Ambati Rambabu: అంబటి రాంబాబు అరెస్ట్
అంబటి రాంబాబు నీచ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం అన్నారు. వైసీపీకి 11 సీట్లు వచ్చినా ఇంకా ఆ పార్టీ నాయకుల్లో మార్పు రాలేదన్నారు.
- సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్
- వైసీపీ నుంచి అంబటి రాంబాబును సస్పెండ్ చేయాలని డిమాండ్
- అంబటి వ్యాఖ్యలు క్షమించరాని నేరం అన్న కూటమి నేతలు
Ambati Rambabu: గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి అరెస్ట్ అయ్యారు. గుంటూరులోని అంబటి నివాసంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ అంబటిని పోలీసులు నల్లపాడు పీఎస్ కు తరలిస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అంబటికి వైద్య పరీక్షలు చేయించనున్నారు పోలీసులు. వైద్య పరీక్షల తర్వాత అంబటిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.
రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. ఈ క్రమంలో అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీస్ పై దాడి చేశారు. వాహనం, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు అంబటి రాంబాబుపై కేసులు నమోదు చేశారు.
11 సీట్లు వచ్చినా బుద్ది రాలేదు..
సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను కూటమి పార్టీల నేతలు ముక్త కంఠంతో ఖండించారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని మండిపడ్డారు. మంత్రిగా పని చేసిన వ్యక్తి హుందాతనం మరిచారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా అంబటి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. అంబటి రాంబాబు నీచ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం అన్నారు. వైసీపీకి 11 సీట్లు వచ్చినా ఇంకా ఆ పార్టీ నాయకుల్లో మార్పు రాలేదని విమర్శించారు. రాజకీయాల్లో దిగజారుడు భాషకు చోటు లేదన్నారు. అంబటి రాంబాబును వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని ఏపీ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
”చంద్రబాబుపై అంబటి నీచంగా మాట్లాడారు. అంబటి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. వైసీపీ దిగజారుడు రాజకీయాలకు ఇది పరాకాష్ట. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రూ.250 కోట్లకుపైగా స్కామ్ నుంచి తప్పించుకునేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా వైసీపీకి బుద్ధి రాలేదు” అని మంత్రి అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు.
అంబటికి పార్టీ అండగా ఉంటుంది..
మరోవైపు వైసీపీ చీఫ్ జగన్.. అంబటి రాంబాబును ఫోన్ లో పరామర్శించారు. అంబటిని అడిగి దాడి వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని అంబటికి సూచించారు. కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్రం జంగిల్ రాజ్ గా మారిపోయిందని జగన్ మండిపడ్డారు. ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ విరుచుకుపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే అంబటి రాంబాబుపై హత్యాయత్నం, దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కూటమి అరాచకపాలనను ప్రజలు సహించబోరు అని హెచ్చరించారు. అంబటికి పార్టీ అండగా ఉంటుందని జగన్ భరోసానిచ్చారు.
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అంబటి రాంబాబు ఆరోపించారు. చట్ట వ్యతిరేకంగా మాజీ సీఎం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఆ ఫ్లెక్సీని చించడానికి తాను వెళ్లలేదన్నారు. చంద్రబాబును తిట్టాల్సిన అవసరం తనకు లేదన్నారు. నన్ను తిట్టిన వారినే నేను తిట్టాను అని వివరణ ఇచ్చారు. తనపై దాడికి యత్నించిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంబటి వాపోయారు. నేను అరెస్టులకు భయపడను అని స్పష్టం చేశారు.
