంది. ఇప్పుడు, పెన్షనర్లు ఈ కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎందుకంటే ఈ వ్యవధి చాలా ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వడ్డీ రేట్లు తగ్గిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రికవరీని లెక్కించే విధానంలో అసమానత పెరిగిందని, రిటైర్మెంట్ ఉద్యోగులు తమ పెన్షన్‌లో భారీ మొత్తాన్ని కోల్పోతున్నారని వాదిస్తున్నారు. అయితే, రికవరీ వ్యవధిని 12 ఏళ్లకు తగ్గిస్తే.. పదవీ విరమణ చేసినవారు త్వరగా పూర్తి పెన్షన్‌ను పొందవచ్చు.
12 ఏళ్ల కాలం ఎందుకంటే? :
15 సంవత్సరాల తగ్గింపు కాలం ఇప్పుడు ఆర్థికంగా హానికరమని ఉద్యోగి సంస్థలు, పెన్షనర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం వడ్డీ రేట్లు గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. అయితే, కమ్యుటేషన్ పాత ఫార్ములాను ఉపయోగించి లెక్కిస్తారు. దీని కారణంగా, పదవీ విరమణ చేసిన వ్యక్తి తన సొంత పెన్షన్‌లో ఎక్కువ భాగాన్ని కోల్పోవలసి వస్తుంది. ఈ కాలాన్ని 12 ఏళ్లకు తగ్గిస్తే.. ఉద్యోగి త్వరగా పూర్తి పెన్షన్ పొందవచ్చు.
8వ వేతన సంఘంలో జాప్యం :
8వ వేతన సంఘంలో జాప్యంతో ఉద్యోగుల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. 7వ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ 31, 2025న ముగియనుంది. సాధారణంగా, ప్రతి 10 ఏళ్లకు ఒక కొత్త వేతన సంఘం ప్రవేశపెడతారు. దీని ప్రకారం.. జనవరి 1, 2026న 8వ వేతన సంఘం ప్రారంభ తేదీగా అంచనా. అయితే, ప్రభుత్వం ఇంకా సభ్యుల పేర్లను ప్రకటించలేదు. నిబంధనలను (ToR) ఖరారు చేయలేదు. ఈ ఆలస్యంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో రోజురోజుకీ ఆందోళన పెరుగుతోంది.