iPhone 17 Air Leaks: సన్నని డిజైన్, తక్కువ బరువు.. బ్యాటరీ మాత్రం..

ఆపిల్ బ్యాటరీ విషయంలో రాజీ పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

iPhone 17 Air Leaks: సన్నని డిజైన్, తక్కువ బరువు.. బ్యాటరీ మాత్రం..

Updated On : May 20, 2025 / 7:32 PM IST

ఐఫోన్ 17 ఎయిర్‌కు సంబంధించిన తాజా లీకులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సారి డిజైన్, బ్యాటరీ, అలాగే తక్కువ బరువు వంటి కీలక అంశాలపై ఆసక్తికరమైన వివరాలు బయటకొచ్చాయి.

ఇప్పటికే కొన్ని నివేదికల ద్వారా వెల్లడైన ఐఫోన్ 17 ఎయిర్‌ లాంచ్ టైమ్‌లైన్, చిప్‌సెట్, డిస్‌ప్లే వంటి అంశాలపై యూజర్లలో ఓ అంచనా ఉంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఐఫోన్ 17 ఎయిర్ అత్యంత సన్నని డిజైన్‌తో రానుందని, అయితే బ్యాటరీ విషయంలో కొంత నిరాశపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

డిజైన్, బరువు ఎలా ఉండనున్నాయి?

కొరియన్ బ్లాగ్ ‘నావెర్’ బయటపెట్టిన లీక్స్ ప్రకారం.. ఈ కొత్త ఐఫోన్ కేవలం 5.5mm మందంతో, 145 గ్రాముల బరువుతో ఉంటుంది. ఇది ఆపిల్ రూపొందించిన అత్యంత సన్నని, తేలికైన ఐఫోన్ అవుతుందని అంచనా. ఈ ఫోన్ ఐఫోన్ SE 2,  ఐఫోన్ 13 మినీ మోడళ్ల కంటే తేలికగా ఉండనుంది.

Also Read: జియోకు పోటీ… గూగుల్‌తో కలిసిన ఎయిర్‌టెల్… కస్టమర్లకు ఉచితంగా 100 జీబీ స్టోరేజ్… ఇలా పొందండి…

బ్యాటరీ సామర్థ్యం

ఐఫోన్ 17 ఎయిర్‌లో 2,800mAh బ్యాటరీ ఉండవచ్చని లీక్స్ సూచిస్తున్నాయి. 6.6-అంగుళాల స్క్రీన్ ఉండే 2025 మోడల్ ఫోన్‌కు ఇది సరిపోదని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ఉదాహరణకు, ఇదే పరిమాణంలో శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్ 3,900mAh బ్యాటరీతో వచ్చింది. దీంతో, ఆపిల్ బ్యాటరీ విషయంలో రాజీ పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

నూతన హై-డెన్సిటీ బ్యాటరీ టెక్నాలజీ

అయితే, ఒక సానుకూల అంశం ఏమిటంటే.. ఆపిల్ ఈ ఫోన్‌లో ‘హై-డెన్సిటీ బ్యాటరీ టెక్నాలజీ’ వాడనుందని సమాచారం. ఈ టెక్నాలజీ బ్యాటరీ సామర్థ్యాన్ని 15–20% వరకు పెంచగలదు. అంటే, బ్యాటరీ సామర్థ్యం 2,800mAhగానే ఉన్నప్పటికీ, వాడుతున్న సమయంలో మెరుగైన బ్యాకప్ ఇచ్చే ఆస్కారం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రముఖ విశ్లేషకుడు మింగ్-చీ కువో సైతం ఈ ఏడాది ఐఫోన్‌లలో కొత్త బ్యాటరీ టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు తెలిపారు.

‘The Information’ నివేదిక ప్రకారం, ఆపిల్ అంతర్గత పరీక్షలలో ఐఫోన్ 17 ఎయిర్‌ను 60-70% మంది వినియోగదారులు మాత్రమే ఒక రోజు పూర్తిస్థాయిలో వాడగలుగుతున్నట్లు తేలింది. ఇది ఆపిల్ సాధారణంగా లక్ష్యంగా పెట్టుకునే 80-90% కంటే తక్కువ. ఈ సమస్య పరిష్కారానికి, ఆపిల్ ఒక ప్రత్యేక బ్యాటరీ కేస్‌ను ఐచ్ఛికంగా (ఆప్షనల్‌గా) అందించవచ్చని వదంతులున్నాయి.

ఉద్దేశపూర్వకంగా బ్యాటరీ తగ్గించారా?

కొందరి విశ్లేషణ ప్రకారం, ఆపిల్ ఉద్దేశపూర్వకంగా బ్యాటరీ పరిమితిని తగ్గించి యాక్సెసరీల అమ్మకాలు పెంచుకోవాలని చూస్తోందని తెలుస్తోంది. మరికొందరు, కొత్త AI ఆధారిత బ్యాటరీ ఆదా ఫీచర్లతో పనితీరును మెరుగుపరచాలని ఆపిల్ యోచిస్తోందని అభిప్రాయపడుతున్నారు.

కెమెరా, మోడెమ్‌లో మార్పులు

ఈసారి ఐఫోన్ 17 ఎయిర్‌లో అల్ట్రా-వైడ్ కెమెరాను తొలగించే సూచనలున్నాయి. ఇది ఫోన్ లోపలి భాగాలకు స్థలం సర్దుబాటు చేయడానికే కావచ్చు. అలాగే, ఆపిల్ సొంతంగా అభివృద్ధి చేసిన ‘C1 మోడెం’ వాడే ఆస్కారం ఉంది. ఇది తక్కువ విద్యుత్ వినియోగించుకుని బ్యాటరీ లైఫ్‌ను పెంచడంలో సహాయపడుతుంది.

విడుదల ఎప్పుడు?

ఈ ఐఫోన్ 17 ఎయిర్ మోడల్‌ను ఆపిల్ సెప్టెంబర్ నెలలో విడుదల చేసే సూచనలున్నాయి. ఇది ప్రస్తుత “Plus” మోడల్ స్థానంలో వస్తుంది.

మొత్తానికి, ఐఫోన్ 17 ఎయిర్ డిజైన్ పరంగా ఆకట్టుకున్నా, బ్యాటరీ సామర్థ్యం కొందరిని ఆలోచనలో పడేసేలా ఉంది. అయితే, యాపిల్ తన సాఫ్ట్‌వేర్, AI టెక్నాలజీ, కొత్త మోడెమ్‌లతో ఈ సమస్యను అధిగమిస్తుందని ఆశించవచ్చు. ఇలాంటి మరిన్ని ఐఫోన్ లీక్స్ కోసం 10tv.in వెబ్‌సైట్‌ను చూస్తుండండి..

#ఐఫోన్17ఎయిర్ #ఐఫోన్‌లీక్స్ #యాపిల్ఐఫోన్17 #స్లిమ్ఐఫోన్ #ఐఫోన్‌బ్యాటరీ #కొత్తఐఫోన్2025