జియోకు పోటీ… గూగుల్‌తో కలిసిన ఎయిర్‌టెల్… కస్టమర్లకు ఉచితంగా 100 జీబీ స్టోరేజ్… ఇలా పొందండి…

సాధారణంగా గూగుల్‌ తమ వినియోగదారులకు 15 GB డేటాను ఉచితంగా ఇస్తుంది.

Airtel Prepaid Plans

ఎయిర్‌టెల్ కస్టమర్ల కోసం గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీసును తీసుకువచ్చేందుకు ఆ రెండు కంపెనీలు కలిశాయి. లిమిటెడ్‌ డివైజ్‌ స్టోరేజ్‌ వల్ల కస్టమర్లు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు గూగుల్‌, భారతి ఎయిర్‌టెల్ జతకట్టాయి.

గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సబ్‌స్క్రిప్షన్ కింద ఎయిర్‌టెల్ పోస్ట్‌ పెయిడ్‌తో పాటు వైఫై కస్టమర్లు ఉచితంగా 6 నెలల వరకు 100 జీబీ గూగుల్‌ వన్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌ను అందుకోవచ్చు. అంతేకాదు, కస్టమర్లు ఈ స్టోరేజ్‌ను అయిదుగురు వ్యక్తులతో షేర్‌ చేసుకోవచ్చు.

అర్హత ఉన్న ఎయిర్‌టెల్‌ కస్టమర్లు “ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌” యాప్‌ ద్వారా ఈ సబ్‌స్క్రిప్షన్ చేసుకోవచ్చు. గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీసును అదనపు ఖర్చు లేకుండా పొందే అవకాశం ఆరు నెలల కాలపరిమితి వరకే ఉంటుంది. ఆ తర్వాత ప్రతి నెల ఈ సర్వీసు పొందడానికి రూ.125 పే చేయాల్సి ఉంటుంది.

సాధారణంగా గూగుల్‌ తమ వినియోగదారులకు 15 GB డేటాను ఉచితంగా ఇస్తుంది. ఈ పరిమితి దాటితే నెలకు రూ.130 వసూలు చేస్తుంది. కొన్నిసార్లు ఉచిత పరిమితి (15 GB డేటా) ముగిసిన తర్వాత మొదటి 3 నెలలకు గూగుల్ నెలకు రూ.35తో డేటాను అందిస్తుంది.

Also Read: ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్న మీ కలను ఇప్పుడు నెరవేర్చుకోండి.. భారీ ఆఫర్‌ ఉంది మరీ..

రిలయన్స్ జియో గతంలో 100 GB డేటాను ఉచితంగా ఇచ్చింది. కానీ, ఇప్పుడు దానిని కాలపరిమితి లేకుండా 50 GBకి తగ్గించింది. చాలా మంది ఫోన్ స్టోరేజ్ త్వరగా అయిపోతుంది. ముఖ్యంగా వాట్సాప్ బ్యాకప్‌లు వంటివాటికి స్టోరేజ్ అధికంగా అవసరం అవుతుంది.

ఇప్పుడు గూగుల్‌తో కలిసి తాము ప్రకటించిన ఈ ఆఫర్.. తమ కస్టమర్ల స్మార్ట్‌ఫోన్‌లలో వ్యక్తిగత, వర్క్ డేటాను అధికంగా నిల్వ చేసుకునేందుకు సహాయపడుతుందని ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ ఆఫర్‌తో కస్టమర్లు తమ ఫైల్‌లను తొలగించాల్సిన అవసరం ఉండదు. ఖరీదైన మెమరీ కార్డులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.

సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారు 6 నెలల పాటు ఉచితంగా అదనపు క్లౌడ్ స్టోరేజ్‌ను పొందుతారు. గూగుల్‌తో కలిసి ఈ సేవల్ని తీసుకురావడం పట్ల ఎయిర్‌టెల్‌ సీఈఓ సిద్ధార్థ్‌ శర్మ హర్షం వ్యక్తం చేశారు. మార్చి చివరి నాటికి భారతి ఎయిర్‌టెట్‌కు ఇండియాలో మొబైల్ యూజర్ బేస్ 361.6 మిలియన్లుగా ఉంది. అందులో 25.8 మిలియన్ల పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు ఉన్నారు.