Elon Musk’s Starlink: మస్క్ కి షాక్.. ఇండియాలో స్టార్ లింక్ మీద పన్ను?

డీసీసీ అనుమతులు వచ్చిన అనంతరం కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.

ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌తో భారత్‌లోని రిలయన్స్ జియో జట్టు కట్టిన విషయం తెలిసిందే. యూజర్లకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ సర్వీసులను అందించేందుకు ఎయిర్‌టెల్ కూడా స్టార్‌లింక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

దేశంలో స్టార్‌లింక్‌కు అనుమతులు రావడంతో జియో ఆ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఎన్నో షరతులను ఎదుర్కొని దేశంలోకి ప్రవేశించిన స్టార్‌లింక్‌కు ఇప్పుడు పన్నుల రూపేణా ఛాలెంజ్‌ ఎదురవుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

దేశంలో స్టార్‌లింక్‌ సర్వీసులకు స్పెక్ట్రమ్‌ ట్యాక్స్ వేసే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ట్యాక్స్‌ వేస్తే భారత్‌లో శాట్‌కామ్‌ వెంచర్‌కు సేవల ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది. ఇటీవలే మన దేశానికి చెందిన రిలయన్స్‌ జియోతో పాటు ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా స్పెక్ట్రమ్‌ ట్యాక్సును రద్దు చేశారు.

భారత్‌లో 2023 డిసెంబర్‌లో ఆమోదించిన కొత్త టెలికాం చట్టానికి అనుగుణంగా ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అడ్మినిస్ట్రేటివ్‌ కేటాయింపుల ద్వారా టెలికాం ఎయిర్‌వేవ్‌లను కేటాయించే స్టార్‌లింక్‌కు దేశం నుంచి వచ్చే సర్దుబాటు చేసిన స్థూల ఆదాయంలో దాదాపు 3% స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జ్ (ఎస్‌యూసీ)ని చెల్లించాల్సి ఉంటుందని చెప్పాయి.

Also Read: ఇలా చేస్తే భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణం తలంబ్రాలు మీ ఇంటికే వస్తాయ్..

వేలానికి బదులుగా ఉపగ్రహ ఆపరేటర్లకు నేరుగా దాన్ని కేటాయిస్తున్నారని అన్నాయి. దీంతో స్టార్‌లింక్‌కు ఎస్‌యూసీ వర్తిస్తుందని, దీనికి సంబంధించిన తుది రేట్లను నిర్ణయించడంపై కసరత్తు జరుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. టెల్కోలు చెల్లింపులు చేసే 8% లైసెన్సు రుసుం మాత్రమే కాకుండా శాట్‌కామ్‌ ఆపరేటర్లు స్పెక్ట్రమ్‌ కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని అన్నాయి.

ఈ ఛార్జీలతో పాటు శాటిలైట్‌ స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కాలవ్యవధి, తదితర విషయాలపై కూడా ట్రాయ్‌ చర్చలు జరుపుతోంది. ఈ చర్చల అనంతరం నిర్ణయం తీసుకుని స్పెక్ట్రమ్‌ కేటాయింపు కోసం ప్రతిపాదనలను టెలికాం విభాగానికి పంపుతారు. టెలికాం అధికారులు దాన్ని పరిశీలించి డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌కు దాన్ని పంపుతారు. డీసీసీ అనుమతులు వచ్చిన అనంతరం కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.