Gold
Gold jewellery : విదేశాల నుంచి బంగారాన్ని పరిమితికి మించి నిబంధనలకు విరుద్ధంగా స్వదేశానికి తీసుకొస్తూ పట్టుబడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చే మహిళలు 40గ్రాములు (రూ.లక్ష విలువైన) బంగారంను, పురుషులు 20 గ్రాములు (రూ.50వేల విలువైన) ఆభరణాలు మాత్రమే ఎలాంటి సుంకం లేకుండా స్వదేశానికి తీసుకొచ్చుకొనే వీలుంది.
ప్రస్తుతం బంగారం ధర భారీగా పెరిగింది. 10గ్రాముల ధర రూ.2లక్షల వరకు చేరువైంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి బంగారు ఆభరణాలు తెచ్చుకునేందుకు గరిష్ఠ పరిమితిని పెంచింది. ఇందుకోసం బ్యాగేజ్ నిబంధనలు-2026 అమల్లోకి తీసుకొచ్చింది.
విదేశాల నుంచి విమానం లేదా సముద్ర మార్గాల్లో మన దేశానికి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2016 నాటి పాత నిబంధనల స్థానంలో రూపొందించిన బ్యాగేజీ నిబంధనలు -2026 ఈనెల 2వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) సోమవారం తెలిపింది.
బ్యాగేజీ నిబంధనలు -2026 ద్వారా విదేశాల నుంచి తిరిగి వచ్చే భారతీయ నివాసితులు, విదేశాల్లో స్థిరపడిన భారత సంతతి పర్యాటకులు లేదా పర్యాటక వీసా కాకుండా ఇతర వీసాలపై వచ్చే విదేశీయులు, తమ వెంట తీసుకొచ్చే రూ.75వేల విలువైన వస్తువులపై కస్టమ్స్ సుంకం మినహాయింపు ఉంటుంది. గతంలో ఈ పరిమితి రూ.50వేలు ఉండగా.. ప్రస్తుతం కొత్త నిబంధనల ప్రకారం.. వ్యక్తిగత వినియోగం కోసం రూ.75వేలు విలువైన వస్తువులను కస్టమ్స్ సుంకం చెల్లించకుండానే స్వదేశానికి తీసుకురావచ్చు. అయితే, రెండేళ్లలోపు వయస్సు కలిగిన పిల్లలకు ఈ మినహాయింపు వర్తించదు. అయితే, విదేశీ పర్యాటకులకు కూడా ఈ నిబంధనల్లో ప్రత్యేక పరిమితిని విధించారు. వాయు లేదా సుమద్ర మార్గంలో భారతదేశానికి వచ్చే విదేశీ పర్యాటకులు రూ.25వేల వరకు విలువైన వస్తువులను సుంకం లేకుండా భారతదేశంలోకి తీసుకురావొచ్చు.
బంగారు ఆభరణాల విషయానికొస్తే .. మహిళా ప్రయాణికులు 40 గ్రాముల వరకు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను సుంకం లేకుండా తీసుకురావచ్చునని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, వీరు ఏడాదికిపైగా విదేశాల్లో నివసిస్తూ తిరిగి వస్తున్న వారు లేదా భారత సంతతి పర్యాటకులై ఉండాలి. అయితే, ఈ ఆభరణాలు కచ్చితంగా వ్యక్తిగత వినియోగం కోసం తీసుకురావాలి. బిస్కెట్లు, కడ్డీల రూపంలో ఉండే బంగారంకు మినహాయింపు ఉండదు.
ఎక్ట్రానిక్ వస్తువుల విషయానికొస్తే.. 18ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న ప్రయాణికులు అదనంగా ఒక కొత్త ల్యాప్‌టాప్ లేదా నోట్ ప్యాడ్‌ను సుంకం లేకుండా తమ లగేజీలో తీసుకురావచ్చు. ప్రమయాణంలో వ్యక్తిగత అవసరాల కోసం తెచ్చుకునే పాత వస్తువులపై అంటే దుస్తులు, ఇతర పరికరాలపై ఎలాంటి సుంకం ఉండదు.