ఏఐ ఉంది కదా అని 700 మంది ఉద్యోగులను తీసేసిన కంపెనీ.. ఇప్పుడు లబోదిబోమంటూ మళ్లీ ఉద్యోగ నియామకాలు.. ఎందుకంటే?

క్లార్నా కంపెనీ విమర్శలను ఎదుర్కొంది.

ఏఐ ఉంది కదా అని 700 మంది ఉద్యోగులను తీసేసిన కంపెనీ.. ఇప్పుడు లబోదిబోమంటూ మళ్లీ ఉద్యోగ నియామకాలు.. ఎందుకంటే?

Updated On : May 20, 2025 / 8:28 PM IST

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజన్స్ (ఏఐ) వల్ల చాలా ఉద్యోగాలు పోతాయన్న వాదనను ఇప్పటికే చాలా కంపెనీలు నిజం చేస్తున్నాయి. అందులో ఒకటి స్వీడిష్ ఫిన్‌టెక్ కంపెనీ క్లార్నా. “ఇప్పుడు కొనండి, బిల్లు మాత్రం తరువాత చెల్లించండి” అంటూ సర్వీసులు అందిస్తూ కస్టమర్లను ఆకర్షించిన ఈ స్వీడిష్ సంస్థ ఉద్యోగుల స్థానంలో ఏఐను వాడతామంటూ ఏకంగా 700 మందిని జాబ్స్‌ నుంచి తీసేసింది. అయితే, ఏఐకి అంత సీన్‌ లేదని ఇప్పుడు తెలుసుకుంది. మళ్లీ ఈ కంపెనీ ఉద్యోగాల నియామకాలు చేపట్టింది.

ఏఐను బాగా వాడాలని, ఉద్యోగులను తొలగించి ఖర్చులను తగ్గించుకోవాలని క్లార్నా కంపెనీ 2022లో నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే సుమారు 700 మంది ఉద్యోగులను తొలగించింది. ఓపెన్‌ఏఐ పార్ట్‌నర్‌షిప్‌తో ఉద్యోగుల స్థానంలో ఏఐను బాగా వాడింది. 2023 నాటికి, క్లార్నా ఉద్యోగ నియామకాలను పూర్తిగా ఆపేసింది.

కస్టమర్ సపోర్ట్‌, ట్రాన్స్‌లేషన్స్‌ టు డేటా అనాలిసిస్, ఆర్ట్‌ క్రియేషన్ వంటి ప్రతి దాన్ని ఏఐ ద్వారానే కొనసాగించింది. ఆ కంపెనీ సీఈవో సెబాస్టియన్ సిమియాట్కోవ్స్కీ అప్పట్లో మాట్లాడుతూ.. ఏఐ ఇప్పటికే మనుషులు చేసే అన్ని ఉద్యోగాలను చేస్తోందని అన్నారు.

Also Read: సన్నని డిజైన్, తక్కువ బరువు.. బ్యాటరీ మాత్రం..

ఇప్పుడు అభిప్రాయాన్ని ఎందుకు మార్చుకుంది?
ఏఐపై అధికంగా ఆధారపడటంతో క్లార్నా కంపెనీ అందించే సర్వీసుల్లో క్వాలిటీ లోపించింది. సర్వీసు స్టాండర్స్‌ తగ్గిపోయి క్లార్నా కంపెనీ విమర్శలను ఎదుర్కొంది. బ్లూమ్‌బెర్గ్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సిమియాట్కోవ్స్కీ మాట్లాడుతూ తాము చేసిన తప్పును ఒప్పుకున్నారు.

తమ కంపెనీ ఖర్చులు తగ్గించుకోవడంపైనే చాలా దృష్టి పెట్టి, కస్టమర్లకు మంచి సర్వీసులు అందించంలో నిర్లక్ష్యం వహించిందని అంగీకరించారు. కస్టమర్ సర్వీసుల్లో ఉద్యోగుల సేవలు అవసరమని అన్నారు. కస్టమర్లు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి కంపెనీలో ఉద్యోగులు ఉన్నారన్న హామీని ఏ సంస్థ అయినా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పుడు క్లార్నా కంపెనీ పెద్ద సంఖ్యలో నియామకాలు చేపడుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా 2024లో జరిపిన ఓ సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. చాలా మంది బిజినెస్‌మన్లు తమ కంపెనీలలో ఏఐ పనిచేస్తున్న తీరు పట్ల సంతృప్తిగా లేరు. యూకేలో ఉద్యోగాలు తొలగించి ఏఐను భర్తీ చేసిన ఎగ్జిక్యూటివ్‌లలో సగానికి పైగా (55%) మంది తరువాత తాము చేసిన పని సరికాదని భావించారు. చాలా కంపెనీలు ఏఐ పనులను వేగవంతంగా, తక్కువ ఖర్చుతో చేస్తుందని భావించాయి. కానీ, ఇప్పుడు మాత్రం తమ ఆలోచన తీరు సరికాదని అనుకుంటున్నాయి.