100 మాల్స్ టార్గెట్ : అమేజాన్ దుకాణాలు వస్తున్నాయి

  • Publish Date - March 26, 2019 / 06:49 AM IST

ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ దిగ్గజం అమెజాన్‌ ఆఫ్‌లైన్‌ మార్కెట్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా పలు మాల్స్‌లో 100 అమెజాన్‌ కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఆన్‌లైన్‌లో అమ్మే ప్రాడెక్టులనే అమేజాన్ బయట అమ్మాలని నిర్ణయించుకుంది. 

ఈ కియోస్క్‌లలో అమెజాన్‌కు చెందిన కిండ్లె ఈబుక్‌ రీడర్‌, ది ఎకో స్పీకర్‌, ఫైర్‌ టీవీ డోంగల్‌ వంటివి అందుబాటులో ఉంచనున్నారు. అమేజాన్ ఆఫ్‌లైన్‌ మార్కెట్లోకి రావడానికి రెండేళ్ల క్రితమే బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్‌లలో మాల్‌లను పరిశీలించింది. రెండిటిని బెంగళూరులో, ఒకదానిని ముంబైలో, మరో దానిని అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసింది. గత వారమే నోయిడాలోని లాజిక్స్‌ మాల్‌లో ఐదో కియోస్కిని అమేజాన్ ఏర్పాటు చేసింది. 

అమెజాన్‌ కియోస్క్‌కి దాదాపు 70-80 చదరపు అడుగుల స్థలం అవసరం కాగా భవిష్యత్తు కస్టమర్లను బట్టి మార్కెట్‌ను పెంచుకుంటామని అమేజాన్ ప్రతినిధులు చెబుతున్నారు. కియోస్క్‌ల దగ్గరకు కస్టమర్లు వచ్చి కిండ్లె ఈబుక్‌ రీడర్‌, ది ఎకో స్పీకర్‌, ఫైర్‌ టీవీ డోంగల్‌ వంటి పరికరాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవచ్చునని అమేజాన్ చెబుతుంది. అక్కడ వారి సందేహాలు తీరాక వాటిని కొనుక్కోవచ్చు. అమెరికాలో దాదాపు 80 వరకు కియోస్క్‌లను అమేజాన్ ఇప్పటికే ఏర్పాటు చేసింది.