Gold and Silver prices fall : యుద్ధం వేళ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి..? అసలు కారణాలివే..

Gold and Silver prices fall : అంతర్జాతీయంగా దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సమయంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతుంటాయి. అయితే, ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది.

Why are gold and silver prices not rising despite the West Asia war

  • తగ్గుతున్న బంగారం, వెండి ధరలు
  • పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ తగ్గుతున్న రేట్లు
  • గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గడానికి కారణాలివే..

Gold and Silver prices fall : అంతర్జాతీయంగా దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సమయంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతుంటాయి. అయితే, ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తోంది. ఇరాన్ సైతం ఇజ్రాయెల్ తోపాటు గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతోపాటు.. నిత్యావసర వస్తువుల ధరలపైనా యుద్ధ ప్రభావం పడింది. కానీ, బంగారం, వెండి ధరలు మాత్రం తగ్గుతున్నాయి.

Also Read : Gold Price Today : బంగారం ప్రియులకు ఎగిరిగంతేసే శుభవార్త.. గంటల వ్యవధిలోనే గోల్డ్, సిల్వర్ రేట్లలో భారీ మార్పులు.. నేటి ధరలు ఇవే..

అంతర్జాతీయ ఉద్రిక్తతల సమయంలో బంగారం, వెండిని సురక్షితమైన పెట్టుబడిగా ఇన్వెస్టర్లు భావిస్తారు. అయితే, ప్రస్తుతం పశ్చిమాసియా సంఘర్షణల నేపథ్యంలో వాటి ధరలు తగ్గుతున్నాయి. 2025లో బంగారం, వెండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నఅన్ని ఆదాయ మార్గాలకంటే అసాధారణ రాబడులను అందించాయి. 2025 సంవత్సరంలో వెండి 165 శాతానికిపైగా.. బంగారం 75శాతానికిపైగా పెరిగింది. ఈ సానుకూల ధోరణి 2026 సంవత్సరం ప్రారంభంలోనూ కొనసాగింది. జనవరి చివరిలో బంగారం ధరలు ఔన్సు కు 5,500 డాలర్ల ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరగా.. వెండి ఔన్సు కు 121డాలర్ల రికార్డు స్థాయికి ఎగబాకింది.

2025 సంవత్సరంలో బంగారం, వెండికి భారీగా డిమాండ్ నెలకొనడంతో పెట్టుబడిదారులు, కేంద్ర బ్యాంకులు వీటి కొనుగోళ్లకు ఎక్కువ ఆసక్తి చూపాయి. కానీ, చమురు ధరలు, ద్రవ్యోల్బణ ప్రమాదాలను పెంచిన పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి బంగారం, వెండి ధరలు 22శాతం వరకు తగ్గాయి. యాక్సిస్ సెక్యూరిటీస్ డేటా ప్రకారం.. యుద్ధం ప్రారంభం నాటినుంచి బంగారం ధరలు 10శాతానికి పైగా తగ్గగా, వెండి ధరలు 22 శాతానికి పైగా తగ్గాయి.

పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రమవడంతో చమురు మార్కెట్లలో సరఫరా అంతరాయాలు ఆర్థిక అనిశ్చితికి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దోహదపడ్డాయి. అంతేకాక యూఎస్ డాలర్‌ను బలోపేతం చేశాయి. యాక్సిస్ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ దేవేయ గగ్లానీ మాట్లాడుతూ.. యుద్ధం ప్రతి దేశాన్ని ప్రభావితం చేసిందని, దాని ఫలితంగా ఏర్పడిన ఆర్థిక స్తబ్దత డాలర్‌కు బలాన్నిచ్చిందని అన్నారు. బలమైన డాలర్, విలువైన లోహాల ధరలను ప్రభావితం చేసే కీలక శక్తిగా ఆవిర్భవించిందని ఆయన చెప్పారు.

అనలిస్ట్ దేవేయ గగ్లానీ ప్రకారం.. యుద్ధం వేళ ఇరాన్ సామర్థ్యాన్ని అమెరికా కూడా తప్పుగా అంచనా వేసింది. టెహ్రాన్ ప్రతీకార చర్యలు, హోర్ముజ్ జలసంధి మూసివేత ద్రవ్యోల్బణ ఆందోళనలను పెంచాయి. దాని ఫలితంగా ఈ ఏడాది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు తగ్గాయని ఆయన తెలిపారు. దీనివల్ల యూఎస్ డాలర్ విలువ పెరిగి, బులియన్ ధరలపై ఒత్తిడి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా గరిష్ట స్థాయి నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం గరిష్ట స్థాయి నుంచి బంగారం ధరలు 16 శాతానికి పైగా పడిపోయి, ఏప్రిల్ 7వ తేదీ నాటికి ఔన్సుకు సుమారు 4,680 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. వెండి ధరలు భారీగా పడిపోయి, 35 శాతానికి పైగా క్షీణించి, ఔన్సుకు సుమారు 74 డాలర్లకు చేరాయి.

వెండి విషయంలో.. పారిశ్రామిక కార్యకలాపాలకు అంతరాయం కలిగినప్పుడు వెండికి డిమాండ్ తగ్గుతుంది. అందుకే ఇది కేవలం సురక్షిత ఆస్తిగా కాకుండా ఒక పారిశ్రామిక సరుకులా వెండిని చూస్తారు. అంచనాల ప్రకారం.. ప్రపంచ వెండి డిమాండ్‌లో దాదాపు 60శాతం పారిశ్రామిక కార్యకలాపాల ద్వారానే వినియోగిస్తారు. ఈ లోహాన్ని ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెళ్లు, ఆటోమొబైల్స్, సెమీకండక్టర్ల వంటి రంగాలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

యుద్ధం లేదా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పుడు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరుగుతుందని, కంపెనీలు సాధారణంగా కొత్త పెట్టుబడులను ఆలస్యం చేస్తాయని, విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తాయని, ఉత్పత్తిని తగ్గిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. తయారీ రంగం మందగించినప్పుడు పారిశ్రామిక లోహాలకు డిమాండ్ కూడా పడిపోతుంది. ఇది వెండిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు.