×
Ad

టోల్ ప్లాజాల వద్ద ఇప్పటికీ నగదు చెల్లిస్తున్నారా? మీకో షాకింగ్ న్యూస్

ప్రయాణికులు తమ ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ట్యాగ్ యాక్టివ్‌గా ఉందా? తగిన బ్యాలెన్స్ ఉందా? అన్నది నిర్ధారించుకోవాలి.

FASTag (Image Credit To Original Source)

  • నగదు చెల్లింపులకు స్వస్తి!
  • ఏప్రిల్ 1 నుంచి అమలు?
  • సన్నాహాలు చేసుకుంటున్న కేంద్రం

FASTag: హైవేల్లో ప్రయాణం చేసేవారిలో కొంతమంది టోల్‌ ప్లాజాల వద్ద ఇప్పటికీ నగదు చెల్లింపులే చేస్తున్నారు. దీనికి స్వస్తి పలుకుతూ ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారి టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులపై నిషేధాన్ని అమలు చేయడానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రయాణికులు అలర్ట్‌గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొస్తే ప్రయాణికులు టోల్ చెల్లింపులకు ఫాస్ట్‌ట్యాగ్ లేదా యూపీఐ ఉపయోగించాల్సి ఉంటుంది.

టోల్‌ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకోనున్నారు. నగదు చెల్లింపుల రద్దు నిర్ణయంపై ఇప్పటివరకు అధికారిక నోటిఫికేషన్ వెలువడలేదు. ఈ మార్పులు అమల్లోకి తీసుకొస్తే టోల్‌ ప్లాజాల వద్ద పొడవైన క్యూలు ఉండవని, వాహనదారులు మరింత సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చని కేంద్ర సర్కారు భావిస్తోంది.

మార్పునకు కారణం ఏమిటి?
ఈ కొత్త నిబంధనతో ప్రభుత్వం పలురకాల సమస్యలకు పరిష్కారం చూపాలనుకుంటోంది. టోల్‌ ఫీజు చెల్లిస్తున్న వేళ సరైన చిల్లర ఇచ్చే క్రమంలో కాస్త సమయం పడుతుంది. అలాంటి సమస్యలు రాకుండా చూడడం, మాన్యువల్ రసీదుల అవసరం లేకుండా చేయడం వంటివాటిని కేంద్ర సర్కారు దృష్టిలో ఉంచుకుని నగదు చెల్లింపుల విధానానికి స్వస్తి పలుకుతోంది.

నగదు చెల్లించేందుకు టోల్ బూత్‌ల వద్ద వాహనాలు కాస్త ఎక్కువ సమయం ఆగుతాయి. నగదు చెల్లింపులను తీసేస్తే త్వరగా అందరూ ఫాస్ట్‌ట్యాగ్‌ వాడతారు. దీంతో వాహనాలు త్వరగా వెళ్లిపోతాయి. దీంతో డీజిల్, పెట్రోల్ వినియోగం తగ్గుతుంది. డిజిటల్ చెల్లింపుల వల్ల టోల్‌ ఫీజుల లావాదేవీలకు సంబంధించిన అన్ని వివరాలను రికార్డు చేసుకోవచ్చు. దీని వల్ల పారదర్శకత పెరుగుతుంది.

ప్రయాణికులు తమ ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ట్యాగ్ యాక్టివ్‌గా ఉందా? తగిన బ్యాలెన్స్ ఉందా? అన్నది నిర్ధారించుకోవాలి. ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగించని వారికి టోల్ ప్లాజాల వద్ద సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే యూపీఐ చెల్లింపులకు స్మార్ట్‌ఫోన్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి.