Budget Facts 2026
Budget Facts 2026 : కేంద్ర బడ్జెట్ 2026 మరోసారి చరిత్ర సృష్టించనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026న పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి ఆదివారం బడ్జెట్ ప్రారంభం కానుంది. దాదాపు 26 ఏళ్లలో ఆదివారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే ఫస్ట్ టైమ్.. గతంలో, 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఫిబ్రవరి 28న ఆదివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
పార్లమెంట్ సాధారణంగా ఆదివారాల్లో సమావేశం కాదు. కానీ, జాతీయ ప్రాముఖ్యత దృష్ట్యా ఈసారి కూడా బడ్జెట్ సమావేశాలు ఆదివారం జరుగుతాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజున దేశ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆమె వరుసగా 9వ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా బడ్జెట్ వర్కింగ్ డేస్ లేదా శనివారాల్లో ప్రవేశపెడతారు. కానీ, ఈసారి, ఫిబ్రవరి 1 ఆదివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఫస్ట్ బడ్జెట్ ఎప్పుడు సమర్పించారంటే? :
గత కొన్ని ఏళ్లుగా ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నప్పటికీ గతంలో ఇలా ఉండేది కాదు. భారత మార్కెట్లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్‌ను నవంబర్ 26, 1947న ప్రవేశపెట్టారు. ఆ సమయంలో దేశ తొలి ఆర్థిక మంత్రి ఆర్.కే. షణ్ముఖం చెట్టి పార్లమెంటులో ప్రవేశపెట్టారు. తదనంతరం, బడ్జెట్ తేదీ సమయం కాలక్రమేణా అనేకసార్లు మార్చారు.
2016 వరకు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే ఫిబ్రవరి 28న బడ్జెట్‌ను ప్రవేశపెట్టేది. ఈ సంప్రదాయాన్ని 2017లో మార్చారు. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. ఇలా మార్చేందుకు అసలు కారణం మంత్రిత్వ శాఖలు, విభాగాలకు బడ్జెట్ ప్రకటనలు అమలు చేసేందుకు తగినంత సమయం అవసరం. గతంలో, బడ్జెట్ ఆలస్యం కారణంగా ఏప్రిల్‌లో అనేక పథకాలను సకాలంలో అమలు చేయలేకపోయారు.
గతంలో బడ్జెట్ సాయంత్రం 5గంటలకు ఉండేది :
బడ్జెట్ తేదీ మారడమే కాదు.. సమయం కూడా మారింది. చాలా కాలంగా బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు సమర్పించేవారు. అప్పట్లో భారత్, బ్రిటన్ మధ్య సమయం ఆధారంగా ఉండేది. ఈ ఆచారం బ్రిటిష్ కాలం నాటిది. అయితే, 1999లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఈ సంప్రదాయాన్ని ముగించి ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పటినుంచి బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు ప్రవేశపెడుతున్నారు.
బడ్జెట్ ఫోకస్ ఏంటి?
2026 బడ్జెట్ విషయానికొస్తే.. ఈ ఏడాది బడ్జెట్ అన్ని రంగాల వారికి చాలా ప్రత్యేకంగా మారింది. ఈసారి ఆదివారం సమర్పించే బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థ దిశను నిర్ణయిస్తుంది. రైల్వేలు, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి, తయారీ, ఆటో రంగం, రక్షణ, ఎలక్ట్రానిక్స్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు, పునరుత్పాదక ఇంధనం, కృత్రిమ మేధస్సు వంటి రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు.