ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడిదారులకు ‘అషికా గ్లోబల్ ఫ్యామిలీ ఆఫీస్ సర్వీసెస్’ సంస్థ పలు సూచనలు చేసింది. ప్రపంచ రాజకీయ, భౌగోళిక అనిశ్చిత పరిస్థితుల మధ్య బంగారంపై పెట్టుబడులను పెంచాలని సూచించింది. కరెన్సీల విలువలు పతనమైనపుడు, ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు గోల్డ్‌పై పెట్టుబడి రక్షణగా నిలుస్తుందని తెలిపింది.
అషికా గ్లోబల్ సంస్థ భారతీయ ఈక్విటీ మార్కెట్ల పట్ల ఆశావహ దృక్పథంతో ఉంది. ముఖ్యంగా పెద్ద కంపెనీల షేర్ల (లార్జ్-క్యాప్ స్టాక్స్), కొన్ని అధిక వృద్ధి రేటు కలిగిన మధ్య స్థాయి సంస్థల (మిడ్-క్యాప్)ల్లో ఉన్న అవకాశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే, అమెరికా టెక్నాలజీ స్టాక్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఎందుకంటే ఆ రంగంలో వాల్యుయేషన్ మరీ ఎక్కువగా ఉండటం వల్ల సమీప భవిష్యత్తులో పతనమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
‘అషికా గ్లోబల్ ఫ్యామిలీ ఆఫీస్ సర్వీసెస్’ చెప్పిన వివరాల ప్రకారం.. భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. దేశంలోని యువ జనాభా, పెరుగుతున్న మధ్యతరగతి ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $5.6 ట్రిలియన్‌కి చేరుకుని, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌గా మారింది. 2024-25 ఆర్థిక ఏడాదిలో భారత్ 7% జీడీపీ వృద్ధిరేటును సాధించనుంది. దేశంలోని 6,000కి పైగా లిస్టెడ్ కంపెనీలు, 90 లక్షల చిన్న, మధ్య తరహా సంస్థలు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి.
Also Read: శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఐటీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం
2024 సంవత్సరంలోనే భారతీయ కంపెనీలు మూలధన మార్కెట్ల (క్యాపిటల్ మార్కెట్లు) ద్వారా $40 బిలియన్ నిధులను సమీకరించాయి. ఇది పెట్టుబడిదారుల విశ్వాసానికి ఉదాహరణగా నిలుస్తోంది. అంతేకాకుండా, 2024లో భారత్‌కు విదేశీ రిమిటెన్సులు (ప్రవాసుల ద్వారా పంపిన డబ్బు) $124 బిలియన్‌గా నమోదయ్యాయి.
దేశ ఆర్థిక వ్యవస్థ బలం పెరుగుతోందని దీన్ని బట్టి తెలుస్తోంది. 2020 నుంచి బంగారంతో పాటు రియల్ ఎస్టేట్ ధరలు 80% నుంచి 150% మధ్య పెరిగాయి. అంతర్జాతీయ కేంద్ర బ్యాంకులు అమెరికా ట్రెజరీలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, బంగారం నిల్వలను 30 ఏళ్ల గరిష్ఠ స్థాయికి పెంచాయి.
పెరుగుతున్న అప్పులు
అమెరికా ప్రభుత్వం ఆర్థికంగా అస్థిరతను ఎదుర్కొంటోంది. ఫెడరల్ రుణం ప్రస్తుతం $36 ట్రిలియన్లను దాటింది. కేవలం ఒక సంవత్సరంలోనే $4 ట్రిలియన్ పెరిగింది. 2025 నాటికి అమెరికా ప్రభుత్వ ఆదాయంలో 28% కేవలం వడ్డీ చెల్లింపులకు వెళ్లే అవకాశం ఉంది. ఇది దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వ గురించి ఆందోళనలను కలిగిస్తోంది.
అమెరికా స్టాక్ మార్కెట్ విలువలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. నాస్‌డాక్-100 ప్రస్తుతానికి 34 P/E నిష్పత్తి వద్ద ట్రేడవుతోంది. అంటే దాని ఎర్నింగ్ యీల్డ్ కేవలం 2.9% మాత్రమే. రస్సెల్ 2000 సూచికలోని కంపెనీలలో దాదాపు 45% నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.
మరోవైపు, రష్యా-యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా రష్యా రిజర్వుల నుంచి $300 బిలియన్‌ను ఫ్రీజ్ చేయడం గ్లోబల్ మార్కెట్లలో ఆందోళనలకు కారణమైంది. ఈ చర్య ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు ఒక హెచ్చరికగా మారింది. దీంతో వారు డాలర్-ఆధారిత ఆస్తులపై తమ పెట్టుబడులను తిరిగి పరిశీలిస్తున్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. బంగారం, భారతీయ స్టాక్స్ వంటి ఆస్తులు గణనీయమైన వృద్ధిని కనబరుస్తుండగా, అమెరికా స్టాక్ మార్కెట్, డాలర్-ఆధారిత ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈ మార్పులను గమనిస్తూ, తమ వ్యూహాలను పునఃసమీక్షించుకోవడం అవసరం ఎంతైనా ఉంది.