Credit Card: క్రెడిట్ కార్డు వాడకం ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ షాపింగ్ బిల్లులు చెల్లించడం వంటి లావాదేవీలకు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరిగింది. క్రెడిట్ లిమిట్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ షాపింగ్ చేయొచ్చు. అందుకే చాలా మంది యూజర్లు క్రెడిట్ లిమిట్ పెంచమని కార్డు కంపెనీలకు రిక్వెస్ట్ కూడా చేస్తారు. అయితే, చాలా మందికి క్రెడిట్ కార్డు లిమిట్ పెరగకపోగా బ్యాంకులు వారి క్రెడిట్ లిమిట్ తగ్గించేస్తున్నాయి. దీంతో ఎందుకిలా జరుగుతుందనే విషయాలను తెలుసుకునేందుకు కస్టమర్ కేర్, బ్యాంకులను ఆశ్రయిస్తున్న పరిస్థితి. అయితే, క్రెడిట్ కార్డు లిమిట్ తగ్గడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి.
ఈ తప్పులు చేయకండి..
♦ క్రెడిట్ కార్డు లిమిట్ తగ్గడానికి ప్రధానంగా ఐదు కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది బకాయిలు పెరగడం. యూజర్లు క్రెడిట్ కార్డు బకాయిలు చెల్లించడంలో ఆలస్యం చేస్తే, బ్యాంక్ అలాంటి వాళ్లను రిస్కీ కస్టమర్లుగా చూస్తుంది. కస్టమర్ బకాయిలు చెల్లించలేడని భావించి.. క్రెడిట్ లిమిట్ ను తగ్గిస్తుంది.
♦ కొందరు క్రెడిట్ కార్డు మినిమం డ్యూస్ చెల్లించి బాకీని తరువాత నెలకు క్యారీ చేస్తారు. బాకీ మీద వడ్డీ చెల్లిస్తారు కాబట్టి ఒకటి రెండు సార్లు అయితే పర్లేదు.. కానీ, అది అలవాటుగా మారితే యూజర్ బకాయిలు పెరిగిపోతాయి. అప్పుల ఊబిలో చిక్కుకుపోతారు. అప్పుడు లోన్ తిరిగి చెల్లించడం కష్టం అవుతుంది. ఇది కంపెనీకి రిస్క్.. అందుకే సంబంధిత బ్యాంకులు మీ క్రెడిట్ కార్డు లిమిట్ ను అమాంతం తగ్గించేస్తాయి.
♦ కొందరు క్రెడిట్ కార్డుదారులు క్రెడిట్ లిమిట్ ను అవసరానికి మించి వాడతారు. లిమిట్ లో వాడిన అమౌంట్ రేషియోని యుటిలైజేషన్ రేషియో అంటారు. ఈ రేషియో ఎక్కువైతే క్రెడిట్ కార్డు లిమిట్ తగ్గే ఛాన్స్ ఉంది. మీ క్రెడిట్ కార్డు లిమిట్ రూ. లక్ష ఉంటే.. ప్రతినెలా 80 నుంచి 95వేలు వాడారనుకుందాం.. క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఇలాంటి వాళ్లను ఎక్కువగా లోన్లు తీసుకునే రిస్కీ యూజర్లుగా చూస్తాయి. అందుకే లిమిట్ తగ్గిస్తాయి.
♦ కొందరు వరుసగా చాలా క్రెడిట్ కార్డులను తీసుకుంటారు. దీంతో వాళ్ల మొత్తం లిమిట్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. బ్యాంక్ అలాంటి కస్టమర్లను లోన్స్ పై ఎక్కువగా ఆధారపడే వారిగా చూస్తుంది. దీంతో వాళ్లను రిస్కీ యూజర్లుగా భావించి వారి క్రెడిట్ కార్డు లిమిట్ తగ్గించే అవకాశం ఉంటుంది.
♦ క్రెడిట్ కార్డు తీసుకున్న తరువాత కొందరు దాన్ని సరిగ్గా వాడరు. అంటే.. ఎక్కువగా కార్డును యూజ్ చేయరు. అలాంటి కస్టమర్ల లిమిట్ ను కూడా బ్యాంకులు తగ్గిస్తాయి. ఎందుకంటే కార్డు రన్నింగ్ లో ఉంటేనే బ్యాంకులకు లాభం వస్తుంది.