పసిడి ధరల పెరుగుదలపై గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్‌స్టిట్యూషన్ “సిటీ” అంచనాలను సవరించింది. రాబోయే మూడు నెలల్లో బంగారం ధరలు ఔన్సుకి $3,200కి చేరుకుంటాయని చెప్పింది. ఈ పెరుగుదల వెనుక మూడు ప్రధాన కారణాలు ఉంటాయని తెలిపింది. మొదటిది.. చైనా ఆధ్వర్యంలో కేంద్ర బ్యాంకుల నుంచి డిమాండ్ బాగా ఉండడం.
రెండోది.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఇది పెట్టుబడిదారులను సురక్షితమైన పెట్టుబడుల వైపుగా ఆకర్షిస్తోంది. మూడో కారణం.. పెట్టుబడిదారుల నుంచి అధిక పెట్టుబడులు రావడం. ఈ అంశాలన్నీ కలిపి బంగారం ధరను గరిష్ఠ స్థాయికి తీసుకువెళ్తున్నాయి.
గత సంవత్సరంలో బంగారం ధర 50% పెరిగి $3,000కు చేరుకుంది. దీని వెనుక ప్రధానంగా చైనా సహా పలు దేశాల కేంద్ర బ్యాంకుల నుంచి కొనుగోళ్లు భారీగా పెరగడం కారణమైంది. అలాగే ప్రపంచ ఆర్థిక వృద్ధి, ఆస్తి మార్కెట్లపై టారిఫ్‌ల ప్రభావాన్ని తగ్గించేందుకు పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి చూపుతున్న కారణంగా ధరల పెరుగుదల కనిపించింది.
Also Read: బంగారం కొంటున్నారా? ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాల్సిందే..
“సిటీ” తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న బుల్ మార్కెట్ స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే టారిఫ్‌లు, భౌగోళిక అనిశ్చితి వంటి అంశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గోల్డ్ కొనుగోళ్లను పెంచుతాయి.
అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడితే లేదా స్థిర ద్రవ్యోల్బణం ఉంటే 2025 చివరిలోగా బంగారం ధర ఔన్సుకు $3,500ను తాకవచ్చు. అయితే, అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటే కూడా, బంగారం ధర $2,500-$2,600 పరిధిలో ఉంటుందని “సిటీ” అంచనా వేస్తోంది. 2025 చివరినాటికి బంగారం ధర ఔన్సుకు $3,000 పైగానే కొనసాగుతుందని సిటీ భావిస్తోంది. మైనింగ్ ద్వారా అందుబాటులోకి వచ్చే మొత్తం గోల్డ్ సరఫరాలో 90% పైగా పెట్టుబడిదారుల కొనుగోళ్లు ఉంటాయని అంచనా.
గోల్డ్‌లో పెట్టుబడిదారులకు “సిటీ” సలహాలేంటి?
ధరలు భారీగా తగ్గితే, కొనుగోలు చేయడం మంచిదని సిటీ సూచిస్తోంది. అలాగే ప్రస్తుత గోల్డ్ బుల్ మార్కెట్ స్థిరంగా కొనసాగే అవకాశం ఉండడంతో దీర్ఘకాలిక పెట్టుబడులు సురక్షితంగా ఉండొచ్చు.