Apple Foldable iPhone Duo : వామ్మో.. ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ ధరతో ఈ కార్లు కొనేయొచ్చు..
Apple Foldable iPhone Duo : ఆపిల్ తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అయిన ఐఫోన్ డ్యూయోను విడుదల చేసింది. అయితే, ఈ ఐఫోన్ డ్యూయో 2టీబీ ధర రూ.4.49లక్షలుగా ఉంది. ఈ ధరతో భారతదేశంలో పలు కార్లను కొనుగోలు చేయొచ్చునని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
- Harish Thanniru
- Updated on- September 10, 2026 / 02:10 PM IST
Apple foldable iPhone Duo
Apple Foldable iPhone Duo : మడతపెడితే అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్.. తెరిస్తే కళ్లముందు చిన్నసైజు ఐప్యాడ్.. అద్భుత ఫీచర్లతో యాపిల్ సంస్థ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను ‘ఐఫోన్ డ్యూయో’ పేరుతో టెక్ ప్రియులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఐఫోన్ డ్యుయోను తెరిస్తే 7.6 అంగుళాల ఇన్నర్ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే కనిపిస్తుంది. ఐఫోన్‌లో ఇప్పటివరకు వచ్చిన వాటిలో ఇదే అతిపెద్ద డిస్‌ప్లే కావటం గమనార్హం. ఫోన్‌ను మూసేస్తే 5.4 అంగుళాల ఔటర్ డిస్‌ప్లే ఉంటుంది. అయితే, దీని ధర కూడా భారీగా ఉంది.
భారత్‌లో ఐఫోన్ డ్యూయో 256GB బేస్ వేరియంట్ ధర రూ.2,99,900గా ఉంది. 512GB మోడల్ రూ.3,24,900, 1TB వేరియంట్ రూ.3,74,900గా ఉంది. ఇక 2TB స్టోరేజ్ ఉన్న టాప్ మోడల్ ధర రూ.4,49,900కు చేరింది. దీంతో ఈ ఫోన్ ధరలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇంత మొత్తం పెట్టి ఫోన్ కొనడం కంటే.. ఇదే బడ్జెట్‌లో భారతదేశంలో కొన్ని కంపెనీలకు చెందిన కార్లను కొనుగోలు చేయొచ్చునని పోలికలు ఆసక్తికరంగా మారాయి.
ప్రస్తుతం మార్కెట్లో రూ. 5లక్షలు, అంతకంటే తక్కువ ధరకు అనేక కంపెనీలకు చెందిన కొత్త కార్లు అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకీ ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso) ధర రూ. 4.50 లక్షలకు తక్కువగానే ఉంది. అదే మారుతి సుజుకీ కంపెనీకి చెందిన మారుతీ సుజుకీ ఆల్ట్రో కె10 (Maruti Suzuki Alto K10) రూ.3.70 నుంచి రూ.4లక్షల వరకు అందుబాటులో ఉంది. మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) ధర కూడా రూ. 4.69 లక్షల నుండి రూ. 6.75 లక్షల వరకు ఉంది. Tata Tiago (టాటా టియాగో) రూ. 4.70 లక్షల నుండి రూ. 8.55 లక్షల వరకు ఉంది. వీటితోపాటు Renault Kwid (రెనాల్ట్ క్విడ్) రూ. 4.53 లక్షలు – 5.60 లక్షలు వరకు ఉంది. వీటితోపాటు WaganR, Citroen C3X ఇలా పలు రకాల కార్లు రూ. 6లక్షలు, అంతకంటే తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి.
