Budget Economic Survey
Budget Economic Survey : ప్రస్తుత రోజుల్లో జంక్ ఫుడ్ వినియోగం భారీగా పెరిగిపోయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎక్కువగా జంక్ ఫుడ్ వినియోగిస్తున్నారు. ఆరోగ్యానికి హాని చేసే ఈ జంక్ ఫుడ్ కు సంబంధించి ఆన్‌లైన్ మార్కెటింగ్ కూడా గట్టిగానే చేస్తుంటాయి ప్రొడక్టుల కంపెనీలు.
అయితే, ఇకపై జంక్ ఫుడ్, అండ్ ప్రకటనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. జనవరి 29న కేంద్ర ఆర్థిక సర్వే సమర్పణ సందర్భంగా ప్రభుత్వం జంక్ ఫుడ్ వినియోగంపై ప్రస్తావించింది.
అధిక కొవ్వు, చక్కెరతో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (UPF) వినియోగం భారీగా పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రకటనలపై నియంత్రణ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం సూచించింది. ఇకపై ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు జంక్ ఫుడ్ ప్రకటనలను బ్యాన్ చేయాలని ఆర్థిక సర్వే సూచించింది. ముఖ్యంగా శిశువులు, పసిపిల్లల పాలు, పానీయాల మార్కెంట్ పై కూడా పరిమితులు విధించాలని పేర్కొంది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సర్వేలో అత్యంత ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ వినియోగంపై నియంత్రణ చర్యల అంశంపై ఆమె ప్రస్తావించారు. పిజ్జా, నూడుల్స్, బర్గర్, సాఫ్ట్ డ్రింక్ వంటి జంక్ ఫుడ్ కారణంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపారు.
దేశీయంగా ఈ జంక్ ఫుడ్ వినియోగం 2009 నుంచి 2023 వరకు 150శాతానికి పైగా పెరిగింది. భారత మార్కెట్లో ప్రాసెస్ చేసిన ఫుడ్ రిటైల్ అమ్మకాలు 2006లో 0.9 బిలియన్ డాలర్ల నుంచి 2019 నాటికి దాదాపు 38 బిలియన్ డాలర్ల (40 రెట్లు)కు పెరిగాయి.
ఇదే సమయంలో పురుషులు, మహిళల్లో ఊబకాయం దాదాపు రెట్టింపు అయిందని సర్వే తెలిపింది. ఆహార వ్యవస్థల్లో పాలనపరమైన విధానాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అంతేకాదు.. జంక్ ఫుడ్ ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి ప్రకటనలను పూర్తిగా నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థిక సర్వే సూచించింది.
సాధారణంగా మీడియా ప్రసారాల్లో ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు జంక్ ఫుడ్ వినియోగంపై ప్రకటనలను నిషేధించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక సర్వే సూచించింది. ముఖ్యంగా శిశువులు, పసిపిల్లల, పానీయాల మార్కెటింగ్‌పై పరిమితులు విధించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా సూచించింది.
సాంప్రదాయ మీడియాతో పాటు, డిజిటల్ మీడియాలో కూడా యూపీఎఫ్ మార్కెటింగ్ పరిమితులు తప్పనిసరిగా సర్వే సిఫార్సు చేసింది. ప్రస్తుతం స్పష్టమైన పోషక పరిమితులు, ఆహార మార్కెటింగ్‌లో తప్పుదారి పట్టించే ప్రకటనలను గుర్తించే ఒక ఫ్రేమ్‌వర్క్ లేదని సర్వే పేర్కొంది.
నార్వే, యూకేలో జంక్ ఫుడ్ ప్రకటనలు బ్యాన్ :
మరోవైపు.. జంక్ ఫుడ్ నియంత్రణకు సంబంధిచి సమగ్ర చట్టాలను అమలు చేసే దేశాల్లో చిలీ ఒకటి.. నార్వే, యూకే వంటి ఇతర దేశాలలో కూడా జంక్ ఫుడ్ ప్రకటనలపై పరిమితులు అమలులో ఉన్నాయి.
ఇటీవలే పిల్లలలో స్థూలకాయాన్ని అరికట్టడానికి యూకే రాత్రి 9 గంటలకు ముందు టీవీ, ఆన్‌లైన్‌లో జంక్ ఫుడ్ ప్రకటనలను నిషేధించింది. యూపీఎఫ్ తయారీదారుల ద్వారా స్కూల్, కాలేజీ స్పాన్సర్‌షిప్ ఈవెంట్‌లతో సహా ఇతర మార్కెటింగ్ కార్యకలాపాలపై కూడా కఠిన చర్యలను రూపొందించనుంది.