Gold Prices: బంగారం కొంటున్నారా? ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాల్సిందే..

ఏఎంఎఫ్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరిలో బంగారం ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెరిగాయి.

Gold Prices: బంగారం కొంటున్నారా? ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాల్సిందే..

Updated On : March 20, 2025 / 6:30 PM IST

గతంలో ఎన్నడూలేని విధంగా బంగారం ధరలు 2025లో 13 సార్లు గరిష్ఠ స్థాయులకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధర ఔన్సుకు 3,000 డాలర్లను దాటింది. పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ బాగా ఉండడం, ఆర్థిక అనిశ్చితి, బలహీనమైన డాలర్, వడ్డీ రేట్ల తగ్గింపు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.

ఈ ఏడాది ఇప్పటివరకు ఇండియా రేటు 17% పెరిగి పది గ్రాములకు రూ.88,946 చేరింది. రూపాయి బలహీనత (1.3% క్షీణత) వల్ల ఈ అధిక లాభాలు నమోదయ్యాయి. అయితే, ఆభరణాల డిమాండ్ మందగించడంతో దేశీయ బంగారం ల్యాండెడ్ ధర (విదేశాల్లో నుంచి దేశీయ మార్కెట్లోకి తీసుకురావడానికి అయ్యే మొత్తం ఖర్చు) పెరిగింది.

ఈ నెల దేశీయ, ల్యాండెడ్ ధరల మధ్య  వ్యత్యాసం సగటున $12/ఔన్సుగా ఉంది. ఇది ఫిబ్రవరిలో ఉన్న ధర ($17/ఔన్సు) కంటే తక్కువ. 2025లో ఇప్పటివరకు బంగారం 13% లాభాలు నమోదు చేసింది. దేశీయ ఈక్విటీలు నష్టాలను చవిచూసినప్పటికీ, బాండ్లు, బ్యాంక్ డిపాజిట్ల లాభాలను మించిపోయింది. పెట్టుబడిదారులు బంగారంపై వ్యూహాత్మకంగా ఎలా పెట్టుబడులు పెడుతున్నారో ఇది తెలుపుతోంది.

అధిక ధరల కారణంగా ఆభరణాల కొనుగోళ్లు తగ్గాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల వంటి వేడుకల వేళ మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. ఆర్థిక సంవత్సరాంతానికి సంబంధించిన చెల్లింపులు, పన్ను పొదుపు పెట్టుబడులు వంటివి వ్యయాలను నియంత్రిస్తున్నాయి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో బంగారం డిమాండ్ తగ్గింది. వినియోగదారులు ధరలు తగ్గే వరకు వేచి చూస్తున్నారు.

బంగారం ధరల పెరుగుదల పాత బంగారం అమ్మకాలకు దారితీస్తోంది. రిటైలర్లు ఇదే విషయాన్ని చెబుతున్నారు. అలాగే, బంగారం ఆభరణాలపై రుణాలు గణనీయంగా పెరిగాయి. జనవరి నెల ముగింపు సమయానికి వాణిజ్య బ్యాంకుల ద్వారా బంగారం రుణాలు వార్షిక ప్రాతిపదికన 77% పెరిగాయి.

ఏఎంఎఫ్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరిలో బంగారం ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెరిగాయి. ఫిబ్రవరిలో ఆర్‌బీఐ బంగారం కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. 2024 ప్రారంభం నుంచి ఆర్‌బీఐ బంగారం నిల్వలను స్థిరంగా పెంచుతోంది. ఫిబ్రవరిలో బంగారం నిల్వలు 879 టన్నుల వద్ద స్థిరంగా ఉన్నప్పటికీ, మొత్తం ఫారెక్స్ నిల్వలలో బంగారం వాటా 11.5%కు పెరిగింది, ఇది చరిత్రలో అత్యధిక స్థాయి.

ఫిబ్రవరిలో బంగారం దిగుమతులు 2024 మార్చి నుంచి ఎన్నడూలేనంత కనిష్ఠ స్థాయికి చేరాయి. న‌వంబ‌ర్‌లో ఉన్న గ‌రిష్ఠ స్థాయుల‌తో పోలిస్తే 63% పతనమైంది. ఫిబ్రవరిలో బంగారం దిగుమతి బిల్లు $2.3 బిలియన్‌గా ఉంది. బంగారం ధరల పెరుగుదల పలు మార్గాల్లో భారతదేశ మార్కెట్‌ను ప్రభావితం చేస్తోంది. పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతుండగా, ఆభరణాల కొనుగోళ్లు మందగించాయి.